Idream media
Idream media
మలమలమాడే ఎండల్లో ఒక డొక్కు సూట్ కేస్‌తో తిరుపతిలో దిగిన నాకు ఆ వూరు ఒక సెలయేరులా ఆదరిస్తుందని తెలియదు. ఎన్నో జ్ఞాపకాలు, కొంచెం చేదు కూడా. ఎక్కడో ఒక చోట తినాలి. కొద్ది రోజులు భీమాస్. బోర్ కొట్టిన తర్వాత తీర్థకట్ట వీధిలోని రకరకాల మెస్‌లు. ఒక రోజు ఒక మిత్రుడు రెడ్డెమ్మ మెస్‌లో తిన్నావా? అని అడిగాడు. లేదన్నాను. ఒకసారి చేపల పులుసు తిని చూడు అన్నాడు.
మధ్యాహ్నం ఎర్రటి ఎండలో కొత్తవీధి నుంచి భేరీ వీధి వరకూ నడుస్తూ వెళ్లాను. పాతకాలం ఇల్లు (ఇప్పుడు కొత్తగా కట్టారు). చిన్న బోర్డు. మెట్లు ఎక్కుతుండగా ఒక పెద్దావిడ. పెద్ద బొట్టు, చేతులు నిండా గాజులు, నోటి నిండా పలకరింపుతో “రా నాయనా” అనింది. మనకి తెలియని మనిషి అలా పలకరిస్తే సంతోషం. నవ్వు, పలకరింపుల్లో ఎలాంటి వ్యాపార రహస్యం లేదు. అది ఆమె వాత్సల్యం. మనుషుల్ని ప్రేమతో ఆహ్వానించి , కడుపు నిండా భోజనం పెట్టే లక్షణం. ఆమె పలకరింపుతోనే కడుపు నిండింది.
ఆ రోజుల్లో (1988) భోజనం 2.50 రూపాయలు. నాన్ వెజ్ తీసుకుంటే అదనం. వంట రూం నుంచి కట్టెల పొగలు. ఆమె పిల్లలే ఆ పనులు చేస్తున్నారు.
అబ్బోడికి (చిత్తూరు జిల్లాలో పిల్లల్ని అబ్బోడు అంటారు) చేప పులుసు ఎయ్‌మే అని ఎవరినో పురమాయించింది. పులుసు గుమ్మరించారు. రుచి అద్భుతం. వేళ్లు నాకేశాను. ఆ తర్వాత కుదిరినప్పుడల్లా వెళ్లేవాన్ని. ఎపుడు వెళ్లినా అదే నవ్వు, పలకరింపు.
Also Read : చంద్రబాబు సార్, మీరు మటన్ అమ్మలేదా?
ఒకసారి మెస్‌లో తింటూ వుండగా ఒక తాగుబోతు వచ్చాడు. అనవసరమైన పేచీకి దిగాడు. రెడ్డెమ్మ సముదాయించి అతనికి కావాల్సినవన్నీ తెప్పించింది. అయినా గొడవకు దిగాడు. శాంతంగా ఉన్న రెడ్డెమ్మ కాళికాదేవిగా మారింది. చెంప మీద కొడితే రెండు పల్టీలు కొట్టాడు.
“నా బట్ట బిడ్డికి చెప్పినట్టు చెబితే వినవు కదా, తాగి రెడ్డెమ్మతో గలాటాకి దిగుతావా? ఎంత ధైర్యం రా నీకి” అని ఈడ్చి బయటికి తోసింది.
అవసరమైతే పెద్ద గొంతుతో అరవగలిగిన రెడ్డెమ్మలో పసిహృదయం వుంది. ప్రతినెలా అనాథ పిల్లల కోసం బస్తా బియ్యం పంపుతుందని తెలిసి సంతోషమేసింది.
రెడ్డెమ్మ మెస్ పక్కనే శీనయ్య మెస్ వుండేది. అక్కడ కూడా నాన్‌వెజ్ అదుర్స్. అయితే తన దగ్గరికి వచ్చేవాళ్లు శీనయ్య దగ్గరికెళితే రెడ్డెమ్మకి కోపం.
“ఆ నా బట్ట చూడు. ఈడ ఏం తక్కువైందని ఆడికి పోతాండాడు” అనేది. ఇది నాకు తెలుసు కాబట్టి శీనయ్య మెస్‌కి వెళ్లాలనుకుంటే ఆమెకి కనిపించకుండా జాగ్రత్తగా వెళ్లేవాన్ని.
33 ఏళ్లైంది. మొదటిసారి రెడ్డెమ్మ చేపల పులుసు తిని. ఇంకా నాలుక మీదే వుంది. అదే రెడ్డెమ్మ గొప్పతనం. తిరుపతంటే వెంకటేశ్వరస్వామే కాదు, ఇంకా చాలా వున్నాయి. రెడ్డెమ్మ మెస్ ఒక ల్యాండ్ మార్క్. నేల మీద కాదు. తిన్నవారి మనసుల్లో.
Also Read : బిగ్‌బాస్ జోలి మీకెందుకు నారాయణ?