APSRTC బస్సులో మంటలు.. డ్రైవర్‌ చేసిన పనితో

APSRTC బస్సులో మంటలు.. డ్రైవర్‌ చేసిన పనితో

రన్నింగ్‌లో ఉన్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే కళ్ల ముందే బస్సు తగలబడి పూర్తిగా దగ్ధం అయ్యింది. ప్రమాదం సమయంలో బస్సులో సుమారు 47 మంది ప్రయాణికులు ఉన్నారు. కానీ డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం చెన్నైలో గురువారం రాత్రి 9.30 గంటలకు చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మాధవరం నుంచి ఆత్మకూరుకు 47మంది ప్రయాణికులతో బయలుదేరింది. రాత్రి 9.30 గంటలకు చెన్నైలోని రెడ్‌ హిల్స్‌ సమీపంలోకి రాగానే.. ఒక్కసారిగా బస్సు ఇంజిన్‌ నుంచి పొగలు వచ్చాయి. తర్వాత మంటలు కూడా రావడంతో.. డ్రైవర్‌ అప్రమత్తమయ్యారు.

మంటలు రావడంతో వెంటనే డ్రైవర్‌ బస్సును పక్కకు ఆపేశాడు. ఆ తర్వాత ప్రమాదం గురించి ప్రయాణికుల్ని అలర్ట్ చేయడంతో.. వారంత కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు పెట్టారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ తర్వాత మంటలు తీవ్రంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే.. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. డ్రైవర్ అప్రమత్తతతో బస్సులో ఉన్న 47మందికి ప్రమాదం తప్పిపోవడంతో.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Show comments