టీఆర్ఎస్ లో ఓ వైపు అలా.. మ‌రో వైపు ఇలా..!

అధికార పార్టీ టీఆర్ఎస్ తెలంగాణ‌లో తిరుగులేని పార్టీగా మార్చేందుకు గులాబీ బాస్ కేసీఆర్ తో పాటు, కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా విస్తృత స్థాయి క‌మిటీల ఏర్పాట్ల‌లో బిజీగా ఉన్నారు. బీజేపీ దూకుడుకు బ్రేకులు వేసేందుకు భారీ ప్రణాళిక‌లు ర‌చిస్తున్నారు. గులాబీ శ్రేణుల‌ను స‌మ‌ష్టి ప‌రిచేందుకు శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నారు. ఓ వైపు ఇలాంటి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతుంటే.. మరో వైపు టీఆర్ఎస్ లీడర్ల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. నివురుగప్పిన నిప్పులా ఉన్న గొడవలు అక్క‌డ‌క‌క్క‌డ భగ్గుమంటున్నాయి.

కొద్ది రోజులుగా పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కొన‌సాగుతోంది. ఇంతలోనే పార్టీలోని కొంద‌రు ఎమ్మెల్యేలు, వారి ప్రత్యర్థులు ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారు. వీరి చేష్టల వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని కేడ‌ర్ ఆందోళ‌న చెందుతోంది. విభేదాలను పక్కనపెట్టి సంస్థాగత ఎన్నికల్లో అందరినీ కలుపుకొనిపోవాలని టీఆర్ఎస్ బాస్లు ఆదేశిస్తే.. నేత‌లు మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు, అక్కడ ఉన్న ఇతర ముఖ్య నేతలకు మధ్య సయోధ్య లేదు. సొంత బలగం ఉంటే ఆ నేతలను ఎమ్మెల్యేలు అణిచివేయాలని చూస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. తమ మీద పార్టీ వ్యతిరేకులుగా ముద్రవేసి.. తమ వెంట ఉన్న కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యేల మీద పలువురు లీడర్లు ఆరోప‌ణ‌లు కురిపిస్తున్నారు.

Also Read:టీడీపీ అనుకున్న‌దొక‌టి.. జరిగింది మరొకటి..!

కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యే వ్య‌తిరేక‌ వర్గానికి పార్టీ సభ్యత్వం కూడా ఇవ్వకుండా అడ్డం ప‌డ్డార‌న్న ఆరోప‌ణ‌లు టీఆర్ఎస్ లో గుప్పుమంటున్నాయి. ఇప్పుడు తాజాగా, సంస్థాగత ఎన్నికల మీటింగులకు కూడా తమను పిలవడంలేదని, కమిటీల ఏర్పాటు ఏకపక్షంగానే జరుగుతోందని ప‌లువురు ఆరోపిస్తున్నారు. గ్రామ, మండల కమిటీలన్నింటినీ ఎమ్మెల్యేల అనుచరులతోనే నింపేస్తున్నారనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసే దిశగా కమిటీలు ఉండాలని అధిష్టానం చెప్తుంటే, కమిటీల ఏర్పాటు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటోందని వాపోతున్నారు. ఎమ్మెల్యేల వెంట ఉన్నవారిలో చాలామంది మీద పబ్లిక్ అసంతృప్తితో ఉన్నారని, వీరే కమిటీల్లో ఉండడం వల్ల ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు.

చాలా నియోజకవర్గాల్లో రెండు, మూడు గ్రూపులు ఉన్నాయి. ఇక్కడ ఎమ్మెల్యేలతో పడని లీడర్ల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. నల్గొండ, మహబూబ్ న‌గ‌ర్, ఖమ్మం జిల్లాల్లో ఎమ్మెల్యేలకు, ఇతర లీడర్లకు మధ్య గొడవలు ముదిరి పాకాన పడ్డాయి. నల్గొండ జిల్లా నకిరేకల్సెగ్మెంట్లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గానికి చెందిన వాళ్లకు పార్టీ సభ్యత్వం కూడా ఇవ్వలేదని ప‌లువురు బ‌హిరంగంగానే ఆరోపిస్తున్నారు. స్వయానా వీరేశానికి కూడా మెంబర్షిప్ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో వారు ఆన్ లైన్ లో అప్లై చేసుకున్నారట‌. కొద్ది రోజుల క్రితం జ‌రిగిన జెండా పండుగ సంద‌ర్భంగా.. నకిరేకల్లో వీరేశం, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అనుచరులు వేర్వేరుగా జెండాలను ఎగరవేశారు. సంస్థాగత ఎన్నికల మీటింగులకు కూడా వీరేశాన్ని పిలవలేదు.

Also Read: కేర్ అఫ్ కేటీఆర్

భువనగిరిలో ఎలిమినేటి కృష్ణారెడ్డి, సందీప్ రెడ్డి, చింతల వెంకటేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి మధ్య సఖ్యత లేన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అయితే పార్టీ లీడర్లను పట్టించుకున్న పాపాన పోవడం లేదని అదే పార్టీలోని ఓ వ‌ర్గం ఆరోపిస్తోంది. ఆలేరులో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య వర్గానికి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేద‌నే వాద‌న ఉంది. మునుగోడులో మాజీ ఎమ్మె ల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. నాగర్కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీరం హ‌ర్ష‌వ‌ హర్షవర్ధన్రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వేర్వేరుగా జెండాలు ఎగురవేశారు. కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు, పెంట్లవెల్లి మండలాల్లో రెండు శిబిరాల కార్యకర్తలు వేర్వేరుగానే జెండా పండుగ చేశారు. ఇక అప్ప‌టి నుంచీ ఆ శిబిరాల కార్య‌క‌ర్త‌లు వేర్వేరుగానే కొన‌సాగుతున్నారు. ఇలా ప‌లు చోట్ల టీఆర్ఎస్ లో సఖ్య‌త లోపించ‌డం అధినాయ‌క‌త్వాన్ని క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది.

Show comments