Mob Attacked-Harshika Poonacha: ప్రముఖ నటి, ఆమె భర్తపై దాడిచేసి.. దోపిడికి ప్రయత్నించిన దుండగులు

ప్రముఖ నటి, ఆమె భర్తపై దాడిచేసి.. దోపిడికి ప్రయత్నించిన దుండగులు

Harshika Poonacha

Harshika Poonacha

ఈమధ్య కాలంలో సెలబ్రిటీలను టార్గెట్‌ చేసుకుని వారి మీద దాడులు చేస్తోన్న ఘటనలు ఎక్కువయ్యాయి. సెలబ్రిటీలైతే.. భారీగా నగదు, విలువైన వస్తువులు చోరీ చేయవచ్చనే ఉద్దేశంతో కొందరు ఇలాంటి దాడులకు పాల్పడుతుంటే.. మరి కొందరేమో.. నేము, ఫేము కోసం ఇలాంటి పనులు చేస్తున్నారు. తాజాగా ఓ నటి, ఆమె భర్తపై దాడి చేసి దోపిడికి యత్నించారు దుండగులు. ఈ విషయం గురించి సదరు నటి సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించిది. నిందితుల ఫొటోలు కూడా షేర్‌ చేసింది. డిన్నర్‌ చేయడం కోసం బయటకు వచ్చిన తమకు ఇలాంటి భయానకమైన అనుభవం ఎదురయ్యిందని తెలిపింది. అంతేకాక తమ విషయంలో పోలీసులు సరిగా స్పందించలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ వివరాలు..

కన్నడ నటి హర్షిక పుణచ్చ, ఆమె భర్తపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడి.. వారి మెడలో నుంచి గొలుసు దోచుకెళ్లే ప్రయత్నం చేశారు. బెంగళూరులో ఏప్రిల్ 2న జరిగిన ఈ ఘటన గురించి తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన భర్త భువన్‌, కుటుంబసభ్యులతో కలిసి బయటకు వెళ్తుండగా.. పులకేశినగర్‌లో కొందరు వ్యక్తులు వారిపై దాడి చేశారని చెప్పుకొచ్చింది. అంతేకాక తన భర్త మెడలో ఉన్న గొలుసు దోచుకునేందుకు ప్రయత్నించారని హర్షిక వాపోయింది. జరిగిన ఘటన గురించి ఆమె సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది.

‘‘కొన్ని రోజుల క్రితం అనగా.. ఏప్రిల్‌ 2న నేను, నా భర్త, కుటుంబ సభ్యలుతో కలిసి డిన్నర్ చేయడానికి బయటకు వెళ్లాం. తినడం పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లేందుకు కారులో ఎక్కి కూర్చున్నాం. ఇంతలో కొందరు వ్యక్తులు వచ్చి మాపై దాడి చేశారు. వారిలో ఇద్దరు స్థానిక భాషలో బూతులు తిడుతూ.. నన్ను తాకడానికి ప్రయత్నం చేశారు. నా భర్త అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో.. ఆయన ముఖం మీద గుద్దారు. అయినా సరే నా భర్త ఎంతో సహనం, ఓర్పుతో ఉండి.. వారితో మాట్లాడేందుకు ప్రయత్నం చేశాడు. ఆతర్వాత కాసేపటికే 30 మందికిపైగా వచ్చి మా వద్ద ఉన్న విలువైన వస్తువులను దోచుకునేందుకు ప్రయత్నించారు’’ అని చెప్పుకొచ్చింది హర్షిక.

‘‘గుంపులో ఇద్దరు నా భర్త మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొవడానికి ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే మా ఆయన అప్రమత్తమై దానిని తన మెడలో నుంచి తీసి నాకు ఇచ్చారు. వారు మా కారును ధ్వంసం చేసి మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నం చేశారు. కారులో వృద్ధులు, కుటుంబ సభ్యులు ఉండటంతో నా భర్త సంయమనం పాటించారు. అంతేకాక ఆ ప్రాంతంలో మాకు తెలిసిన ఇన్‌స్పెక్టర్‌కి కాల్ చేశాను. అది గమనించి అంత వరకు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆ గుంపు.. ఏమీ జరగనట్లుగా ఒక సెకనులో అక్కడ నుంచి పరారయ్యారు. మేము వారి కోసం వెతకడానికి ప్రయత్నిస్తే అప్పటికే వారు అదృశ్యమయ్యారు’’ అని చెప్పుకొచ్చింది.

అంతేకాక జరిగిన సంఘటన వల్ల తాము ఎంతో భయపడి పోయామని.. పోలీసుల సాయం కోరామని.. కానీ వారు వెంటనే స్పందించలేదని హర్షిక ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘దుండగులు మాపై దాడికి యత్నించిన సమయంలో.. సమీపంలో ఒక పెట్రోలింగ్ వాహనం కనిపించడంతో అక్కడకు వెళ్లి పోలీస్‌ అధికారికి దీని గురించి వివరించి.. మాకు సాయం చేయమని కోరాము. కానీ అతడు అసలేం పట్టించుకోలేదు. పైగా డిపార్ట్‌మెంట్‌లోని ఉన్నతాధికారులతో మాట్లాడాలని చెప్పాడు. వచ్చి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు.. దుండగుల నుంచి మమ్మల్ని కాపాడలేదు’’ అని వాపోయారు.

పోలీసు అధికారి తీరుపై హర్షిక ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొన్నారు. ఏప్రిల్ 2న ఈ ఘటన జరిగిందని.. తామే బాధితులను సంప్రదించి ఫిర్యాదు చేయాలని కోరామన్నారు. కానీ, వారు మాత్రం కొంత సమయం కావాలని చెప్పినట్టు పోలీసులు చెప్పుకొచ్చారు.

Show comments