వైఎస్సార్‌ జలకళ పథకంలో కీలక సవరణలు

వైఎస్సార్‌ జలకళ పథకంలో కీలక సవరణలు

సన్న, చిన్నకారు రైతుల్లో జీవితాల్లో వెలుగులు నింపేలా మెట్ట భూముల్లో బోర్లు వేసే పథకానికి ్రఋకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సర్కార్‌.. అన్నదాతలకు మరింత మేలు చేసేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ప్రారంభించే సమయంలో బోరు వేయడంతోపాటు మోటారు, విద్యుత్‌ కనెక్షన్‌ కూడా ఉచితంగా అందిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హమీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీని అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న సన్న, చిన్నకారు రైతులకు బోరు వేయడంతోపాటు మోటారు/పంపుసెట్‌ను ప్రభుత్వం అందించనుంది. పంపుసెట్‌కు అవసరమైన విద్యుదీకరణ కూడా ఉచితంగా చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మోటారు పంపు సెట్‌తోపాటు కేసింగ్‌ పైపు, పైపులు, విద్యుత్‌ కేబులు, ప్యానెల్‌ బోర్డు తదితర ఇతర అన్నింటిని ఉచితంగా ఇచ్చేలా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు వైఎస్సార్‌ జలకళ పథకం మార్గదర్శకాలను సైతం రాష్ట్ర ప్రభుత్వం సవరించింది.

జలకళ పథకం అమలుపై ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులకు దిశానిర్ధేశం చేశారు. పథకం దరఖాస్తు ఫారంను విడుదల చేశారు. రైతులు తమ పొలం పొస్‌బుక్, ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు తదితర పత్రాల నకళ్లను వలంటీర్లకు అందిస్తూ పథకం కోసం దరఖాస్తు చేయాలని కోరుతున్నారు. పథకం ప్రారంభించిన రోజు నుంచే వలంటీర్లు కూడా తమ పరిధిలోని రైతుల ఇళ్లకు వెళ్లి పథకం గురించి వివరిస్తూ.. అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. తాజాగా సవరించిన ఈ పథకంతో ఒక్కొక్క రైతులకు బోరు, మోటారు, విద్యుత్‌ కనెక్షన్, కేసింగ్‌ పైపు, పైపులు, ప్యానెల్‌ బోర్డు తదితరాలకు దాదాపు రెండు లక్షల రూపాయల మేర లబ్ధి చేకూరనుంది.

Show comments