Ayodhya Ram Mandir Ceremony-Fatwa, Islamic Chief: అయోధ్య మందిర ప్రారంభోత్సవానికి వెళ్లిన ముస్లిం చీఫ్‌కు బెదిరింపులు.. ఫత్వా జారీ

అయోధ్య మందిర ప్రారంభోత్సవానికి వెళ్లిన ముస్లిం చీఫ్‌కు బెదిరింపులు.. ఫత్వా జారీ

Ayodhya Ram Mandir Ceremony: అయోధ్య రామ మందిర ప్రాంరభోత్సవానికి హాజరైన ఓ ముస్లిం చీఫ్‌కు బెదిరింపులు రావడమే కాక ఫత్వా కూడా జారీ చేశారు. ఆ వివరాలు..

Ayodhya Ram Mandir Ceremony: అయోధ్య రామ మందిర ప్రాంరభోత్సవానికి హాజరైన ఓ ముస్లిం చీఫ్‌కు బెదిరింపులు రావడమే కాక ఫత్వా కూడా జారీ చేశారు. ఆ వివరాలు..

హిందువులు ఎన్నో వందల ఏళ్లుగా ఎదురు చూస్తోన్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. జనవరి 22, సోమవారం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా మందిర ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాలను నిర్వహించారు. కన్నులపండువగా జరిగిన ఈ వేడుక చూడటం కోసం దేశవిదేశాల నుంచి రామయ్య భక్తులు తరలి వచ్చారు. మతాలతో సంబంధం లేకుండా మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో బాలరాముడి మందిర ప్రారంభోత్సవానికి హాజరైన ఓ ముస్లి చీఫ్‌కు బెదిరింపులు వస్తున్నాయట. ఆ వివరాలు..

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ సందర్బంగా.. రామజన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టు దేశవ్యాప్తంగా సుమారు 8వేల మంది ప్రముఖులకు ఆహ్వానాలు పంపింది. ఈక్రమంలో శ్రీరామ జన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో పిటిషనర్‌గా వ్యవహరించిన ఇక్బాల్‌ అన్సారీతో పాటు ఇమామ్‌ ఉమర్‌ అహ్మద్‌ ఇల్‌యాసికి కూడా ట్రస్టు ఆహ్వానాలు అందజేసింది. దాంతో ఇల్‌యాసి మందిర ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.

మందిర ప్రారంభోత్సవానికి వెళ్లి వచ్చిన తర్వాత తనకు బెదిరింపు కాల్స్‌ వచ్చాయని ఇల్‌యాసి తెలిపారు. ముఖ్యంగా ఒక వర్గం తనను తీవ్రంగా తిడుతున్నట్లు వెల్లడించారు. ఇక సోషల్ మీడియా వేదిక ద్వారా తనకు వ్యక్తిగతంగా ఫత్వా కూడా జారీ చేశారని ఇల్‌యాసి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తన ఫోన్ నంబర్‌ను సేకరించిన దుండగులు దాన్ని సోషల్ మీడియాలో షేర్‌ చేసి వేధించడమే కాక బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

2 రోజులు ఆలోచించి నిర్ణయం..

అన్ని మసీదు అథారిటీలకు, ఇమామ్‌లకు తన ఫోన్ నంబర్‌ను షేర్ చేసి.. తనను బహిష్కరించాలని ఫత్వాలో పేర్కొన్నారని ఇమామ్ ఇల్‌యాసి తెలిపారు. తాను అయోధ్య ప్రారంభోత్సవానికి హాజరైనందుకు క్షమాపణలు చెప్పాలని.. దాంతోపాటు ఇమామ్ పదవి నుంచి తప్పుకోవాలని దానిలో పేర్కొన్నట్లు వివరించారు. ఫత్వా జారీ చేయడానికి కారణం కేవలం అది జారీ చేసిన వారికి మాత్రమే తెలుసన్నారు. తనకు రామ జన్మభూమి ట్రస్ట్‌ నుంచి ఆహ్వానం అందిందని.. అందుకే ఆ కార్యక్రమానికి హాజరైనట్లు చెప్పారు.

అయితే అయోధ్య ప్రారంభోత్సవానికి వెళ్లాలా వద్దా అనే దాని గురించి తాను 2 రోజుల పాటు ఆలోచించి ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎందుకంటే అప్పుడు తీసుకునే నిర్ణయమే తన జీవితంలో అతిపెద్ద నిర్ణయం అవుతుందని తనకు తెలుసన్నారు. మత సామరస్యం, దేశ మంచి కోసం, జాతి ప్రయోజనాల దృష్ట్యా అయోధ్యకు వెళ్లినట్లు ఇమామ్ ఇల్‌యాసి వెల్లడించారు.

మందిర ప్రారంభోత్సవానికి వెళ్లిన తనకు అయోధ్య ప్రజలు సాదర స్వాగతం పలికారని.. తాను వెళ్లడం పట్ల సాధువులు, ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారని ఇమామ్ ఇల్‌యాసి గుర్తు చేసుకున్నారు. తాను ప్రేమను పంచడానికే అయోధ్యకు వెళ్లానని.. అది నెరవేరిందని చెప్పారు. మన ప్రార్థనలు, ఆచారాలు, మతం, కులం, విశ్వాసాలు వేరు కావచ్చు.. కానీ మన అతిపెద్ద మతం మానవత్వమేనని అన్నారు. అంతేకాక తాను ఎలాంటి తప్పు చేయలేదని.. అందుకే క్షమాపణలు చెప్పే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. తనకు ఫత్వా జారీ చేసే అధికారం ఎవరికీ లేదన్నారు ఇల్‌యాసి.

Show comments