Maidaan Movie Review & Rating: మైదాన్ రివ్యూ.. అజయ్ దేవగణ్ నటించిన స్పోర్ట్ డ్రామా ఎలా ఉందంటే

Maidaan Review: మైదాన్ రివ్యూ.. అజయ్ దేవగణ్ నటించిన స్పోర్ట్స్ డ్రామా ఎలా ఉందంటే

హైదరాబాద్ కు చెందిన ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం వ్యక్తిగత జీవితం ఆధారంగా తెరకెక్కిన మైదాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే..

హైదరాబాద్ కు చెందిన ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం వ్యక్తిగత జీవితం ఆధారంగా తెరకెక్కిన మైదాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే..

మైదాన్‌

20240410, U/A
స్పోర్ట్స్ డ్రామా
  • నటినటులు:అజయ్ దేవగణ్‌, గజరాజ్ రావ్, ప్రియమణి, రుద్రనీల్ ఘోష్, చైతన్య శర్మ, దేవయాన్ష్‌ త్రిపాఠి, ఆయేషా వింద్రా తదీతరులు
  • దర్శకత్వం:అమిత్ శర్మ
  • నిర్మాత:బోనీ కపూర్, జీ 5 స్టూడియోస్, అరుణవ జాయ్ సేన్‌గుప్తా, ఆకాష్ చావ్లా
  • సంగీతం:ఏఆర్ రెహమాన్‌
  • సినిమాటోగ్రఫీ:తుషార్‌ కాంతిరాయ్‌, ఫ్యోడర్‌ లియాస్‌

3.5

ఓ వైపు హీరోగా రాణిస్తూనే మరో వైపు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ.. తనలోని నటుడిని తెర మీద ఆవిష్కరిస్తూ.. కెరీర్ లో ముందుకు సాగుతున్నాడు అజయ్ దేవగణ్. కొన్ని రోజుల క్రితం సైతాన్ సినిమాతో హిట్టు కొట్టగా.. తాజాగా మైదాన్ అనే స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హైదరాబాద్ కు చెందిన ఫుట్బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బుధవారం నాడు అనగా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైంది. మరి మైదాన్ ఎలా ఉందంటే..

కథ ఏంటంటే..

1952 ఒలింపిక్స్ హెల్సెంకీలో జరిగాయి. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత ఫుట్‌బాల్‌ జట్టు, యుగోస్లేవియా చేతిలో ఘోరంగా ఓడిపోతుంది. సరైన బూట్లు కూడా లేని భారత ఆటగాళ్లు తీవ్రంగా గాయాలపాలవుతారు. ఇక ఒలింపిక్స్‌లో భారత్‌ ప్రదర్శనని ఎత్తి చూపుతూ పత్రికలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తాయి. ఈ క్రమంలో భారత ఫుట్‌బాల్‌ జట్టుకు కోచ్‌ గా ఉన్న సయ్యద్ అబ్దుల్ రహీమ్ (అజయ్ దేవగణ్‌) ఆటగాళ్లకు ఎలా అండగా నిలబడ్డాడు.. జట్టును మళ్లీ ఎలా రెడీ చేశాడు.. ఆ తర్వాత జరిగిన టోర్నమెంట్‌లలో టీమ్‌ ఇండియా ఎలా రాణించింది.. ఈ ప్రయాణంలో సయ్యద్‌, ఆటగాళ్లు ఎదుర్కొన్న సమస్యలు, సవాళ్లు ఏంటి.. వాటిరి ఎలా దాటారో తెలియాలంటే మైదాన్ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ..

మైదాన్ సినిమా కథ విషయానికి వస్తే.. హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం వ్యక్తిగత జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. 1952 నుంచి 1962 వరకు భారత ఫుట్ బాల్ జట్టు కోచ్ గా రహీం ప్రయాణమే ఈ సినిమా. హెల్సెంకీ‌ ఒలంపిక్స్ నుంచి 1962లో జరిగిన ఏషియన్స్ గేమ్స్‌లో భారత జట్టు బంగారు పతకం గెలుచుకొనే వరకు జరిగిన సంఘటనలు, ఫుట్ బాల్ అసోసియేషన్‌లో చోటు చేసుకున్న రాజకీయాలు.. ఆటగాళ్లు ఎదుర్కొన్న సవాళ్లు.. వాళ్లకు అబ్దుల్ రహీ ఎలా అండగా నిలిచి విజయ తీరాలకు చేర్చాడు అనే అంశాలను దర్శకుడు అమిత్ శర్మ భావోద్వేగంగా తెరకెక్కించారు. ఫస్టాఫ్‌ కాస్త నెమ్మదిగా సాగినా.. సెకాండాఫ్ మాత్ర అద్భుతంగా తెరకెక్కించాడు.

ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. కథ సరికొత్త మలుపు తిరుగుతుంది. ప్రతి సీన్ అద్భుతంగా ఉంటుంది. ప్రేక్షకులు రెప్ప వేయడం మర్చిపోయి మరీ సినిమాలో లీనమవుతారు. ఫుట్‌బాల్‌ టీమ్‌ సిద్ధమైన తర్వాత ఆట కోసం వాళ్లను సిద్ధం చేయడం, కోచింగ్ ఇవ్వడంతో పాటు ఆటగాళ్లను ఉద్దేశిస్తూ సయ్యద్‌ ఇచ్చే ఎమోషనల్ స్పీచ్‌లు భావోద్వేగ భరితంగా సాగుతాయి. ఒలింపిక్స్ ఓటమి తర్వాత.. భారత జట్టు.. ఒక్కో మ్యాచ్‌ గెలుస్తూ ముందుకు సాగుతున్నప్పుడు.. తెర ముందు ఉన్న ప్రేక్షకులు తీవ్ర భావోద్వేగానికి గురవుతారు. మ్యాచ్‌లను చిత్రీకరించిన తీరు సహజంగా ఉండటమే అందుకు కారణం. తెర మీద టీమ్ ఇండియా గోల్‌ కొట్టిన ప్రతిసారీ.. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడే ఆ గోల్‌ కొట్టిన ఆనందాన్ని పొందుతాడంటే అతిశయోక్తి కాదు. క్లైమాక్స్ సీన్స్ సినిమాను ఎక్కడో నిలిపాయి. చివరి 30 నిమిషాలు భావోద్వేగంతో ప్రతి ఒక్కరిలోనూ కన్నీళ్లు వచ్చేలా చేస్తాయి. సిసినిమా అయిపోయిన తర్వాత కూడా మైదాన్ ప్రేక్షకుడిని వెంటాడుతుంది.

ఎవరెలా చేశారంటే..

ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ పాత్రలో అజయ్‌ దేవగణ్‌ నటించారు అనడం కంటే.. జీవించారు అని చెప్పడం కరెక్ట్.. జట్టుకు శిక్షణ ఇవ్వడం, ఉత్తేజపరచడం, సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌లో ఆయన నటన వర్ణించడానికి మాటలు చాలవు. ఇక రహీమ్ భార్యగా ప్రియమణి, గజరాజ్, ఆటగాళ్లుగా నటించిన ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల పరిధి మేరకు రాణించారు.

టెక్నికల్ అంశాలు..

చాలా ఏళ్ల తర్వాత మ్యూజిక్‌తో ఏఆర్ రెహ్మాన్ మ్యాజిక్ చేశాడు. ఆయన అందించి సంగీతం సినిమాను మరో మెట్టు పైకి ఎక్కించింది అని చెప్పవచ్చు. సినిమాటోగ్రఫి అద్భుతం. ఎడిటింగ్, సౌండ్ డిజైనింగ్, లైటింగ్, అన్ని సాంకేతిక విభాగాలు సినిమా చూసినంత సేపు మరో ప్రపంచంలో ఉన్న ఫీలింగ్ కలిగిస్తుంది. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

  • అజయ్‌ దేవ్‌గణ్‌ నటన
  • సెకాండాఫ్
  • టెక్నికల్ టీమ్ పని తీరు

బలహీనతలు

  • సినిమా లెంత్
  • ఫస్టాఫ్ లో కొన్ని సన్నివేశాలు

చివరిగా: మైదాన్‌ ఓ భావోద్వేగభరితమైన స్పోర్ట్స్‌ డ్రామా.

(*ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Show comments