Pakistan vs Sri Lanka Kusal Mendis In Hospital: World Cup: సెంచరీ కొట్టాక హాస్పిటల్​లో చేరిన స్టార్ క్రికెటర్!

World Cup: సెంచరీ కొట్టాక హాస్పిటల్​లో చేరిన స్టార్ క్రికెటర్!

  • Author singhj Published - 07:58 AM, Wed - 11 October 23
  • Author singhj Published - 07:58 AM, Wed - 11 October 23
World Cup: సెంచరీ కొట్టాక హాస్పిటల్​లో చేరిన స్టార్ క్రికెటర్!

ఉప్పల్ స్టేడియం పాకిస్థాన్​కు బాగా కలిసొస్తోంది. వార్మప్ మ్యాచ్​ల నుంచి హైదరాబాద్​లోనే ఆడుతూ వచ్చిన పాక్.. వరల్డ్ కప్​-2023లో వరుసగా రెండో విక్టరీ కొట్టింది. శ్రీలంకతో మంగళవారం జరిగిన మ్యాచ్​లో ఆ టీమ్ రికార్డు టార్గెట్​ను ఛేదించింది. లంక విసిరిన 345 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి, మరో 10 బంతులు ఉండగానే పాక్ అందుకుంది. బ్యాటింగ్​లో మెరిసిన శ్రీలంక.. బౌలింగ్​లో మాత్రం దారుణంగా ఫెయిలైంది. అదే ఆ టీమ్ కొంప ముంచింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన లంకకు ఫస్ట్ ఓవర్లోనే షాక్ తగిలింది. కుశాల్ పెరీరా గోల్డెన్​ డక్​గా వెనుదిరిగాడు. అయితే నిశాంక (51), కుశాల్ మెండిస్ మాత్రం తగ్గలేదు.

పాకిస్థాన్​ బౌలర్లపై మెండిస్ కౌంటర్ ఎటాక్​కు దిగాడు. హాఫ్ సెంచరీ చేశాక నిశాంక పెవిలియన్​కు చేరినా.. సమరవిక్రమతో కలసి కుశాల్ మెండిస్ అటాకింగ్ గేమ్ ఆడాడు. 40 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మెండిస్.. తర్వాతి 50 రన్స్​ను 25 బాల్స్​లోనే రాబట్టాడు. హసన్ అలీ బౌలింగ్​లో కళ్లు చెదిరే సిక్స్​తో వన్డే కెరీర్​లో మూడో సెంచరీ సాధించాడు. అతడి బౌలింగ్​లోనే మరో సిక్సర్ బాదాక మెండిస్ ఔటయ్యాడు. సమరవిక్రమ బౌండరీలతో విరుచుకుపడినా అవతలి ఎండ్​లో వికెట్లు పడటంతో లంక 400 మార్క్​ను చేరుకోలేకపోయింది. ఆఖరి 10 ఓవర్లలో లంక 5 వికెట్లు కోల్పోయి 61 రన్స్ చేసింది. ఛేజింగ్​కు దిగిన పాక్​కు శుభారంభం దక్కలేదు. దాయాది ఓపెనర్లు ఇమాముల్ హక్ (12), కెప్టెన్ బాబర్ ఆజమ్ (10) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు.

ఒక టైమ్​లో పాకిస్థాన్ టార్గెట్ ఛేజ్ చేయడం అసాధ్యంలాగే కనిపించింది. కానీ క్రీజులో కుదురుకుంటే రన్స్ తేలిగ్గా వస్తాయని అర్థం చేసుకున్న షఫీక్ (113), రిజ్వాన్ (131 నాటౌట్) పట్టుదలతో బ్యాటింగ్ చేశారు. వికెట్ కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ, స్రైక్ రొటేట్ చేస్తూ గేమ్​ను ముందుకు తీసుకెళ్లారు. వీళ్లిద్దరూ మూడో వికెట్​కు 176 రన్స్ జోడించారు. ఇద్దరూ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. చివర్లో షఫీక్ ఔటైనా ఇఫ్తికార్ అహ్మద్ (22 నాటౌట్)తో కలసి రిజ్వాన్ పని పూర్తి చేశాడు. అయితే పాక్​తో మ్యాచ్​లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ బాదిన లంక బ్యాటర్ కుశాల్ మెండిస్ తొడ కండరాలు పట్టేయడంతో ఆస్పత్రితో చేరాడు. బ్యాటింగ్ పూర్తయ్యాక హాస్పిటల్​కు వెళ్లాడు మెండిస్. అతడి ప్లేసులో హేమంత సబ్​స్టిట్యూట్​గా వచ్చాడు. కుశాల్ మెండిస్ త్వరగా కోలుకోవాలని లంక ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఇదీ చదవండి: గిల్ వరల్డ్ కప్ నుండి తప్పుకుంటే.. టీమిండియా పరిస్థితి ఏంటి?

Show comments