Waltair Veerayya వాల్తేరు వీరయ్య రివ్యూ

Waltair Veerayya వాల్తేరు వీరయ్య రివ్యూ

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అంచనాలున్నాయి. ఇది దశాబ్దాలుగా జరుగుతున్నదే. రాజకీయాల్లోకి వెళ్లి ఎనిమిదేళ్ల గ్యాప్ తీసుకుని తిరిగి ఎంట్రీ ఇచ్చాక ఖైదీ నెంబర్ 150 సక్సెస్ తో మంచి వెల్కమ్ ఇచ్చిన అభిమానులు పూర్తిగా సంతృప్తి చెందేలా గత మూడు చిత్రాలు సైరా, ఆచార్య, గాడ్ ఫాదర్ ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయాయి. అందుకే వాల్తేరు వీరయ్య మీద ప్రత్యేక అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టే దర్శకుడు బాబీ ఒక అభిమానిగా తీశానని పదే పదే చెప్పడంతో సహజంగానే హైప్ పెరిగింది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మెగా మూవీ అలరించేలా ఉందో లేదో రివ్యూలో చూద్దాం

కథ
మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకుపోయిన స్మగ్లర్ సాల్మన్ (బాబీ సింహా) ని వెతికి తెచ్చేందుకు వాల్తేరు వీరయ్య(చిరంజీవి) సహాయం కోరతాడు సీతాపతి(రాజేంద్రప్రసాద్). అతను అడిగాడని కాకుండా తన వ్యక్తిగత లక్ష్యం కోసం అక్కడికి వెళ్లిన వీరయ్య ఊహించని విధంగా సాల్మన్ ని చంపుతాడు. దీంతో అతని అన్నయ్య మైకేల్(ప్రకాష్ రాజ్) ఇండియా వస్తాడు. అప్పుడే ఏసిపి విక్రమ్ సాగర్(రవితేజ) గతం బయటపడుతుంది. అసలు చేపలు పట్టుకునే వీరయ్యకు ఇంత పెద్ద మాఫియా ముఠాతో సంబంధం ఎలా ఏర్పడింది, ఎందుకు అంత రిస్క్ చేసి విదేశాలకు వెళ్లి మరీ తన పగను తీర్చుకున్నాడు లాంటివి చూసి తెలుసుకోవాల్సిందే

నటీనటులు
అరవై ఏడేళ్ల వయసులో ఎవరైనా విశ్రాంతినే కోరుకుంటారు. కానీ తన అభిమానుల కోసం ఇప్పటికీ డ్యాన్సులు ఫైట్లు చేసే చిరంజీవి ఇందులో కూడా ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఇప్పటి దర్శకులు ఆయనలో పూర్తిగా వాడుకోవడం మానేసిన కామెడీ యాంగిల్ ని చక్కగా ఆవిష్కరించారు. మలేషియా ఎపిసోడ్ లో అంతగా పేలలేదు కానీ రవితేజ ఎంట్రీ అయ్యాక మెగాస్టార్ నిజమైన హాస్య కోణం బయటికి వస్తుంది. డైలాగులు అంతంతమాత్రంగా ఉన్న చోట కూడా తన టైమింగ్ తో నిలబెట్టారు. ఇక పాటల్లో నృత్యాలు మరీ గొప్పగా లేకపోయినా నలభై సంవత్సరాల కెరీర్ తర్వాత కూడా అదే గ్రేస్ చూపించారు

మాస్ మహారాజ రవితేజ ఎంట్రీ లేట్ గా ఉన్నప్పటికీ లేటెస్ట్ గా అదరగొడుతుంది. తెలంగాణ స్లాంగ్ తో కొంచెం ఇబ్బంది పెట్టారు కానీ మాములు సినిమా వాడుక బాష పెట్టినా సరిపోయేది. చిరుతో కాంబో సీన్స్ బాగా పేలాయి. శృతి హాసన్ ని వీరసింహారెడ్డి కంటే బెటర్ గా ఉపయోగించారు అంతే. పెర్ఫార్మన్స్ కు స్కోప్ దక్కలేదు. బాబీ సింహా బాడీ లాంగ్వేజ్, ఎక్స్ ప్రెషన్లు బాగున్నాయి. ప్రకాష్ రాజ్ ది ఆయనకే బోర్ కొట్టేసేంత పాత టెంప్లేట్. రాజేంద్రప్రసాద్ డీసెంట్ గా లాగించేశారు. క్యాథరిన్ త్రెస్సా కొన్ని సీన్లకే పరిమితం, శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్, సప్తగిరి, వెన్నెల కిషోర్, ప్రదీప్ రావత్ తదితరులను తీసుకున్నారు కానీ ఎవరినీ సరిగా వాడుకోలేకపోయారు

డైరెక్టర్ అండ్ టీమ్
దర్శకుడు బాబీ కొల్లి ఒక అభిమానిగా ఈ కథ రాసుకున్నానని ఈవెంట్లలో పలు ఇంటర్వ్యూలలో చెప్పాడు. చిన్నప్పుడు నాన్న తీసుకెళ్లిన మెగాస్టార్ మూవీస్ చూసి ఫ్యాన్ గా మారిపోయి తనలో రైటర్ కి పని చెప్పానని వివరించాడు. ఇందులో నిజముంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్ ని పిక్చరైజ్ చేసిన తీరు చూసి పూర్తి పైసా వసూల్ ఇక్కడే జరిగిపోయిందనినిపిస్తుంది. ఒకవేళ సినిమా మొత్తం ఇలాగే తీసుంటే రికార్డులన్నీ స్మాష్ అయ్యేవే. కానీ తీతలో ఉన్నంత స్టాండర్డ్ రాతలో లేకపోవడంతో వీరయ్య స్థాయి తగ్గిపోయింది. శంకర్ దాదా ఎంబిబిఎస్, అందరివాడు నాటి కామెడీ యాంగిల్ మరోసారి చూపించాలనే ఆలోచనతో బాబీ చేసిన ప్రయత్నం మంచిదే.

ఇది పండాలంటే రచయిత పెన్ను బలంగా ఉండాలి. సోషల్ మీడియా జోకులు, ట్విట్టర్ లో జనాలు విపరీతంగా ట్రోల్ చేసిన జారుమిఠాయి పాటలు మెగాస్టార్ మీద వాడటం కరెక్ట్ కాదు. ఆయన స్థాయి హాస్యం అంటే దానికో రేంజ్ ఉండాలి తప్ప అల్లరి నరేష్ కి రాసినట్టు స్పూప్ లు చూపిస్తే న్యూట్రల్ ఆడియన్స్ నెగటివ్ గా తీసుకునే ప్రమాదం ఉంది. ఆయన టైమింగ్ చాలా మటుకు కాపాడింది కానీ రచనలో భాగం పంచుకున్న కోన వెంకట్ అండ్ టీమ్ కొంచెం కొత్తగా అలోచించి ఉంటే బాగుండేది. సెకండ్ హాఫ్ లో బాస్ మ్యానరిజంస్ బాగా పండాయి. రవితేజ కాంబో సీన్స్ లో ఎగతాళి రాజీ కలగలిసిన ఎక్స్ ప్రెషన్లు చాలా బాగా ఇచ్చాడు.
ఇదంతా బాగానే ఉంది కమర్షియల్ డ్రామాలో ఎమోషన్ ని మరీ ఎక్కువగా జొప్పించకూడదు. స్టోరీ రొటీన్ అయినప్పుడు వీలైనంత ఫాస్ట్ గా ముగించేయాలి. వీరయ్య విక్రమ్ సాగర్ మధ్య బాండింగ్ ని ఎక్కువ భావోద్వేగాలతో చూపించిన బాబీ ప్రయత్నం కొంత ల్యాగ్ కి కారణం అయ్యింది. రంగస్థలంలో ఆది పినిశెట్టి ట్రాక్ ని ఇంతకన్నా బరువుగా చూపించారనే లాజిక్ ఎవరైనా అడగొచ్చు. కానీ అందులో బ్యాక్ డ్రాప్ తో మొదలుపెట్టి టేకింగ్ దాకా 1985 కాలంనాటి స్టోరీ ప్లస్ విజువల్స్ ఫ్రెష్ గా అనిపిస్తాయి. కానీ వాల్తేరు వీరయ్యలో ఆ ఛాన్స్ లేకపోయింది. చిరంజీవే ఇది రొటీన్ కథని ముందే చెప్పేసి దాని మీద ఎక్కువ కంప్లయింట్ రాకుండా సేఫ్ సైడ్ తీసుకున్నారు

వాల్తేరు వీరయ్యలో యాక్షన్, సెంటిమెంట్, థ్రిల్, రొమాన్స్, సాంగ్స్ అన్నీ ఉన్నాయి. కానీ చివరాఖరికి ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. దానికి ప్రధాన కారణం చిరంజీవి రవితేజ కాంబో మీద పెట్టుకున్న అంచనాలు. ఈ కలయికలో గూస్ బంప్స్ ఇచ్చే ఎపిసోడ్స్ ఎక్స్ పెక్ట్ చేస్తాం. కానీ అది ఎక్కువ మెలో డ్రామా మీద ఆధారపడటంతో సగటు మాస్ ప్రేక్షకుడు కొంత నిరాశ చెందే అవకాశం కలిగింది. పైగా క్లైమాక్స్ ని ఎక్కువ లెన్త్ తో తెరకెక్కించడం, బ్రదర్స్ మీద చిన్న పాట, ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ అవసరమా అనిపించేలా ఉన్నాయి కానీ క్యారెక్టర్స్ ని రిజిస్టర్ చేయడం కోసం బాబీ ఇదంతా చేయడం వల్ల ఆ కోణంలో చూస్తే కరెక్టే అనిపిస్తుంది

మాస్ చిత్రాల్లో లాజిక్స్ ఉండవు. నిజమే. అలా అని ఎక్కువ లిబర్టీ తీసుకున్నా కష్టమే. నేవీ ఆఫీసర్లు తమ సహచరులు కిడ్నాప్ కు గురైతే చేపలు పట్టుకునే వీరయ్య సహాయం తీసుకోవడంతో మొదలుపెట్టి డ్రగ్స్ వ్యవహారంలో పోలీసుల తీరు దాకా ఎన్నెన్నో లూజ్ ఎండ్స్ పెట్టేశారు. కంటెంట్ కనెక్ట్ అయ్యేలా ఉంటే ఇవేవి పట్టించుకోనవసరం లేదు. కానీ కొంచెం అటుఇటు అయినప్పుడే లేనిపోని డౌట్లు వస్తాయి. మెయిన్ విలన్ గా ప్రకాష్ రాజ్ కాకుండా మరో ఆర్టిస్టుని తీసుకుని ఉంటే బాగుండేది. ఇరవై సంవత్సరాల నుంచి ఇదే తరహా పాత్రల్లో చూసి చూసి బోర్ కొట్టేసిన ఇలాంటి ఆర్టిస్టులతో కాకుండా ఫ్రెష్ క్యాస్టింగ్ ని తీసుకుంటే ఎఫెక్ట్ ఇంకా పెరిగేది

ఇక మరో కోణంలో చూస్తే వాల్తేరు వీరయ్య అభిమానులను నిరాశ పరిచే అవకాశాలు తక్కువే. ఆచార్య, గాడ్ ఫాదర్ లో బిగుసుకుపోయిన మెగాస్టార్ ని చూసిన కళ్ళతో ఫ్రెష్ గా ఒకప్పటి దొంగమొగుడు రౌడీ అల్లుడు నాటి లుక్ లో టైమింగ్ లో మరోసారి చూపించడంలో వాళ్ళు రిపీట్ రన్స్ వేసుకుంటే ఆశ్చర్యం లేదు. పైగా రవితేజ క్యారెక్టర్ కూడా బాగా సెట్ అవ్వడంతో మాస్ రాజా ఫ్యాన్స్ నూ సంతృప్తిపరిచారు. ఎటు తిరిగి కామన్ పబ్లిక్ కి స్పెషల్ అంశాలు తగ్గిపోయాయి. వెరైటీగా ఉంటుందని చిరు రవితేజలకు పెట్టిన యాసలు సరిగా కుదరలేదు. ఎప్పుడూ వాడే సినిమా బాష పెట్టేసినా సరిపోయేది. ప్రాంతాల మీద పట్టుకున్న వాళ్ళతోనే రాయించుకుంటే బాగుండేది

తను అనుకున్న లక్ష్యంతో బాబీ వాల్తేరు వీరయ్యని తీర్చిదిద్దాడు. సంక్రాంతి సీజన్ కాబట్టి కమర్షియల్ గా పాస్ అయ్యే ఛాన్స్ పుష్కలంగా ఉంది. వీరసింహారెడ్డికి వచ్చింది రొటీన్ టాకే కాబట్టి ఆ అడ్వాంటేజ్ ని చిరు ఎంతవరకు వాడుకుంటారో చూడాలి. ఒకటి మాత్రం నిజం. కేవలం ఫ్యాన్స్ చూస్తే భారీ సినిమాలు సేఫ్ కావు. అన్ని వర్గాలకు దగ్గరవ్వాలి. పైగా ఒకప్పటి మెగాస్టార్ కల్ట్ ఫ్యాన్స్ మధ్య వయసు దాటిపోయారు. ఇప్పటి కుర్రకారుకి లెజెండరీ హీరోగా, చరణ్ తండ్రిగా, పవన్ కళ్యాణ్ అన్నయ్యగా మాత్రమే కసంబంధం ఉంది తప్ప ఆయన గురించి రోజూ తలుచుకునేంత ఎమోషనల్ కనెక్షన్ లేదు. అందుకే మరికొంత విభిన్నంగా ఆలోచించడం అవసరం

దేవిశ్రీ ప్రసాద్ ని తీసుకున్నందుకు మొదట్లో అందరూ భయపడ్డారు కానీ తన పాటలే వాల్తేరు వీరయ్యకు పెద్ద ప్లస్ అయ్యాయి. విజువల్ గా కూడా బాగున్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. బీజీఎమ్ విషయంలో ఇంకొంచెం జాగ్రత్త తీసుకోవాల్సింది. ఆర్థర్ ఏ విల్సన్ ఛాయాగ్రహణం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అందరూ మెచ్చుకున్నట్టే ఉన్నత స్థాయిలో ఉంది. రామ్ లక్ష్మణ్ ఫైట్లు బాగున్నాయి. కొంచెం కత్తెరకు పని చెప్పి ఉంటే సెకండ్ హాఫ్ ల్యాగ్ ని తగ్గించే ఛాన్స్ ఉండేది. డైలాగులు మరీ గుర్తు పెట్టుకునేలా లేవు. మైత్రి నిర్మాతలు బడ్జెట్ విషయంలో ముందు వెనుకా చూసుకోకుండా ఖర్చు పెట్టారు. కాంబినేషన్ అలా దొరికినప్పుడు ఎందుకు రాజీ పడతారు

ప్లస్ గా తోచేవి
చిరంజీవి ఎనర్జీ
రవితేజ ఎపిసోడ్
ఇంటర్వెల్ బ్లాక్
పాటలు

మైనస్ గా తోచేవి
కథ పాతదే
సెకండ్ హాఫ్ నెమ్మదితనం
రొటీన్ స్క్రీన్ ప్లే
సోసో కామెడీ

కంక్లూజన్
బావర్చి బిర్యానీని ఫుడ్ ప్రేమికులు ఎన్ని సంవత్సరాలు తింటూ ఉన్నా బోర్ ఫీలవ్వరు. ఆ రుచి కొనసాగినంత కాలంలో ఆదరణలో మార్పు ఉండదు. చిరంజీవి లాంటి హీరోలూ అంతే. ఒకప్పుడు హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా ఆయన మార్కెట్ భీభత్సంగా ఉండేది కానీ మారిపోయిన టెక్నాలజీ ప్రపంచంలో అలా ఎవరికీ సాధ్యం కావడం లేదు. అందుకే వీలైనంత మేరకు కొత్త జానర్లు టచ్ చేస్తూ నూతన దర్శకులకు అవకాశం ఇవ్వడం ద్వారా మెగాస్టార్ తనలో ఏజ్డ్ లెజెండ్ కి కొత్త పని అప్పజెప్పాలి. అమితాబ్ బచ్చన్ లాగా ఇమేజ్ సరిహద్దులను చెరిపేసుకుని గతంలో చూడని ఆవిష్కరణను చేసే దిశగా వెళ్ళాలి. ప్రస్తుతానికి వీరయ్య బిర్యానీ టేస్ట్ కి వచ్చిన ఇబ్బంది లేదు కానీ తర్వాతి సినిమాకు కస్టమర్ కి రుచి తగ్గిన భావన కలగకముందే బియ్యం మార్చేయాలి
ఒక్క మాటలో – ఓకే అనిపించే పూనకాలు
రేటింగ్ – 2.5/ 5

Show comments