Gautam Gambhir Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గౌతం గంభీర్.. వరల్డ్ కప్​ మనదేనంటూ..!

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గౌతం గంభీర్.. వరల్డ్ కప్​ మనదేనంటూ..!

  • Author singhj Updated - 11:53 AM, Thu - 28 September 23
  • Author singhj Updated - 11:53 AM, Thu - 28 September 23
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గౌతం గంభీర్.. వరల్డ్ కప్​ మనదేనంటూ..!

టీమిండియా లెజెండ్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. బుధవారం నాడు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో భార్య, కుటుంబ సభ్యలతో కలసి స్వామి వారి సేవలో పాల్గొన్నాడు. వెంకన్న దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు గంభీర్ దంపతులకు వేదాశీర్వచనం అందించారు. దేవాలయ అధికారులు భారత మాజీ ఓపెనర్​ను సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గౌతం గంభీర్ తిరుమల దర్శనానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.

తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో గంభీర్ మాట్లాడాడు. ఈసారి వన్డే వరల్డ్ కప్​ గెలుచుకునేందుకు టీమిండియాకు మంచి అవకాశాలు ఉన్నాయని అన్నాడు. దేశంలోని 140 కోట్ల మంది భారతీయుల ప్రార్థనలతో పాటు తిరుమల వెంకన్న ఆశీస్సులతో టీమిండియా ఈసారి ప్రపంచ కప్ నెగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో గంభీర్ ఎక్స్​పర్ట్ ప్యానల్ కామెంటేటర్​గా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే అఫీషియల్ బ్రాడ్​కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో పాల్గొంటూ వివిధ జట్ల బలాలు, బలహీనతల మీద తన అభిప్రాయాలను వెల్లడించాడు.

వరల్డ్ కప్ గెలవాలంటే ఏ ఒక్కరి పెర్ఫార్మెన్స్ వల్లో సాధ్యం కాదని పలు సందర్భాల్లో గంభీర్ చెప్పాడు. టీమ్ మొత్తం సమష్టిగా రాణిస్తే విజయం దక్కుతుందని అన్నాడు. ఇక, భారత్ ఆతిథ్యం ఇస్తున్న వన్డే ప్రపంచ కప్ అక్టోబర్ 5వ తేదీ నుంచి మొదలుకానుంది. మొదటి మ్యాచ్​లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్​తో రన్నరప్ న్యూజిలాండ్ తలపడనుంది. ఆ తర్వాతి రోజు పాకిస్థాన్ జట్టు తమ తొలి మ్యాచ్​లో పసికూన నెదర్లాండ్స్​తో పోటీపడనుంది. వరల్డ్ కప్ వేటను ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్​తో భారత్ మొదలుపెట్టనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది.

ఇదీ చదవండి: ఓడినా ఆ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నాం: రోహిత్ శర్మ

Show comments