Volunteer System In Telangana: Volunteer: కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం.. తెలంగాణలోనూ వాలంటీర్ వ్యవస్థ!

Volunteer: కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం.. తెలంగాణలోనూ వాలంటీర్ వ్యవస్థ!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థ మీద ప్రశంసలు కురిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలో కూడా దీన్ని అమలు చేయనున్నట్లు సమాచారం. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థ మీద ప్రశంసలు కురిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలో కూడా దీన్ని అమలు చేయనున్నట్లు సమాచారం. ఆ వివరాలు..

2019 ఎన్నికల ముందు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవ రత్నాల పేరుతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలు తీసుకువచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచిన అనంతరం.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నవరత్నాల అమలుకు కట్టుబడి ఉన్నారు. అయితే సంక్షేమ పథకాల ఫలితాలు నేరుగా లబ్ధిదారులకు అందాలి.. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలన్ని ప్రజలకు తెలియాలి.. వృద్ధులు, వికలాంగులకు సంక్షేమ పథకాల ఫలితాలను వారి గడప వద్దకు తీసుకెళ్లి అందించాలనే ఉద్దేశంతో.. వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల యువతకు ఉపాధి కల్పించడంతో పాటు.. పాలనలను ప్రజల గడప వద్దకే తీసుకువచ్చారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఇక ఏపీలో ఉన్న వాలంటీర్ వ్యవస్థ మీద ఇతర రాష్ట్రల ప్రజలు, ముఖ్యమంత్రులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర వార్త వైరల్ గా మారింది. అది ఏంటంటే.. తెలంగాణలో కూడా త్వరలోనే వాలంటీర్ వ్యవస్థను తీసుకురాబోతున్నారట. ఆ వివరాలు..

తెలంగాణలోనూ వాలంటీర్ వ్యవస్థ..

ఆంధ్రప్రదేశ్‌లో అమల్లో ఉన్న వాలంటీర్‌లాంటి వ్యవస్థ తెలంగాణలోనూ రాబోతున్నదా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కార్యకర్తలను వాలంటీర్లుగా నియమిస్తామని ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి పేర్కొన్న సంగతి తెలిసిందే. నాడు చెప్పిన మాటలను ఇప్పుడు నిజం చేయబోతున్నారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించడం కోసం.. ‘ఇందిరమ్మ కమిటీ’లను ఏర్పాట్లు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే దీనికి సంబంధించిన కార్యచరణ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతోపాటు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇందిరమ్మ కమిటీలే వాలంటీర్లుగా..

అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా.. ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు. దీనితో పాటు.. కార్యకర్తలకు ఉపాధి కల్పన, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి వాటికి సంబంధించి రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతుంది. ఇందుకోసం ఇందిరమ్మ కమిటీలను తీసుకు వచ్చి.. వాలంటీర్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నియమించబోతున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతున్నది.

ఆరు గ్యారెంటీల అమలు కోసం గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని బుధవారం జరిగిన కాంగ్రెస్‌ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత మల్లు రవి స్వయంగా ప్రకటించారు. ఈ కమిటీలో ఐదు నుంచి ఆరుగురు సభ్యులుంటారు. వీరంతా కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులేనని కూడా ప్రకటించారు. దీనినిబట్టి చూస్తే ఇది పక్కాగా వాలంటీర్‌ వ్యవస్థేనని తేలిపోయింది. ఇక ఏపీలో ఒక్కో వాలంటీర్‌కు రూ. 5 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తుంది. మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత వేతనం ఇస్తుందో చూడాలి అంటున్నారు.

Show comments