Huzurabad-Badvel ByPoll : నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసింది.. బరిలో భారీగా అభ్యర్థులు

Huzurabad-Badvel ByPoll : నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసింది.. బరిలో భారీగా అభ్యర్థులు

Huzurabad – Badvel: తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న ఉప ఎన్నికల ప్రక్రియలో మరో అంకం పూర్తయింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ రోజు సాయంత్రంతో ముగిసింది. దీంతో పోటీలో ఉండే అభ్యర్థులు ఎవరన్నది తేలిపోయింది. తెలంగాణలోని హుజురాబాద్‌ ఉప ఎన్నికల బరిలో మొత్తం 30 మంది పోటీ పడబోతున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేలు ఉప ఎన్నికల తుది పోరులో 15 మంది ప్రజల తీర్పును కోరేందుకు సిద్ధమయ్యారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో జరుగుతున్న ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌లు హోరాహోరీగా పోరాడుతున్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఏ ఎన్నికపై కూడా ఇంత ఆసక్తి నెలకొనలేదు. టీఆర్‌ఎస్‌ కూడా ఏ ఉప ఎన్నికను ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోలేదు. పార్టీల తరఫున అభ్యర్థులు పోటీ చేస్తున్నా.. కేసీఆర్‌కు, ఆయన పూర్వ సన్నిహితుడైన ఈటల రాజేందర్‌కు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.

Also Read : హరీష్‌రావును కూడా టీఆర్‌ఎస్‌ నుంచి పంపేస్తారా..? ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యల్లో నిజమెంత..?

హుజురాబాద్‌లో మొత్తం 61 నామినేషన్ల దాఖలవగా.. పరిశీలనలో 19 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. పరిశీలన తర్వాత 42 నామినేషన్లు మిగలగా.. 12 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్‌ టీపీ సహా స్వతంత్రులు మొత్తం 30 మంది తుది పోరులో పోటీపడబోతున్నారు. ఇందులో ఉపాధి హామీ పథకం ఫీల్ట్‌ అసిస్టెంట్లు కూడా ఉన్నారు.

బద్వేల్‌ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన పార్టీలు పోటీ నుంచి తప్పుకున్నా.. జనసేన బీజేపీకి మద్ధతు ఇస్తోంది. దీంతో బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయనే అంశంపై ఆసక్తి నెలకొంది. బద్వేల్‌ ఉప ఎన్నికల్లో 27 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. అందులో 9 నామినేషన్ల చెల్లకుండా పోయాయి. పరిశీలన తర్వాత 18 నామినేషన్లు మిగలగా.. అందులో ముగ్గురు మాత్రమే తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ సహా వివిధ పార్టీలు, స్వతంత్రులు మొత్తం 15 మంది బద్వేల్‌ బరిలో నిలుచున్నారు. ఈ నెల 30వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్‌ జరగబోతోంది. వచ్చే నెల 2వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడికానున్నాయి.

Also Read : Badvel By Poll TDP -బద్వేలులో టీడీపీ ఢోలాయమానం, బాబు నిర్ణయంతో పార్టీ శ్రేణుల్లో అయోమయం

Show comments