స్పీడు పెంచిన టీడీపీ.. ఎంచుకున్న దారి స‌రైనదేనా?

రాజ‌కీయాలు చేయ‌డంలో చంద్ర‌బాబు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ.. ఆ మాత్రం రాజ‌కీయాలు చేయ‌డం కూడా స‌హ‌జ‌మే. అయితే, ఎటొచ్చి తొలి రెండున్న‌రేళ్ల కాలం ఆయ‌న‌కు అంత‌గా క‌లిసి రాలేదు. మ‌రోవైపు క‌రోనా కొంప క‌ద‌ల‌కుండా చేసింది. దీంతో టీడీపీ స్త‌బ్ధుగా మారింది. అయితే, కొద్ది కాలంగా ఆ పార్టీ మ‌ళ్లీ స్పీడు పెంచిన‌ట్లు క‌నిపిస్తోంది. ఐదేళ్ల‌లో మొద‌టి స‌గం కాలం ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉన్నా, వారి స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోక‌పోయినా ప‌ర్వాలేదు కానీ.. మిగ‌తా స‌గం కాలం ఏదో ఒక‌టి హ‌డావిడి చేయ‌క‌పోతే త‌ప్ప‌ద‌ని చంద్ర‌బాబునాయుడు భావించిన‌ట్లున్నారు. వ‌రుస కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ పార్టీని గాడిన పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే.. అందుకు ఆయ‌న ఎంచుకుంటున్న స‌బ్జెక్టుల‌పైనే భిన్నమైన చ‌ర్చ జ‌రుగుతోంది.

ఈ ఏడాది జ‌రిగిన కొన్ని ఆందోళ‌న‌ల‌ను ప‌రిశీలిస్తే.. అందులో కొవిడ్ బాధితుల‌ను ఆదుకోవాలంటూ చేప‌ట్టిన సాధ‌న దీక్ష ఒక‌టి. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిరసనకు దిగితే.. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గ కేంద్రాల్లో టీడీపీ శ్రేణులు దీక్ష చేప‌ట్టారు. అయితే.. క‌రోనా క‌ట్ట‌డి, చికిత్స లో దేశ వ్యాప్తంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు వ‌చ్చిన పేరు అంద‌రికీ తెలిసిందే. ఏపీలో చేప‌డుతున్న చ‌ర్య‌ల‌ను ప్ర‌ధాని నుంచి దేశ ప్ర‌ముఖులెంద‌రో ఎన్నోసార్లు ప్ర‌శంసించారు. రాష్ట్రంతో పాటు స‌మీప రాష్ట్రాల ప్ర‌జ‌లు కూడా క‌రోనా విష‌యం ఏపీ అవ‌లంబిస్తున్న విధానాల ప‌ట్ల సంతృప్తిగా ఉన్నారు. దీని వ‌ల్ల టీడీపీ సాధ‌న దీక్ష పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో దూరంగా తెలుగు త‌మ్ముళ్లు ఆ రోజున బ‌య‌ట‌కు రావ‌డం మిన‌హా ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త తెచ్చే ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైన‌ట్లే అని చెప్పొచ్చు.

Also Read: టీడీపీ జేసి ఫ్యామిలీని పక్కన పెట్టేస్తుందా …?

ఉద్యోగ నియామ‌కాల్లో కూడా జ‌గ‌న్ స‌ర్కారు ఆది నుంచీ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. మొద‌టి ఏడాదిలోనే సుమారు ల‌క్ష‌న్న‌ర ఉద్యోగాలు భ‌ర్తీ చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అది అంత‌టితో ఆగ‌కుండా ఉద్యోగాల భ‌ర్తీ కొన‌సాగేలా జాబ్ కేలెండ‌ర్ పేరుతో కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. ఇది నిరుద్యోగుల‌కు వ‌రంగా మారింది. జాబు కావాలంటే బాబు రావాల‌ని రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం జ‌రిగిన తొలి ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఊద‌ర‌గొట్టి అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ స‌ర్కారు ఉద్యోగాల క‌ల్ప‌న‌లో విఫ‌ల‌మైంద‌న్న అప‌ఖ్యాతి పొందింది. అటువంటి పార్టీ జాబ్ కేలెండ‌ర్ కు వ్య‌తిరేకంగా పిలుపునివ్వ‌డం, దీని ద్వారా యువ‌త‌కు ద‌గ్గ‌ర కావాల‌ని లోకేశ్ ప్ర‌య‌త్నించ‌డం.. అన్నీ తెలుగు త‌మ్ముళ్ల వ‌ర‌కే ఆక‌ట్టుకోగ‌లిగాయి. గ‌తానికి భిన్నంగా ఏపీ స‌ర్కారు ఉద్యోగాలు క‌ల్పిస్తుంటే.. దానికి అడ్డుత‌గిలేలా టీడీపీ చ‌ర్య‌లు ఉన్నాయ‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర ధరల పెంపుపై ఆగ‌స్టులో టీడీపీ నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చింది. ప్ర‌జ‌ల‌కు అంద‌రికీ నిత్యావ‌స‌ర‌మైన వాటి ధ‌ర‌ల పెంపుపై ఆందోళ‌న‌కు పిలుపు ఇవ్వ‌డం బాగుంది కానీ.. ఇక్క‌డ కూడా రాష్ట్ర ప్ర‌భుత్వాన్నే నిందించ‌డం, కేంద్రాన్ని ప‌ల్లెత్తు మాట అనే సాహ‌సం చేయ‌క‌పోవ‌డంపై బాబు ద్వంద్వ నీతి మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. అలాగే రాష్ట్ర విభ‌జ‌న‌కు స‌మ‌స్య‌ల‌పై కూడా జ‌గ‌న్ పైనే ఆరోప‌ణ‌లు చేస్తున్నారుకానీ.. కేంద్రాన్ని డిమాండ్ చేయ‌క‌పోవ‌డం అవ‌గాహ‌న ఉన్న‌వారు ఎవ‌రికైనా ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం, విశాఖ స్టీలు ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ అంశాల‌పై కూడా టీడీపీ జ‌గ‌న్ స‌ర్కార్ నే టార్గెట్ చేసి విమ‌ర్శ‌ల పాలైంది.

Also Read:ఆ మాజీ ఎమ్మెల్యే వయస్సు 104 ఏళ్ళు,ప్రభుత్వం నుంచి ఏమి కోరుకోడు

ఇప్పుడు.. ఈ నెల 13 నుంచి అంటే నేటి నుంచే.. మరో ఆందోళనకు టీడీపీ శ్రీకారం చుట్టింది. లోక్ సభ నియోజకవర్గ కేంద్రాల్లో.. పార్టీ శ్రేణులను పోరాట పథంలోకి తీసుకువెళ్తోంది. రైతు సమస్యలే ప్రాతిపదికగా.. తాజా కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియాకు వెల్లడించారు. ఐదు రోజుల పాటు, ఇర‌వై అయిదు నియోజకవర్గాల్లో.. రైతుల కోసం, వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాడనున్నట్టు అచ్చెన్న తెలిపారు. దీనికి మ‌హ‌త్త‌ర‌మైన పేరును కూడా పెట్టారు. అదే రైతు కోసం తెలుగుదేశం. న‌గ‌దు బ‌దిలీతో పాటు కొన్ని ప‌థ‌కాల ద్వారా రైతు ప‌క్ష‌పాతిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పేరు సంపాదించారు. రైతులంద‌రూ వైసీపీ ప్ర‌భుత్వం ప‌ట్ల సానుకూల దృక్ప‌థంతో ఉన్నారు. మ‌రి ఇటువంటి ప‌రిస్థితిలో టీడీపీ పిలుపున‌కు స్పందన ఉంటుందా అనేది చూడాలి.

స్థానిక ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత చాలా ప్రాంతాల్లో టీడీపీ జెండా మోసేవారే కరువయ్యారు. ఇతర పార్టీల్లోకి వెళ్లినా ప్రాధాన్యం దక్కదేమోనన్న అనుమానం ఉన్నవారే టీడీపీలో మిగిలిపోయారు. మ‌రి ఇలాంటి స్థితిలో ఉన్న పార్టీని వ‌చ్చే ఎన్నిక‌ల్లోపు మ‌ళ్లీ బలోపేతం చేసేందుకు వ‌రుస కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌నుకోవ‌డం స‌రే కానీ.. రాష్ట్రంలో ప‌రిస్థితులు, ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త తీసుకొచ్చేందుకు ప‌నికిరాని అంశాల‌ను ఎజెండా గా రూపొందిస్తుండ‌డం పార్టీకి ఎంత మేర‌కు మేలు చేస్తుందో అధినేత‌కే తెలియాలి. రాష్ట్ర ప‌రిధిలోని అంశాల‌కు సంబంధించి రాష్ట్రాన్ని నిల‌దీయాలి, కేంద్ర ప‌రిధిలో ఉంటే కేంద్రాన్ని డిమాండ్ చేయాలి కానీ.. అన్నింటికీ జ‌గ‌న్ నే బాధ్యుడిని చేయాల‌నుకుంటే.. అది స్వార్థ‌పూరిత చ‌ర్య అవుతుంది కానీ.. పార్టీకి, ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డ‌ద‌నే విష‌యాన్ని బాబు గుర్తిస్తే మేలు.

Also Read:టీఆర్ఎస్ లో ఓ వైపు అలా.. మ‌రో వైపు ఇలా..!

Show comments