TS Budget 2024-Rythu Bandhu, Rythu Bharosa: రైతు బంధు నిబంధనల్లో మార్పు.. ఇకపై వారికే రైతు భరోసా

TS Budget 2024: రైతు బంధు నిబంధనల్లో మార్పు.. ఇకపై వారికే రైతు భరోసా

తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2024-25 ఏడాదికి గాను ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. రైతు బంధుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2024-25 ఏడాదికి గాను ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. రైతు బంధుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క 2024-25 ఏడాదికి గాను రూ.2,75,891కోట్లతో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. శనివారం (ఫిబ్రవరి 10) తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ‘రైతు భరోసా’పై కీలక ప్రకటన చేశారు. రైతు బంధు పథకాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధమవుతుందని తెలిపారు. అంతేకాక నిజమైన అర్హులకే రైతు బంధు ఇస్తామని శాసనసభ వేదికగా మంత్రి భట్టి స్పష్టం చేశారు.

గత ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు పథకం కింద అసలు రైతుల కంటే పెట్టుబడిదారులు, అనర్హులే ఎక్కువ లాభం పొందారని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సాగు చేయని, సాగు చేయడానికి పనికిరాని కొండలు, గుట్టలు.. ఆఖరికి రోడ్లు ఉన్న స్థలానికి కూడా గత ప్రభుత్వం రైతుబంధు సాయం ఇచ్చిందన్నారు.

రైతు బంధులో అక్రమాలను గుర్తించిన నేపథ్యంలో ఈ పథకం నిబంధనలను పున:సమీక్ష చేసి నిజమైన అర్హులకే ‘రైతు భరోసా’ కింద పెట్టుబడి సాయం అందిస్తామని మంత్రి భట్టి విక్రమార్క ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అంతేకాక రైతు భరోసా కింద ఎకరాకు 15,000 రూపాయలు చొప్పున పెట్టుబడి సాయం అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అలానే కౌలు రైతులకు కూడా రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని అందిస్తామన్నారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. త్వరలోనే దీన్ని అమలు చేస్తామని ప్రకటించారు.

కౌలు రైతులకు కూడా రైతు బీమా..

అంతేకాక రైతు బీమా పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి భట్టి తన బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పుకొచ్చారు. అందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ బడ్జెట్‌‌లో వ్యవసాయ శాఖకు మొత్తం 19,746 కోట్ల రూపాయలను కేటాయించారు. ప్రధాన మంత్రి ఫసల్‌ భీమా యోజన కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకుని తెలంగాఱ రాష్ట్రంలో కూడా పంటల బీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేయబోతున్నామన్నారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ఈ పథకం అమలవుతున్న తీరును పరిశీలించి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అలానే ఆరు గ్యారెంటీల అమలు కోసం భారీ ఎత్తున నిధులు కేటాయించారు. త్వరలోనే ఈ హామీలన్నింటిని అమలు చేస్తామని తెలిపారు.

Show comments