Heavy Rain in many areas in Hyderabad: హైదరాబాద్ లో కుండపోత వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

హైదరాబాద్ లో కుండపోత వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

గత వారం వరకు ముఖం చాటేసిన వరుణుడు మళ్లీ విజృంబిస్తున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రంలో వర్షాలు పుంజుకున్నాయి. ఈ నెలాఖరు వరకు రాష్ర్ట వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఓ పక్క మబ్బులు, మరోపక్క ఎండతో మిశ్రమ వాతావరణం కనిపించినప్పటికి మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కారు మబ్బులు కమ్మేసి ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లన్నీ జలమయమయ్యాయి.

హైదరాబాద్ లో ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశమంతా మేఘావృతమై ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని టోలీచౌకి, షేక్ పేట, మణికొండ, జూబ్లీహిల్స్, మాదాపూర్, క్రిష్ణానగర్, యూసఫ్ గూడ, ఖైరతాబాద్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట సహా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దంచి కొడుతున్న వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో ఒక్కసారిగా కురుస్తున్న భారీ వర్షంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు.

Show comments