పెట్రోల్ 254, డీజిల్ 214.. మొదలైన రష్యా యుద్ధ ప్రభావం

ఉక్రెయిన్-రష్యా​ యుద్ధం అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో పలు దేశాల్లో చమురు ధరలు అమాంతం పెరుగుతున్నాయి. శ్రీలంకలోని చమురు విక్రయ సంస్థ లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ (ఎల్​ఐఓసీ) పెట్రో ధరలను భారీగా పెంచింది. దీంతో ఆ దేశంలో పెట్రోల్​, డీజిల్​ ధరలు డబుల్​ సెంచరీని దాటేశాయి. మనదేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత దేశంలో మళ్లీ పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతాయనే భయంతో చాలా మంది ఉన్నారు.

అయితే పొరుగున ఉన్న భారతదేశంలోని ఇండియన్ ఆయిల్ కంపెనీ ఒక్క రోజులో పెట్రోల్ ధరను రూ.50 (శ్రీలంక రూపాయిలు) పెంచింది. డీజిల్ ధర కూడా భారీగా పెరిగింది. ఫలితంగా లీటరు పెట్రోల్​ ధర రూ.254కు చేరగా.. డీజిల్ ధర రూ.214కు ఎగబాకింది. శ్రీలంక రూపాయి విలువ భారీగా పతనమైన నేపథ్యంలో ఎల్​ఐఓసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లంక ఇండియన్ ఆయిల్ లంకలో ఇంధన ధరలను పెంచడం గత నెలలో ఇది మూడోసారి.

డాలర్‌తో పోలిస్తే శ్రీలంక రూపాయి విలువ 7 రోజుల్లో 57 రూపాయలు తగ్గిందని ఎల్​ఐఓసీ ఎండీ మనోజ్ గుప్తా చెప్పారు. అది మాత్రమే కాకుండా రష్యాపై వివిధ ఆర్థిక ఆంక్షల కారణంగా చమురు మరియు గ్యాస్ ధరలు కూడా పెరిగాయని తద్వారా ఈ రేట్లు పెరిగాయని పేర్కొన్నారు. ఎల్​ఐఓసీకి పెట్రోల్ సహా డీజిల్‌పై ప్రభుత్వం నుండి ఎటువంటి సబ్సిడీ దొరకదు. అందువల్ల శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలను తదనుగుణంగా పెంచాల్సి ఉంది. ఈ ఎల్​ఐఓసీ భారతదేశంలోని అతిపెద్ద చమురు కంపెనీ అయిన ఇండియన్ ఆయిల్‌కి అనుబంధ సంస్థ. అయితే, శ్రీలంక ప్రభుత్వ యాజమాన్యంలోని సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ మాత్రం పెట్రో ధరలను పెంచలేదు.

Show comments