Elections 2024-Haryana Chautala Family, Hisar: ఫ్యామిలీ ఫైట్‌.. ఒకే కుటుంబం నుంచి బరిలో ముగ్గురు.. మామపై కోడళ్లు పోటీ

ఫ్యామిలీ ఫైట్‌.. ఒకే కుటుంబం నుంచి బరిలో ముగ్గురు.. మామపై కోడళ్లు పోటీ

Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల సమరంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు.. అది కూడా వేర్వేరు పార్టీల నుంచి బరిలో దిగుతున్నారు. ఆ వివరాలు..

Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల సమరంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు.. అది కూడా వేర్వేరు పార్టీల నుంచి బరిలో దిగుతున్నారు. ఆ వివరాలు..

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం నడుస్తోంది. ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్‌ జరగనుంది. ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ జరగనుండగా.. తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎలక్షన్స్‌లో విజయం కోసం అధికార, విపక్ష పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇక ఎన్నికల వేళ కొన్ని ఆసక్తికర పరిస్థితులు కనిపిస్తుంటాయి. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు, ముగ్గురు బరిలో నిలుస్తారు. అది కూడా వేర్వేరు పార్టీల నుంచి. ఇక అప్పుడు ఉంటుంది అసలు మజా. ఇక తాజాగా సార్వత్రిక ఎన్నికల వేళ ఓ చోట ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. మామ మీద ఇద్దరు కోడళ్లు బరిలో దిగడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలు..

హర్యానాలోని హిసార్ లోక్ సభ స్థానంలో ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన చౌతాలా కుటుంబానికి చెందిన అభ్యర్థుల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఈ కుటుంబంలోని ఇద్దరు కోడళ్లు, చిన్న మామ ఒకరిపై ఒకరు పోటీ చేస్తుండటంతో ఇక్కడ రాజకీయం ఆసక్తికరంగా మారింది. హిసార్ లోక్ సభ పోరులో.. ఎమ్మెల్యే నైనా చౌతాలా.. జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నుంచి, సునయన చౌతాలా.. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ) నుంచి, బీజేపీ నుంచి రంజిత్ సింగ్ చౌతాలా బరిలో దిగుతున్నారు.

వీరిలో నైనా చౌతాలా(57).. ఐఎన్ఎల్డీ చీఫ్ ఓం ప్రకాశ్ చౌతాలా పెద్ద కొడుకు, జేజేపీ చీఫ్ అజయ్ సింగ్ చౌతాలా భార్య. మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ సింగ్ చౌతాలాకు స్వయానా తల్లి కూడా. ఇక సునయన చౌతాలా(47).. విషయానికి వస్తే.. ఆమె ఓం ప్రకాశ్ చౌతాలా తమ్ముడు ప్రతాప్ సింగ్ చౌతాలా కొడుకు రవి చౌతాలా భార్య. అలాగే రంజిత్ సింగ్ చౌతాలా(78) స్వయానా మాజీ ఉప ప్రధాని చౌధరి దేవీలాల్‌కు కొడుకు, ఓం ప్రకాశ్ చౌతాలాకు స్వయానా తమ్ముడు. దీంతో చౌతాలా కుటుంబంలోని ఇద్దరు కోడళ్లు, చిన్న మామయ్య ఒకరిపై ఒకరు పోటీకి దిగినట్లయింది. ఎన్నికల్లో విజయంపై ప్రతి ఒక్కు ధీమాగానే ఉన్నారు. ఎవరికి వారే తామే గెలుస్తామంటూ ప్రచారం చేసుకుంటున్నారు.

ఇక ఈ ముగ్గురూ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇద్దరు కోడళ్లు.. మామ మీద కాస్త ఘాటుగానే విమర్శలు చేస్తుండగా.. చిన్న మామ మాత్రం కోడళ్లపై సానుకూలంగానే ఉంటూ.. పెద్దగా విమర్శల చేయకుండా ప్రచారం చేసుకుంటున్నారు. ఇక గతంలో కూడా ఇక్కడ అన్నదమ్ములు తలపడ్డారు. ఓం ప్రకాశ్ చౌతాలా, ఆయన తమ్ముడు రంజిత్ చౌతాలా రోరి అసెంబ్లీ బరిలో ఒకరిపై ఒకరు పోటీ చేశారు. దబ్వాలీ నుంచి అజయ్ చౌతాలా, రవి చౌతాలా కూడా ఒకరిపై ఒకరు బరిలోకి దిగారు. తాజాగా మరోసారి అదే సీన్‌ రిపీట్‌ అయ్యింది. కాగా, రాష్ట్రంలోని మొత్తం 10 ఎంపీ సీట్లకు ఈ నెల 25న పోలింగ్ జరగనుంది.

Show comments