ట్విట్టర్‌కు కొత్త ఆల్టర్నేటివ్ మాస్టోడాన్.. తరలిపోతున్న లక్షలాది యూజర్లు..

ట్విట్టర్‌కు కొత్త ఆల్టర్నేటివ్ మాస్టోడాన్.. తరలిపోతున్న లక్షలాది యూజర్లు..

  • Published - 06:15 PM, Wed - 9 November 22
ట్విట్టర్‌కు కొత్త ఆల్టర్నేటివ్ మాస్టోడాన్.. తరలిపోతున్న లక్షలాది యూజర్లు..

టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్ (Elon Musk) ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక చాలామంది యూజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బ్లూ టిక్ వెరిఫికేషన్ కావాలంటే మనీ చెల్లించాల్సిందేనని మస్క్ యూజర్లపై ఒత్తిడి తేవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ట్విట్టర్ ఆల్టర్నేటివ్ యాప్స్ ఏమైనా ఉన్నాయా అని యూజర్లు వెతుకుతున్నారు. అయితే ఇటీవల వారికి ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ దొరికింది. అదే మాస్టోడాన్ (Mastodon) యాప్. మాస్టోడాన్ అనేది ఓపెన్ సోర్స్ మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్. ఇది 2016 నుంచి అందుబాటులో ఉంది. ఈ యాప్‌ను జర్మన్ దేశస్థుడు యూజీన్ రోచ్కో డెవలప్ చేశారు.

మస్క్ ట్విట్టర్‌లో తీసుకొస్తున్న కొత్త మార్పులు నచ్చని చాలామంది యూజర్లు మాస్టోడాన్ యాప్‌కు మారిపోతున్నారు. ఈ సోషల్ నెట్‌వర్క్ యాప్ గత కొన్ని రోజుల్లో ఒక మిలియన్ వినియోగదారులను దాటినట్లు యాప్ లీడ్ డెవలపర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యూజెన్ రోచ్కో పేర్కొన్నారు. దీనిలో ఒక్క వారంలోనే 2,30,000 మంది చేరారట.

ట్విట్టర్‌ ఫార్మాట్‌లోనే..
మాస్టోడాన్ ట్విట్టర్ లాగానే కనిపిస్తుంది. యూజర్ల ప్రకారం ఇది ట్విట్టర్ లాగానే పనిచేస్తుంది. కాకపోతే ఇందులో పోస్ట్స్ పేర్లు వేరు. ఇక్కడ వినియోగదారులు పెట్టే పోస్ట్‌లను “టూట్స్” అని పిలుస్తారు. ఈ టూట్స్‌కి రిప్లై ఇవ్వవచ్చు, లైక్ చేయవచ్చు. రీపోస్ట్ చేయవచ్చు. యూజర్స్ ఒకరినొకరు ఫాలో కూడా కావచ్చు. సైన్ అప్ చేయడం కాస్త కన్ఫ్యూజన్‌గా అనిపించినా ఈ యాప్ అచ్చం ట్విట్టర్‌లాగే ఉండటంతో దీనికి చాలామంది యూజర్స్ తరలిపోతున్నారు. ఒకేసారి లక్షల మంది యూజర్లు కొత్తగా ఈ యాప్‌లో జాయిన్ అవుతుండటంతో దాని సర్వర్స్ బాగా ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. డిమాండ్ అధికంగా ఉన్న సమయంలో సర్వర్స స్లో అవుతున్న వేళ కొత్త రిజిస్ట్రేషన్స్‌ను ఆపాల్సిన పరిస్థితి వస్తోందట.

మాస్టోడాన్ ట్విట్టర్ మాదిరిగా కాకుండా, డీసెంట్రలైజ్డ్ పద్ధతిలో పనిచేస్తుంది. యూజర్లు మాస్టోడాన్ (Mastodon)లో ఇప్పటికే ఉన్న కమ్యూనిటీలో చేరవచ్చు లేదా సొంతంగా కమ్యూనిటీని హోస్ట్ చేయవచ్చు. ఈ యాప్‌లో కంట్రీ, సిటీ, గేమింగ్, సోషల్ వంటి యూజర్ మేనేజ్డ్ సర్వర్లు ఉంటాయి. మాస్టోడాన్‌లోని ప్రతి సర్వర్‌కు కమ్యూనిటీ గురించి డిస్క్రిప్షన్ ఉంటుంది. మాస్టోడాన్ ఒక సర్వర్‌లో చేరిన యూజర్ల సంఖ్యను కూడా మీకు చూపుతుంది. సెట్టింగ్ సెక్షన్‌లో మార్పులు చేయడం ద్వారా వినియోగదారులు ఇతర సర్వర్‌లకు మారవచ్చు.

ఎలా ఉపయోగించాలి..?
మాస్టోడాన్‌లో యూజర్లు తమ అభిప్రాయాలను షేర్ చేసుకోవడానికి యాప్‌కి రైట్ సైడ్‌లో కింద వైపున ఉన్న ఎడిట్ బటన్‌పై నొక్కాలి. ఆ తర్వాత మెసేజ్ టైప్ చేయవచ్చు. ఈ పోస్టులో హాష్‌టాగ్స్, ఎమోజీలు యాడ్ చేయవచ్చు. తర్వాత పబ్లిష్ బటన్ లేదా హిట్ బటన్ నొక్కితే మీ పోస్ట్ పబ్లిష్ అయిపోతుంది. ఈ యాప్‌లో వీడియోలు, ఫొటోలు కూడా పోస్ట్ చేయవచ్చు. మాస్టోడాన్‌లో రీట్వీట్‌లు, లైక్‌లను రీబ్లాగ్డ్, ఫేవరెట్ అంటారు. 280 అక్షర పరిమితిని కలిగి ఉన్న ట్విట్టర్ వలె కాకుండా, మాస్టోడాన్‌లో ఒక్కో పోస్ట్‌కు 500 క్యారెక్టర్ లిమిట్ ఉంటుంది. ఇందులో ఇతరుల పోస్టులను రీపోస్టు కూడా చేయవచ్చు.

ఎలా లాగిన్ అవ్వాలి..?
మాస్టోడాన్‌ యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. దీనిని మీ డివైజ్‌లో ఇన్‌స్టాల్ చేశాక ‘గెట్ స్టార్టెడ్’పై క్లిక్ చేయాలి. సర్వర్‌ని సెలెక్ట్ చేసుకోవడం, ప్లాట్‌ఫామ్ రూల్స్ యాక్సెప్ట్ చేయడం వంటి ఆన్‌స్క్రీన్‌ రూల్స్ ఫాలో కావాలి. తరువాత మీ ఐడీ, పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయాలి. IDని క్రియేట్ చేయడానికి మాస్టోడాన్‌కి ఈమెయిల్ ఐడీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్‌ను ఉపయోగించి మాస్టోడాన్ అకౌంట్‌ను వెరిఫై చేసుకోవచ్చు.

Show comments