కూల్చివేయడానికి ఇదేమన్నా సినిమా సెట్టింగా పవన్ కళ్యాణ్ ?

కూల్చివేయడానికి ఇదేమన్నా సినిమా సెట్టింగా పవన్ కళ్యాణ్ ?

  • Published - 01:45 PM, Tue - 21 January 20
కూల్చివేయడానికి  ఇదేమన్నా సినిమా సెట్టింగా పవన్ కళ్యాణ్ ?

వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చి వేసేవరకు జనసేన నిద్రపోదని వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్ మాటలకు కూల్చివేయడానికి ఇదేమీ సినిమా సెట్టింగ్ కాదని ఎద్దేవా చేసారు జోగి రమేష్.

వివరాల్లోకి వెళితే వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చివేసేవరకూ జనసేన నిద్రపోదని వ్యాఖ్యానించారు. మూడు కాకుంటే ముప్పై రాజధానులను పెట్టుకోమని, తిరిగి అమరావతికి రాజధానిని ఎలా తీసుకురావాలో తనకు తెలుసని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం కూలిపోయే ప్రభుత్వమని పవన్ విమర్శించారు. అమరావతిని శాశ్వత రాజధానిని చేయడానికి తాను ప్రయత్నాలు చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

పవన్ వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అసెంబ్లీలో కౌంటర్ వేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జేజేలు పలుకుతున్నారని గుర్తు చేసారు. కూల్చివేయడానికి జగన్ ప్రభుత్వం సినిమా సెట్టింగ్ కాదని,కోట్లాది మంది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని ఉద్ఘాటించారు. జగన్ మోహన్ రెడ్డి ఒక కోట అని ఆ కోటని అంగుళం కూడా పెకలించలేరని జోగి రమేష్ అన్నారు. ఢిల్లీకి వెళ్లి పవన్ చేసేది ఏమీ లేదని ఎద్దేవా చేసారు.

Show comments