తమిళ తెలుగు సూపర్ స్టార్లు ఒకే సినిమాలో..

తమిళ తెలుగు సూపర్ స్టార్లు ఒకే సినిమాలో..

  • Published - 12:35 PM, Wed - 16 November 22
తమిళ తెలుగు సూపర్ స్టార్లు ఒకే సినిమాలో..

మనకు సూపర్ స్టార్ అంటే ముందు గుర్తొచ్చేది కృష్ణ ఆ తర్వాత ఆయన వారసుడు మహేష్ బాబు. అలాగే తమిళంలో ఈ బిరుదు దశాబ్దాల తరబడి కిరీటంలా ధరించిన హీరో రజినీకాంత్. ఈ ఇద్దరు సీనియర్ల కాంబో అంటే ఖచ్చితంగా ఆసక్తి కలిగించే విషయమే. అప్పట్లో ఇది పలుమార్లు సాధ్యమయ్యింది. మచ్చుకొకటి చూద్దాం. కృష్ణ-రజని కాంబినేషన్లో వచ్చిన అన్నదమ్ముల సవాల్(1978)మంచి విజయం సాధించింది. ఇదే జోడితో మరో సినిమా తీయాలని నిర్మాతలు ప్రసాదరావు, శశిభూషణ్ లు రచయిత త్రిపురనేని మహారథితో కథను సిద్ధం చేయించారు. వాళ్ళ ఇమేజ్ కి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఓ పవర్ఫుల్ సబ్జెక్టు రెడీ అయ్యింది.

 

యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన దర్శకులు కెఎస్ ఆర్ దాస్ కంటే బెస్ట్ ఆప్షన్ ఇంకెవరు కనిపించలేదు. గీతా, మాధవిలను హీరోయిన్లుగా ఎంచుకున్నారు. ఇతర పాత్రల్లో నాగభూషణం, అల్లు రామలింగయ్య, గిరిబాబు, చలం, ప్రభాకర్, సాక్షి రంగారావు తదితరులు ఫిక్స్ అయ్యారు. సత్యం సంగీతం సమకూర్చగా ఎస్ఎస్ లాల్ ఛాయాగ్రహణం, పి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ విభాగాలు నిర్వహించారు. అప్పటికి సినిమా స్కోప్ వ్యవహారం చాలా ఖరీదుగా ఉండేది. అల్లూరి సీతారామరాజు తర్వాత కథకు అవసరమైతే ఈ మోడల్ లోనే తీయమని కృష్ణ ప్రోత్సహించేవారు. ఇద్దరూ అసాధ్యులే డెప్త్ దాన్ని డిమాండ్ చేయడంతో ప్రొడ్యూసర్లు ఎస్ అన్నారు.

లొకేషన్లు సెట్లకు భారీగా ఖర్చయ్యింది. నర్సాపూర్ అడవుల్లో, శంషాబాద్ దగ్గర వేసిన ప్రత్యేక జాతర సెట్లో, ఘట్కేసర్ రైలు ట్రాక్, ఎత్తిపోత జలపాతం వద్ద ఇలా రాజీ లేకుండా ఖర్చు పెడుతూ పోయారు. సినిమా అధిక శాతం అడవిలోనే సాగుతుంది. కృష్ణ రజిని క్యారెక్టర్లు ఒకే నేపథ్యంలో పరస్పర విరుద్ధ లక్ష్యాలతో ఉంటూ చివరికి ఏకమవుతాయి. షోలే తదితర బ్లాక్ బస్టర్ల స్ఫూర్తితో తీసిన సన్నివేశాలు ఇందులో కనిపిస్తాయి. 1979 జనవరి 25న విడుదలైన ఇద్దరూ అసాధ్యులే భారీ అంచనాల మధ్య వాటిని నిలబెట్టుకోలేక యావరేజ్ గా నిలిచింది. కేవలం వారం గ్యాప్ తో వచ్చిన ఎన్టీఆర్ డ్రైవర్ రాముడు సూపర్ హిట్టయ్యి దెబ్బ కొట్టడంతో నిర్మాతకు నష్టాలు తప్పలేదని అప్పట్లో మీడియా కథనాలు వచ్చాయి. కృష్ణ రజనిల స్క్రీన్ ప్రెజెన్స్ నటన ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి.

Show comments