తుంగభద్ర పుష్కరాలు… నిర్వహణ సవాలే..

తుంగభద్ర పుష్కరాలు… నిర్వహణ సవాలే..

కర్నూల్ లో తుంగభద్ర పుష్కరాల నిర్వహణ ప్రభుత్వానికి సవాలుగా మారనుంది. నదీ స్నానాలకు అనుమతి ఇవ్వకపోయినా భక్తులను ఎంత వరకు కట్టడి చేస్తుందనేది ఆసక్తిగా మారింది. ఇక రెండు రోజులే సమయం ఉన్నందున ఏర్పాట్లు కూడా పూర్తి కావొచ్చాయి. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు భక్తుల సెంటిమెంట్ తో ముడిపడి ఉన్నాయి. ఈ క్రమంలో భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. మరోవైపు కరోనా కేసుల ఉధృతి తగ్గినా ప్రమాదం లేకపోలేదు.

బన్నీ ఉత్సవంతో బట్టబయలు

ఏడాదికి ఒకసారి జరిగే, ఏళ్లనాటి సంప్రదాయాలను కరోనా నేపథ్యంలోనూ ఆ పల్లెలు కొనసాగించాయి. తమకు సంప్రదాయాలే ముఖ్యమని చాటిచెప్పాయి. ఇటీవల దసరా సందర్బంగా కర్నూల్ జిల్లా దేవరగట్టులో జరిగిన బన్ని ఉత్సవమే ఇందుకు ఉదాహరణ. పోలీసుల ఎన్ని చెక్ పోస్ట్లు పెట్టినా, అవగాహన సదస్సులు నిర్వహించినా, వేల సంఖ్యలో సిబ్బందిని ఏర్పాటు చేసినా ఆ 34 గ్రామాల ప్రజలను అదుపు చేయడంలో ఎంత వైఫల్యం చెందారో చెప్పవచ్చు. కరోనా కష్టాల్లోనూ పెద్ద సంఖ్యలో భక్తులు బన్నీ ఉత్సవానికి తరలిరావడం, పలువురు గాయపడడం తెలిసిందే.

కార్తీకం.. నదీ స్నానం

కార్తీక మాసం కూడా ప్రారంభం కావడంతో ఎక్కువ మంది భక్తులు నదీ స్నానాలకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతం కరోనా లో ఇది కరెక్ట్ కాకపోయినా భక్తులు మొగ్గు చూపడంతో ప్రమాద ఘంటికలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. గత సోమవారం రాజమండ్రి గోదారి ఒడ్డున ఇది స్పష్టంగా కనపడుతోంది. ఎక్కువ సంఖ్యలో నదీ స్నానాలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. తూర్పు గోదావరిలోనూ కరోనా ఎంత బీభత్సము సృష్టించిందో తెలియంది కాదు. కార్తీక మాసం నేపథ్యంలో ఇక్కడ పోలీసుల చర్యలు ఏ మాత్రం కనపడలేదు. ఇది పలు విమర్శలకు తావిస్తోంది.

అప్రమత్తతే శ్రీరామ రక్ష

కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నా ఇంకనూ ప్రమాదం పొంచి ఉంది. విదేశాల్లో కరోనా రెండో వేవ్ ఇప్పటికే ప్రారంభం అయ్యిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మనమూ అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వ్యాక్సిన్ వచ్చేవరకూ ఎవరికీ వారు కొవిడ్ నిబంధనలు పాటిస్తేనే మనం సేఫ్ జోన్ లో ఉన్నట్లు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బలయ్యేది మనమే.

Show comments