వినాయక చవితి ఉత్సవాలు.. ప్రభుత్వ చర్యలను సమర్థించిన హైకోర్టు

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి తగ్గినా.. మహమ్మారి కాపు కాసి ఉన్న నేపథ్యంలో ప్రజలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వినాయక చవితి ఉత్సవాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. పబ్లిక్‌ స్థలాల్లో విగ్రహాలు పెట్టుకుని, ఉత్సవాలు నిర్వహించుకుంటామని దాఖలైన లంచ్‌మోషన్‌ పిటిషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రైవేటు స్థలాల్లో ఉత్సవాలు జరుపుకోవాలని సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన కోవిడ్‌ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ఒకేసారి ఐదుగురికి మించకుండా పూజలు చేసుకోవాలని పేర్కొంది.

కరోనా వైరస్‌ నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాలపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. కోవిడ్‌ దృష్ట్యా ఇళ్లలోనే ఉత్సవాలు, పూజలు నిర్వహించుకోవాలని పేర్కొంటూ.. బహిరంగ ప్రదేశాల్లో భారీ విగ్రహాలు ఏర్పాటు చేయడం, ఉత్సవాలు నిర్వహించేందుకు అనుమతిలేదని ఉత్తర్వులు జారీచేసింది. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా జగన్‌ సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు రాజకీయాలు చేశాయి. ఈ అంశానికి మతపరమైన రంగు పులిమి కొన్ని రోజులుగా హడావుడి చేస్తున్నాయి. ఉత్సవాలకు అనుమతి ఇవ్వాల్సిందేనంటూ ఆయా పార్టీల అధ్యక్షులు డిమాండ్లు వినిపించారు. అయితే వారి డిమాండ్లు అర్ధ రహితమని తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో తేలిపోయింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని స్పష్టమైంది.

పబ్లిక్‌ ప్లేస్‌లలో భారీ విగ్రహాలు పెట్టి, ఉత్సవాలు జరపకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. ఎప్పుడూ నిర్వహించేలా నగరాలు, పట్టణాలు, గ్రామాలలోని రోడ్లపై వినాయక విగ్రహాలు కనిపించబోవు. సాధారణంగా వినాయక విగ్రహాలను రోడ్లపైనే మండపం ఏర్పాటు చేసి పెడతారు. మూడు రోజుల నుంచి 11 రోజుల వరకు పూజలు నిర్వహిస్తారు. ప్రతి రోజు ఉదయం లేదా సాయంత్రం గణేషుడికి ప్రజల సమక్షంలో పూజలు చేసి, ప్రసాదాలు పంచిపెడతారు. భజనలు, ప్రత్యేకమైన వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. నిమజ్జనం రోజున మేళతాళాలతో ఊరేగింపులు, బాణాసంచా కాలుస్తూ, గులాములు చల్లకుంటూ గణేషుడుని సాగనంపుతారు. ఈ ఉత్సవంలో చిన్న పెద్దా, మహిళలు, పురుషులు అనే భేదం లేకుండా అందరూ పాల్గొంటారు. అయితే కరోనా నేపథ్యంలో ప్రైవేటు ప్లేస్‌లలోనే పూజలు నిర్వహించుకోవాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. ఈ ఏడాది ఈ తరహాలో సంబరాలు కనిపించవోవు.

దేశ వ్యాప్తంగా ప్రతి రోజు కరోనా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ రోజు (బుధవారం) ఆంధ్రప్రదేశ్‌లో 1361 కొత్త కేసులు నమోదయ్యాయి. 15 మంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read : బొడ్డు భాస్కర రామారావు పోవడంతో చిన రాజప్ప ఆ నియోజకవర్గంపై కన్నేశారా..?

వినాయక చవితి ఉత్సవాలపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రైవేటు స్థలాల్లో ఉత్సవాలు నిర్వహించాలనకునే వారు ముందుగా తహసీల్దార్‌ నుంచి అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దరఖాస్తు నమూనాను విడుదల చేసింది. కోవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తామని, డీజేలు ఏర్పాటు చేయబోమని, మైకును పరిమితి మేరకు ఉపయోగిస్తామని తెలుపుతూ.. నిర్వాహకులు తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలి.

Show comments