Idream media
Idream media
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 11 స్థానాలు భర్తీ కాబోతున్నాయి. ఈ నెల 16వ తేదీన ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతోంది. డిసెంబర్ 10వ తేదీన పోలింగ్, 14వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. కోవిడ్, స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడుతూ రావడంతో.. ఇప్పుడు ఒకేసారి 11 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేసే పరిస్థితి నెలకొంది. అధికార పార్టీలో ఎవరికి వారు ఎమ్మెల్సీ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. సీటు ఎవరికి దక్కినా గెలుపు ఖాయమే కావడంతో.. ఎమ్మెల్సీ ఆశానువాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోటాలో ప్రకాశం జిల్లా నుంచి తూమాటి మాధవరావు వైసీపీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెం మండలానికి చెందిన తుమాటి మాధవరావు.. కొంత కాలం వైసీపీ కో ఆర్డినేటర్‌గా పని చేశారు. 2014 ఎన్నికల్లో కందుకూరులో వైసీపీ తరఫున గెలిచిన పోతుల రామారావు ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లారు. దీంతో నియోజకవర్గంలో పార్టీకి పరిస్థితి చుక్కానిలేని నావమాదిరిగా తయారైంది. ఆ సమయంలో కో ఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టిన తూమాటి మాధవరావు.. 2019 ఎన్నికల వరకు శక్తివంచన లేకుండా పని చేశారు. 2019 ఎన్నికలకు ముందు రాజకీయ సమీకరణాలు, బలాబలాలు బేరీజు వేసుకున్న వైసీపీ.. స్థానిక నేత, మాజీ మంత్రి మాగుంట మహీధర్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుని టిక్కెట్ ఇచ్చింది. ఆయన మరోసారి కందుకూరు నుంచి గెలిచి తన పట్టును నిలుపుకున్నారు. మహీధర్ రెడ్డి గెలుపునకు తూమాటి పని చేశారు.
పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేసిన తూమాటి మాధవరావుకు తగిన సమయంలో మంచి గుర్తింపు దక్కుతుందనే ఆశతో ఆయన వర్గం ఎదురుచూస్తోంది. అత్యంత సామాన్యుడుగా జీవన ప్రయాణం మొదలు పెట్టిన తూమాటి మాధవరావు అంచెలంచెలుగా ఎదిగారు. కందుకూరులో వార్త పేపర్ ఏజెంట్‌గా, వార్త పత్రిక యాడ్స్ విభాగంలో ప్రకటనల సేకరణకర్తగా తూమాటి పని చేసేవారు. ఆ తర్వాత రియల్‌ఎస్టేట్ వ్యాపారంలోకి ప్రవేశించి.. బెంగుళూరులో వ్యాపారం చేశారు. అదే సమయంలో టీడీపీలో పలు పదవులు నిర్వర్తించారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున కందుకూరు అసెంబ్లీ టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేశారు.
టిక్కెట్ రాకపోవడం, అదే సమయంలో టీడీపీ స్థానిక నాయకత్వం తనను దూరం పెట్టే ప్రయత్నాలు చేయడంతో.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన అనుచరవర్గంతో భారీ ర్యాలీగా వెళ్లి ఎన్నికల ప్రచారం కోసం ఒంగోలుకు వచ్చిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచారు. పార్టీ పదవులు నిర్వర్తించారు. పార్టీలో ఆది నుంచి ఉంటూ.. నిబద్ధతతో పని చేస్తున్న వారికి జగన్ పెద్దపీట వేస్తున్న తరుణంలో.. తూమాటి మాధవరావుకు కమ్మ సామాజికవర్గం కోటాలో అవకాశం లభిస్తుందనే అంచనాలున్నాయి.
Also Read : Rampachodavaram, Ananta Babu, MLC Seat – ఉదయ్ భాస్కర్‌కు ఎమ్మెల్సీ ఖాయమేనా..?