Jr ntr – టీడీపీ శ్రేణులకు మింగుడు పడని జూనియర్ ఎన్టీఆర్ స్టేట్మెంట్

తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి కార్యకర్తలు కొంతమంది కాస్త అత్యుత్సాహం ఎప్పటినుంచో ప్రదర్శిస్తు ఉంటారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న బలహీనంగా ఉన్నా సరే జూనియర్ ఎన్టీఆర్ ని ఏదో ఒక రూపంలో లాగే ప్రయత్నం కార్యకర్తలు గట్టిగానే చేస్తారు. 2014 ఎన్నికల్లో ప్రచారం చేయకపోవడం 2019 ఎన్నికలకు దూరంగా ఉండటం అలాగే జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు అప్పటి ప్రతిపక్ష పార్టీలో చేరడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు.

అదేవిధంగా మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యల విషయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పదేపదే ఎన్టీఆర్ ని ప్రస్తావించటం టీడీపీ అనుకూల మీడియా కూడా ఎన్టీఆర్ గురించి ఎక్కువగా రాతలు రాయడం వంటివి జరుగుతుంటాయి. కుప్పం మున్సిపల్ ఎన్నికలకు ముందు జూనియర్ ని పార్టీ కార్యకర్తలు పదేపదే వివాదాల్లోకి లాగడం, అలాగే కొంత మంది ఎన్టీఆర్ అభిమానులు చేసిన వ్యాఖ్యల గురించి ఎన్టీఆర్ ని తిట్టడం వంటివి చేస్తూ వచ్చారు. ఇక చంద్రబాబు పర్యటన సందర్భంగా కొంత మంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేసిన అత్యుత్సాహం కూడా టిడిపి కార్యకర్తలకు నచ్చలేదు.

ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ వార్తల్లో నిలిచాడు. ఆంధ్రప్రదేశ్ శాసన సభలో జరిగిన వ్యవహారం విషయంలో నందమూరి కుటుంబం మొత్తం కూడా స్పందించింది. ఆ తర్వాత ఎన్టీఆర్ కాస్త ఆలస్యంగా స్పందించటం, స్పందించిన సమయంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు టిడిపి కార్యకర్తలకు నచ్చలేదు. రెండు నిమిషాలకు పైన వీడియో విడుదల చేసిన ఎన్టీఆర్ అందులో మహిళల గురించి ఎవరు వ్యాఖ్యలు చేసిన తప్పని, శాసనసభలో జరిగిన వ్యవహారం జరగకుండా ఉండాల్సిందని, భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూసుకోవాలని రాజకీయాల్లో కి మహిళలను లాగటం కరెక్ట్ కాదు అని… ఎవరి పేరు ప్రస్తావించకుండా తన వీడియోని ముగించాడు.

ఇందులో నారా భువనేశ్వరి పేరుగానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరు గాని లేకపోతే నందమూరి కుటుంబ సభ్యుల పేర్లు కానీ ఎక్కడా కూడా ప్రస్తావించకుండానే వీడియో ముగించడం తో టిడిపి కార్యకర్తలకు రుచించలేదు. వాస్తవానికి నందమూరి కుటుంబ సభ్యులు అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ సహా పలువురు నందమూరి కుటుంబానికి సన్నిహితంగా ఉండే వాళ్ళు అందరూ స్పందించినా సరే ఎన్టీఆర్ స్పందించలేదు. దీంతో ఎన్టీఆర్ మాట్లాడటం లేదని సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అని కొంతమంది, అలాగే కొడాలి నాని మిత్రుడు కావడంతోనే ఏం మాట్లాడటం లేదని కొంతమంది… ఎవరికి నచ్చిన వ్యాఖ్యలు వాళ్ళు చేశారు.

చివరకు ఎన్టీఆర్ స్పందించిన తర్వాత అతను మిత్రుల పేరును ప్రస్తావించడానికి ఇబ్బంది పడుతున్నాడని, అందుకే సంఘసంస్కర్తలా పరిణతి చెందిన వ్యక్తిలా మాట్లాడి వీడియో ముగించాడు అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఇక తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా లో పనిచేసే కొంతమంది జర్నలిస్టులు కూడా దీనికి సంబంధించి పోస్టులు పెట్టడం గమనార్హం. స్పందిస్తే ఒక రకంగా, స్పందించకపోతే మరో రకంగా జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేయడం పట్ల ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మాట్లాడిన అంశాలను వాడుకొనే విషయంలో టిడిపి కార్యకర్తలు విఫలమవుతారు అనేది మరోసారి స్పష్టంగా రుజువైంది. పేర్లు ప్రస్తావించకపోయినా సరే కుటుంబానికి మద్దతుగా నిలిచాడు కాబట్టి, దాన్ని ప్రమోట్ చేసుకోవడం మానేసి తమకు నచ్చిన విధంగా మాట్లాడలేదు అని ఫీల్ అవ్వడం మాత్రం విస్మయానికి గురిచేసింది. రాజకీయంగా టిడిపి బలహీనంగా ఉన్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ను దగ్గర చేసుకోవడం మానేసి… వివాదాస్పద వ్యాఖ్యలతో టిడిపి నాయకులు, కార్యకర్తలు అతన్ని దూరం చేసుకోవడం పార్టీని బాగా ఇబ్బంది పెడుతున్న అంశం. మరి ఈ విషయంలో ఇప్పటికైనా సరే జాగ్రత్త పడతారా… లేకపోతే అనవసర విషయాల్లో కి ఎన్టీఆర్ ని లాగి ఉన్న పరువును పోగొట్టుకుంటారా అనేది టిడిపి కార్యకర్తలు ఆలోచించుకోవాలి.

Show comments