Tirumala Brahmotsavam 2023 CM YS Jagan: తిరుమల బ్రహ్మోత్సవాలు.. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌

తిరుమల బ్రహ్మోత్సవాలు.. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌

కలియుగ దైవం తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. తొమ్మిది రోజుల పాటు.. రోజుకో రూపంతో.. పూటకో వాహన సేవతో భక్తులను అనుగ్రహిస్తారు తిరుమల వెంకటేశ్వర స్వామి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం నాడు అంకురార్పణ చేసిన వేద పండితులు.. ధ్వజారోహణంతో.. ఉత్సవాలను ప్రారంభించారు. మలయప్ప స్వామి వారి సమక్షంలో గరుడ ధ్వజం ఎగురవేసి.. బ్రహ్మోత్సవాలకు రమ్మంటూ ముక్కోటి దేవతలను ఆహ్వానించారు. ఇక తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న సీఎం జగన్‌.. పట్టువస్త్రాలు సమర్పించేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సీఎం జగన్‌కు పరివట్టం కట్టారు. అనంతరం ప్రభుత్వం తరఫున సీఎం జగన్‌.. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తర్వాత స్వామి వారిని దర్శించుకున్న సీఎం జగన్‌కి వేద పండితులు ఆశీర్వచనం అందించారు. రాత్రి తొమ్మిది గంటలకు పెద్ద శేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామి ఊరేగింపు జరిగింది. సీఎం జగన్‌ ఈ వాహన సేవలో పాల్గొన్నారు.

రెండు రోజుల తిరుమల పర్యటనలో పాల్గొన్న సీఎం జగన్‌.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇక ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోన్న సుమారు 6,700 మంది టీటీడీ ఉద్యోగులకు సీఎం జగన్‌ చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. అంతేకాక సుమారు 650 కోట్ల రూపాయల ఖర్చుతో కట్టిన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన సీఎం దాన్ని తిరుపతి ప్రజలకు అంకితమిచ్చారు. దీనితో పాటు ఎస్వీ ఆర్ట్స్‌ కాలేజీకి సంబంధించిన హాస్టల్స్‌ ప్రారంభించారు ముఖ్యమంత్రి.

Show comments