Idream media
Idream media
తెలుగుదేశం పార్టీకి ఒకటే లక్ష్యంగా కనిపిస్తోంది. అది జగన్ సర్కారును బద్నాం చేయాలి. ఇరుకున పెట్టాలి. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచాలి. ప్రతిపక్ష పార్టీగా ప్రజల ఆదరణ పొందేందుకు ప్రయత్నించడం పోయి.. టీడీపీ ఫోకస్ అంతా వైసీపీపైనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఎప్పుడైనా ఎక్కడ ఏ ఘటన జరిగినా దాన్ని ప్రభుత్వానికి ఆపాదిస్తూ హడావిడి చేయడం టీడీపీకి పరిపాటిగా మారింది. గుంటూరు లో జరిగిన రమ్య ఉదంతాన్ని కూడా ఇలాగే వాడుకోవాలని ప్రయత్నిస్తే.. జగన్ స్పందనతో సీన్ రివర్స్ అయింది. టీడీపీ లక్ష్యం నీరుగారింది. మానవతాదృక్పథంతోను, ముఖ్యమంత్రిగాను జగన్ అవలంబించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి.
కొద్ది రోజుల క్రితం రమ్య కుటుంబం జగన్ ను కలిసింది. వారిని ఓదార్చిన జగన్ ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి అధికారులకు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. మూడు రోజులు కూడా తిరగక ముందే.. రమ్య కుటుంబానికి ఐదు సెంట్ల నివేశన స్థలాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ఇంటి స్థలం పట్టాను హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత పరమాయ కుంటలోని రమ్య నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు స్వయంగా అందజేశారు. గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు గ్రామంలోని 5 లే అవుట్‌లో స్థలాన్ని కేటాయించారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతగానో స్పందించి.. రమ్య కుటుంబానికి అండగా నిలవడం, సత్వర చర్యలు చేపట్టడం అందరినీ ఆకర్షిస్తోంది.
రమ్య కుటుంబానికి పట్టా అందజేస్తూ హోం మంత్రి సుచరిత బాధిత కుటుంబ సభ్యులు కోరిన విధంగా నిందితుడికి త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. , ఎస్టీ యాక్ట్ ప్రకారం రమ్య తల్లిదండ్రులకు త్వరలో ఐదెకరాల భూమిని ప్రభుత్వం అందజేస్తుందని స్పష్టం చేశారు. వచ్చే సంవత్సరం రమ్య సోదరి మౌనిక డిగ్రీ పూర్తవుతుందని, అయితే మానవీయ కోణంలో సీఎం సూచన మేరకు డిగ్రీ పూర్తికాక ముందే సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగం ఇచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రమ్య కుటుంబానికి అన్ని విధాలుగా పూర్తి స్థాయిలో సహాయం అందజేశాక, వారితో కలిసి టీ తాగుతానని సీఎం చెప్పారని వివరించారు.
Also Read: నక్సలైట్లు మాజీ ఎమ్మెల్యే బుడ్డా వెంగళ రెడ్డిని ఎందుకు చంపారు?
ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఒకటి తలస్తే.. సీఎం జగన్కు మరొక విధంగా మేలు జరుగుతోందని అంటున్నారు పరిశీలకులు. గతంలోనూ ఇప్పుడు కూడా రాష్ట్రంలో జరిగిన పరిణామాలను గమనిస్తే.. టీడీపీ ఊహించినట్టుగా ఏమీ జరగడం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వానికి ఎవరు ఔనన్నా.. కాదన్నా.. ఎస్సీ వర్గాల బలం వారి అండదండలు పుష్కలంగా ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో వీరి అభయంతోనే జగన్ అనేక నియోజకవర్గాలను కైవసం చేసుకున్నారు. ఇక టీడీపీకి ఎస్సీలు దూరమవుతున్నారనే వాదన కూడా ఇటీవల కాలంలో బలంగా వినిపిస్తోంది. గతానికి భిన్నంగా ప్రభుత్వ చర్యలు ఉండడంతో బాధిత కుటుంబానికి కాస్త ఓదార్పు దొరికింది.
రమ్య ఘటన ద్వారా.. ఎస్సీ సామాజిక వర్గాన్ని వైసీపీకి దూరం చేసేందుకు టీడీపీ ప్రధానంగా దృష్టి పెట్టింది. అందుకే కొన్నాళ్ల కిందట నుంచి ఎస్సీ వర్గాలపై ఈగవాలినా.. అది జగన్ ప్రభుత్వం చేస్తున్న పనుల వల్లే అనే ప్రచారాన్ని భారీగా చేస్తోంది. గతంలో రాజధానిలోని ఎస్సీ రైతులపై పోలీసులు లాఠీ చార్జి చేయడంతో హుటాహుటిన జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేసింది. అంతేకాదు.. ఎస్సీ కమిషన్ గుంటూరులో పర్యటించేలా కూడా టీడీపీ అధినేత చంద్రబాబు చక్రం తిప్పారు.
అయితే.. ఎస్సీ కమిషన్ సభ్యులు వచ్చారు. కానీ గుంటూరులో ప్రతిపక్ష నేతలు తమకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏమీ జరగడం లేదని.. అంతా బాగానే ఉందని.. శాంతి భద్రతలను కాపాడడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని తేల్చేశారు. దీంతో అప్పట్లో ఆ వ్యూహం బెడిసి కొట్టింది. ఇక తాజాగా గుంటూరులో జరిగిన దళిత విద్యార్థిని రమ్య హత్య ఘటనను కూడా టీడీపీ వ్యూహాత్మకంగా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే రమ్య హత్య ప్రభుత్వ వైఫల్యం కారణంగానే జరిగిందంటూ.. జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదులు చేసింది. ఇక్కడ కు వచ్చి పరిశీలించాలని కూడా అభ్యర్థించింది. దీంతో తాజాగా గుంటూరుకు వచ్చిన ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షుడు హల్దార్.. అన్నీ పరిశీలించారు.
Also Read: టీడీపీ జేసి ఫ్యామిలీని పక్కన పెట్టేస్తుందా …?
ఆ వెంటనే ఆయన జగన్ సర్కారుకు భారీ కితాబు ఇచ్చారు. ప్రభుత్వం అనుసరించిన విధానం.. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని, రమ్య కుటుంబాన్ని ప్రభుత్వం బాగానే ఆదుకుందని.. తేల్చేశారు. దీంతో టీడీపీ అనుకున్నట్టుగా జాతీయ కమిషన్ జగన్ సర్కారును ఎక్కడా పలెత్తు మాట అనలేదు. ఈ పరిణామాలు టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆపార్టీ నాయకులను ఇబ్బంది పెట్టాయని పరిశీలకులు భావిస్తున్నారు.