Idream media
Idream media
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, దీంతో ఆయనను కుటుంబసభ్యులు అంతా కలిసి ఆసుపత్రికి తీసుకు వెళ్లారని ప్రచారం జరిగింది. ప్రగతి భవన్ దగ్గర లోనే ఉన్న యశోద హాస్పిటల్ కు తీసుకువెళ్లగా వైద్యులు హార్ట్ యాంజియో పరీక్షలు నిర్వహించారు. ఈ సమయంలో ఉప్పల్ పర్యటనలో బిజీగా ఉన్న కేటీఆర్ కార్యక్రమాలను రద్దు చేసుకుని.. హుటాహుటిన యశోదా ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటికే హాస్పిటల్లో కేసీఆర్ వెంట సతీమణి శోభ, కవిత, సంతోష్, హిమాన్షు ఉన్నారు. అయినా సరే కేటీఆర్ హుటాహుటిన రావడంతో ఏదో జరిగిపోయింది అంటూ పెద్ద ఎత్తున కలకలం రేగింది.
అంతేకాక అస్వస్థత కారణంగానే యాదాద్రి పర్యటనను సీఎం కేసీఆర్ రద్దు చేసుకున్నట్లు సమాచారం అంటూ మీడియాలో ప్రచారం కూడా జరిగింది. కానీ సీఎం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం మీద స్పందించిన డాక్టర్ ఎంవీ రావు రెండ్రోజులుగా సీఎం కేసీఆర్ వీక్ గా ఉన్నారని, ఎడమ చేయి, ఎడమ కాలు లాగుతున్నట్లు చెప్పారని పేర్కొన్నారు. ప్రస్తుతం పరీక్షలు చేస్తున్నాము, సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ ఎంవీ రావు పేర్కొన్నారు.
ఇక కేసీఆర్కు వైద్యులు యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించగా ఈ టెస్టు రిపోర్ట్ నార్మల్గా వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఎలాంటి బ్లాక్స్ లేవని వెల్లడించారు. గుండె సంబంధిత సమస్యలు లేవని స్పష్టం చేశారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని ఎలాంటి ఆందోళన అవసరంలేదని డాక్టర్లు చెప్పారు. నిజానికి సీఎం కేసీఆర్ ఇటీవల వరుస పర్యటనలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. కొత్త రాజకీయ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కొద్దిరోజుల క్రితం ముంబై, ఢిల్లీ, జార్ఖండ్ లో పర్యటించారు. ఢిల్లీ వెళ్లిన సమయంలోనే ఆయన కంటి పరీక్షలు చేయించుకున్నారు. అయితే వరుస పర్యటనలు, అధికారులతో సమీక్షల కారణంగా ఒత్తిడికి గురికావడం వల్లే కేసీఆర్ అస్వస్థతకు గురైనట్లు వైద్యులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.