సింహాచలం ఆలయానికి కొత్త పాలకవర్గం.. ఉత్తర్వుల జారీ

సింహాచలం ఆలయానికి కొత్త పాలకవర్గం.. ఉత్తర్వుల జారీ

  • Updated - 10:22 AM, Thu - 7 April 22
సింహాచలం ఆలయానికి కొత్త పాలకవర్గం.. ఉత్తర్వుల జారీ

ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం ఆలయానికి కొత్త పాలకవర్గాన్ని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 4న సింహాచలం దేవస్థానం ట్రస్టుబోర్డు పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలో ఆలయ అనువంశిక ధర్మకర్త, కేంద్ర మాజీమంత్రి, పూసపాటి అశోక్‌గజపతిరాజును చైర్ పర్సన్‌గా కొనసాగిస్తూనే మరో 14 మందిని రెండేళ్ల కాలానికి గాను సభ్యులుగా నియమించారు.

పాలకవర్గం సభ్యుల్లో సువ్వాడ శ్రీదేవి, పంచాడి పద్మ, వంకాయల సాయి నిర్మల, దశమంతుల రామలక్ష్మి, ఎం. రాజేశ్వరి, శ్రీదేవి వర్మ పెన్మత్స, బయ్యవరపు రాధ, సంపంగి శ్రీనివాసరావు, పిల్లా కృష్ణమూర్తి పాత్రుడు, దొడ్డి రమణ, గంట్ల శ్రీను బాబు, ఆర్. వీరవెంకట సతీష్, వారణాసి దినేశ్ రాజ్, కె. నాగేశ్వరరావులకు సభ్యులుగా అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక ఆహ్వానితులుగా మరో నలుగురికి అవకాశం కల్పించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా కోరాడ చంద్రమౌళి, జనపరెడ్డి శేషారత్నం, కేశప్రగడ నరసింహమూర్తి, గేదెల వరలక్ష్మి నియమితులయ్యారు.

అయితే ఇదిలా ఉంటే దినేశ్‌రాజ్‌ మార్చితో ముగిసిన గత పాలకవర్గంలోనూ సభ్యుడిగా ఉన్నారు. అలాగే గాజువాక ప్రాంతంలో వైసీపీ తరపున కార్పొరేటర్‌గా పోటీచేసి ఓటమి పాలైన దొడ్డి రమణ కూడా ఉన్నారు. ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి రెండేళ్ల పాటు ధర్మకర్తల మండలి కొనసాగుతుందని తాజా ఉత్తర్వులో పేర్కొన్నారు. ఆలయ ప్రధానార్చకుడు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా కొనసాగనున్నారు. నూతన ధర్మకర్తల మండలితో గురువారం ఉదయం 11 గంటలకు ఆలయంలో ప్రమాణస్వీకారం చేయిస్తామని ఈవో సూర్యకళ వెల్లడించారు.

Show comments