Kondapalli municipality – కొండపల్లి పీఠం దక్కేదెవరికి?

కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ఎవరిని చైర్మన్ పీఠం వరిస్తుందా అనే దానిపై చాలా లెక్కలు ఉన్నాయి. అధికార పార్టీ బలంగా ఉన్న నేపథ్యంలో ఈ స్థానాన్ని ఎలా అయినా కైవసం చేసుకునే అవకాశం ఉండవచ్చు అనే ప్రచారం జరుగుతోంది. కొండపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఎంపీ కేశినేని నానీ టీడీపీ నుంచి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ నుంచి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. దీనితో ఇప్పుడు రెండు పార్టీలకు ఇది ఒకరకంగా ప్రతిష్టాత్మకంగా మారింది. టీడీపీ వైసీపీ రెండు సమంగా ఉన్న నేపధ్యంలో ఎంపీ, ఎమ్మెల్యేలు తమ వర్గాలను కాపాడుకోవడానికి కొండపల్లిలో పాగా వేసారు.

టిడిపి తరఫున గెలిచిన అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేసి తమ వైపు లాక్కోవాలని వైసీపీ చూస్తుందని టీడీపీ అంటుంటే… తమ వైపు గెలిచిన వారిని ఎంపీ టీడీపీ వైపు లాగే ప్రయత్నం చేస్తున్నారని ఇందుకోసం చైర్మన్ పదవిని ఆఫర్ చేస్తున్నారని వైసీపీ అంటుంది. ఇక రెండు పార్టీలు కూడా తమ వైపు గెలిచినా మెంబర్లను కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. టీడీపీ నుంచి గెలిచిన వారిలో ఇద్దరు ఎమ్మెల్యేతో మాట్లాడారనే వార్తలు రావడంతో ఎంపీ కేశినేని వారి వద్దే ఉంటున్నట్టు తెలిసింది. ఇక కేసులతో బెదిరించాలని చూస్తున్నట్టుగా టీడీపీ ఆరోపిస్తుంది.

కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డులు ఉండగా 14 వార్డు లు టిడిపి, 14 వార్డు లు వైసిపి ఒక వార్డులో ఇండిపెండెంట్ గెలిచారు. టిడిపికి మద్దతు పలికిన గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థిని తమ వైపుకి తిప్పుకునే ఆలోచనలో వైసీపీ ఉంది. ఇక ప్రస్తుత లెక్కల ప్రకారం టీడీపీకి మెజారిటీ రాగా ఎక్స్ అఫీషియో సభ్యులుగా టిడిపి నుంచి ఎంపీ కేశినేని నాని వైకాపా నుంచి వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నారు. టీడీపీకి వైసీపీ సభ్యుల అవసరం లేకపోయినా కూడా తమ బలం పెంచుకుంటే ఇబ్బంది ఉండదు అనే ఆలోచనలో ఎంపీ ఉన్నారట. అయితే ఎంపీ వ్యూహాలను ముందే పసిగట్టిన కృష్ణ ప్రసాద్ మెంబర్లకు అండగా నిలబడినట్టు తెలుస్తుంది.

Show comments