వరద ప్రభావిత జిల్లాలకు సీఎం జగన్‌ తక్షణ సాయం.. వారి కోసం రూ.12 కోట్లు

వరద ప్రభావిత జిల్లాలకు సీఎం జగన్‌ తక్షణ సాయం.. వారి కోసం రూ.12 కోట్లు

రాష్ట్రంలో వానలు దంచి కొడుతున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. వర్షాలు, వరదలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎంవో అధికారులతో సీఎం జగన్ ఈ సమావేశం చేపట్టారు. గోదావరికి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రజలు ఇబ్బంది పడకుండా.. అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గోదావరి నదీ తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ ముంపు బాధితులకు అండగా నిలవాలన్నారు. అంతేకాక భారీ వర్షాలు కురుస్తోన్న ఏలూరు, ఉభయ గోదావరి, కోనసీమ జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులతో పాటు, భారీ వర్షాలు కురుస్తున్న ఇతర ప్రాంతాల్లో పరిస్థితులు గురించి కూడా సీఎం జగన్‌ ఆరా తీశారు. సహాయక చర్యలు అందించడంలో ఏమాత్రం ఆలస్యం చేయవద్దని అధికారులను ఆదేశించారు.

వరద బాధితు జిల్లాలకు సీఎం జగన్‌ శుభవార్త చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత జిల్లాల్లో అత్యవసర సహాయక చర్యలు చేపట్టేందుకు గాను.. తక్షణ సాయంగా 12 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారు సీఎం జగన్‌. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. వరద ప్రాంతాల్లో అత్యవసర సహాయక కేంద్రాల ఏర్పాటు, ముంపు గ్రామాల నుంచి ప్రజలను తరలించడమేకాక బాధితులకు ఆహారం, నీరు, పాలు, హెల్త్ క్యాంపు, శానిటేషన్ వంటి వాటి కోసం ఈ నిధులు మంజూరు చేసింది జగన్‌ ప్రభుత్వం.

వరద ప్రభావిత జిల్లాలైన అల్లూరి డిస్ట్రిక్‌ 3 కోట్ల రూపాయలు, తూర్పుగోదావరి జిల్లాకు రూ,1 కోటి, కోనసీమకు రూ.3 కోట్లు, ఏలూరు జిల్లాకు 3 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరికి రూ. 2 కోట్లు కేటాయిస్తూ.. మొత్తం 12 కోట్లు నిధులు మంజూరు చేసింది ఏపీ సర్కార్. ఈ మేరకు రెవిన్యూ (డిజాస్టర్ మేనేజ్మెంట్) స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ ఐఏఎస్ జీవో జారీ చేశారు.

ఇక సహాయక శిబిరాల్లో ఎలాంటి కొరత లేకుండా చూసుకోవాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. తాగునీరు సహా ఇతరత్రా సదుపాయాల విషయంలో ఎక్కడా లోటు రాకూడదని స్పష్టం చేశారు. సహాయక చర్యల విషయంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని, వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఎప్పటికప్పుడు వరదల గురించి సమాచారం తెప్పించుకుని, ఆ మేరకు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు.

Show comments