సంక్రాంతి సినిమాల మధ్య థియేటర్ల రచ్చ..

సంక్రాంతి సినిమాల మధ్య థియేటర్ల రచ్చ..

  • Published - 03:15 PM, Wed - 9 November 22
సంక్రాంతి సినిమాల మధ్య థియేటర్ల రచ్చ..

ఆది పురుష్, ఏజెంట్ లు రేస్ నుంచి తప్పుకున్నప్పటికీ సంక్రాంతి బాక్సాఫీస్ వేడి మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. విజయ్ వారసుడుని నిర్మాత దిల్ రాజు తెలుగు రాష్ట్రాల్లో భారీ విడుదలకు ప్లాన్ చేస్తున్నారన్న వార్త చిరు బాలయ్య ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పిస్తోంది. వైజాగ్ లో వాల్తేర్ వీరయ్య వీరసింహారెడ్డిలకు చెరో నాలుగు స్క్రీన్లు ఇచ్చి వారసుడుకి మాత్రం ఏకంగా ఆరు వేయబోతున్నట్టు వచ్చిన వార్త ట్విట్టర్ ని ఊపేస్తోంది. ఏపీ తెలంగాణ అన్ని చోట్లా ఇలాగే చేస్తారన్న ప్రచారం ఊపందుకోవడంతో గతం ఇలా డబ్బింగ్ సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వడం పట్ల దిల్ రాజు చేసిన వ్యతిరేక కామెంట్ల వీడియో బయటికి తీసుకొచ్చి వైరల్ చేస్తున్నారు.

నిజానికిది ఆలోచించాల్సిన విషయమే. ఒకవేళ వీరయ్య వీరసింహలను తమిళంలో డబ్బింగ్ చేస్తే అక్కడి డిస్ట్రిబ్యూటర్లు కనీసం పట్టించుకుంటరా. మొహమాటం లేకుండా మాకు అజిత్ విజయ్ లే ఎక్కువని తేల్చేసి పొమ్మంటారు. కానీ మనదగ్గర అలా ఉండదు. ముందు నుంచి టాలీవుడ్ ఆడియన్స్ విపరీతంగా అరవ చిత్రాలను ఆదరిస్తూనే వచ్చారు. ఆ కారణంగానే కమల్ రజనిలతో మొదలుపెట్టి సూర్య కార్తీల దాకా ప్రతిఒక్కరికి ఇక్కడ ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పడింది. కానీ అక్కడి వాళ్ళు మాత్రం లోకల్ ఫీలింగ్ తోనే ఉంటారు. ఒక తెలుగు నిర్మాత తెలుగు దర్శకుడు చేసినంత మాత్రాన డబ్బింగ్ బొమ్మ స్ట్రెయిట్ మూవీ అయిపోదనే మాటలో లాజిక్ ఉంది.

ఇదెక్కడి దాక వెళ్తుందో చెప్పలేం. వారసుడు కౌంట్ భారీగా ఉండబోతున్న మాట వాస్తవం. విజయ్ కి ఇక్కడ అరివీర భయంకరమైన ఫాన్ ఫాలోయింగ్ ఏమి లేదు. తుపాకీతో మొదలుపెట్టి మాస్టర్ దాకా ఏదో డీసెంట్ గా నెట్టుకొస్తున్నాడు తప్ప మరీ టాలీవుడ్ స్టార్లకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చేంత సీన్ లేదు . ఎలాగూ వరిసు తమిళ వెర్షన్ నుంచే వందల కోట్ల బిజినెస్ తో పాటు లాభాలు కన్ఫర్మ్ అయినప్పుడు తెలుగులో ఇంత పెద్ద రిలీజ్ దేనికి. వీరయ్య వీరసింహా నుంచి స్వంతగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ మొదలుపెట్టిన మైత్రి మూవీ మేకర్స్ సైతం దీనికి పరిష్కారం కనిపెట్టడం కష్టం. అమ్మడం అయితే చేయగలరు కానీ చేతిలోలేని థియేటర్లు ఎక్కడి నుంచి  ఎలా తెస్తారు.

Show comments