Idream media
Idream media
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం (91) కన్నుమూశారు. బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు.వయోభారంతో పాటు ఊపిరితిత్తుల సమస్యతో దీర్ఘకాలంగా బాధపడుతున్న ఆమె ఈ నెల రెండో తేదీ నుంచి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆమెకు ఐసీయూలో వెంటిలేటర్‌పై డాక్టర్లు చికిత్స అందిస్తుండగా ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు. 1931లో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం లో జన్మించిన ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం ఆమె సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలిగా ఉన్నారు.
ఐదో తరగతి వరకు చదువుకున్న స్వరాజ్యం తన సోదరుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి అడుగుజాడల్లో పోరాటబాటలో వచ్చారు. 1945-48 మధ్య పెద్ద ఎత్తున జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ పట్టిన మొదటి మహిళగా నిలిచిన ఆమె 13 ఏళ్ల వయసులోనే పోరాటంలో పాల్గొని, రజాకార్ల పాలిట సింహస్వప్నంగా నిలిచారు. సాయుధ పోరాట కాలంలో మల్లు స్వరాజ్యంతో పాటు మూడువందల మంది మహిళలు మేజర్ జైపాల్ సింగ్ ఆధ్వర్యంలో సాయుధ శిక్షణ పొందారు. ఇక తన 75 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ, ప్రజాప్రస్థానంలో ఆమె రెండుసార్లు తుంగతుర్తి శాసనసభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
మల్లు స్వరాజ్యం భర్త మల్లు వెంకట నరసింహారెడ్డి ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శిగా, నల్లగొండ జిల్లా సీపీఎం కార్యదర్శిగా పనిచేశారు. ఆయన 2004లో మరణించారు. ఇక మల్లు స్వరాజ్యం అంత్యక్రియలు ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో జరుగుతాయని సీపీఎం నల్గొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మల్లు స్వరాజ్యంకు కుమార్తె పాదూరి కరుణ, ఇద్దరు కుమారులు మల్లు గౌతంరెడ్డి , మల్లు నాగార్జున రెడ్డి ఉన్నారు. కరుణ బీజేపీలో ఉండగా.. చిన్న కుమారుడు నాగార్జున రెడ్డి సూర్యాపేట జిల్లా సీపీఎం కార్యదర్శి బాధ్యతలు కొనసాగిస్తున్నారు.