కేసీఆర్‌ కావాలనే వెళ్లలేదు.. అయితే ఏంటి?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో పర్యటించి నాలుగు రోజులవుతోంది. ఆయనను ఆహ్వానించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెళ్లలేదు. దీనిపై బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఘాటుగా స్పందించారు. ‘ప్రధాని పర్యటనలో సీఎం కావాలనే పాల్గొనలేదు.. అయితే ఏంటి?’ అన్నట్లుగా వ్యాఖ్యానించారు. ‘‘ప్రధాని పర్యటనలో సీఎం కేసీఆర్‌ కావాలనే పొల్గొనకపోయి ఉండొచ్చు. అందులో తప్పేంది? ఏడున్నరేళ్లుగా తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉన్నారు. మన రైతుల నుంచి ధాన్యం కొనలేదు. సింగరేణినీ అమ్ముతమంటున్నారు. రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. ఏ ఒక్క ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇవ్వలేదు. ప్రధాని పర్యటనను బహిష్కరిస్తే తప్పేముంది? వారికి మేం భయపడాలా?’’ అని మంత్రి వ్యాఖ్యానించారు.

మా పద్ధతులు మాకుంటాయి..

తెలంగాణకు ప్రధాని మోదీ వచ్చినప్పుడు సీఎం కేసీఆర్‌ ఉద్దేశపూర్వకంగానే ఆయన పర్యటనలో పాల్గొనలేదన్న విమర్శలపై తలసాని ఈ మేరకు స్పందించారు. రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకు ప్రభుత్వం నియమించిన ప్రతినిధిగా ఒక మంత్రి ఉండాలన్నారు. ‘ఆయనకు ఆహ్వానం పలికేందుకు మంత్రిగా నేను వెళ్లాను కదా?’ అని అన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌కు జ్వరం వచ్చిందని చెప్పాల్సిన అవసరం కూడా లేదని తెలిపారు. గతంలో ప్రధాని తెలంగాణకు వచ్చినప్పుడు తాము గౌరవించలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ సీఎంగా కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం చేయకముందే ఏడు మండలాలు ఆంధ్రాలో కలిపేశారని, వారి ఇష్టం ఉన్నట్లు వారు చేస్తున్నప్పుడు.. తమ పద్ధతులు తమకు ఉంటాయని చెప్పారు.

ప్రత్యేక హోదా ఇస్తావా..

‘‘కేంద్రంలో అధికారం బీజేపీ చేతిలోనే ఉంది కదా? ప్రత్యేక హోదా ఇస్తావా.. ప్యాకేజీ ఇస్తావా.. ఏం ఇస్తావో ఇవ్వు? రాజ్యాంగ ప్రకారం విభజన జరిగింది. ఆ విభజన చట్టంలో ఏమున్నాయో చేయాలి కదా?’’ అని అన్నారు. తెలంగాణ బీజేపీలో నెహ్రూ జూలాజికల్‌ గ్యాంగ్‌ అంతా ఉందని, వారి సింగిల్‌ పాయింట్‌ అజెండా అరవడమేనని చెప్పారు. పార్లమెంటులో ప్రతిపక్షాలు ఏమీ ప్రశ్న వేయకుండానే విభజనచట్టం గురించి మోదీ మాట్లాడారని, ఇది పొలిటికల్‌ డ్రామా కాకుంటే మరేంటని ప్రశ్నించారు. దేశ రాజకీయాల్లో మార్పు కేసీఆర్‌తోనే ప్రారంభం అవుతుందని చెప్పారు.

Show comments