Idream media
Idream media
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కాన్వాయ్ పై కాల్పుల ఘటన దేశ వ్యాప్తంగా సంచలనమైంది. దీనిపై దేశవ్యాప్తంగా శాంతియుత నిరసన ప్రదర్శనలకు అసద్ పిలుపు ఇవ్వడంతో ఘటన జరిగిన యూపీతో పాటు, హైదరాబాద్ పాతబస్తీలో ఆందోళన వాతావరణం ఏర్పడింది. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి నుంచే హైదరాబాద్ లోని ప్రధాన జంక్షన్లలో బందోబస్తు పెంచారు. ప్రధానంగా పాతబస్తీపై దృష్టి సారించారు. ఈ రోజు నిరసన ప్రదర్శనలు చేయనున్నట్లు పేర్కొనడంతో అన్ని ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. చార్మినార్ పైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నంచిన పలువురు ఎంఐఎం కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా.. కాల్పుల ఘటనతో కేంద్రం అప్రమత్తమైంది. అసలే ఎన్నికల వేళ అసదుద్దీన్ పై జరిగిన దాడి ఘటనతో చర్యలకు ఉపక్రమించింది. ఎంపీకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. కొంత కాలంగా అసద్ యూపీలోనే పర్యటిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బలంగా ఉన్న ముస్లిం సామాజికవర్గాన్ని ఏకంచేసి సీట్లను కొల్లగొట్టేందుకు విస్తృతంగా కృషి చేస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ హైదరాబాద్ ఎంపీపై కాల్పులు కలకలం రేపాయి. పద్నాలుగు లేన్ల జాతీయ రహదారిపై ఇద్దరు దుండగులు కాల్పులకు తెగబడడం సంచలనంగా మారింది. ఎరుపు, తెలుపు రంగుల్లో వచ్చిన ఇద్దరు దుండగులు ఒకరి తర్వాత మరొకరు ఓవైసీపై కాన్వాయ్ పై కాల్పులు జరిపారు.
ఆ సమయంలో హైదరాబాద్ మాజీ మేయర్ హుస్సేన్ ఆయన వెంటే ఉన్నారు. కాల్పులు జరుపుతున్న నిందితుడి మీదుగా కారు మళ్లించారు. అప్పటికే దుండగులు మొత్తం నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. కాగా ఓవైసీపై దాడి చేసిన కేసులో ఇద్దరు షూటర్లను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అసదుద్దీన్ ఓవైసీ హిందూ వ్యతిరేక ప్రసంగాలపై ఆగ్రహంతోనే ఈ దాడికి పాల్పడినట్లు కాన్వాయ్ పై కాల్పులు జరిపిన నిందితులు యూపీ పోలీసులకు వెల్లడించినట్టు తెలిపారు. దాడికి పాల్పడిన వారిని విచారిస్తున్నారు. విచారణలో ఓవైసీ హిందూ వ్యతిరేక ప్రకటనలతో బాధపడి ఈ చర్యకు పాల్పడ్డామని నిందితులు పేర్కొన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
ఇక పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అరెస్ట్ చేసిన వ్యక్తి నుంచి 9 ఎంఎం పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఐదు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.ఈ ఘటన అనంతరం అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తనపై కాల్పుల ఘటనపై యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతోపాటు కేంద్రప్రభుత్వం కూడా దర్యాప్తు జరిపించాలని కోరారు. ఈ విషయంపై లోక్ సభ స్పీకర్ ను కూడా కలుస్తానని తెలిపారు. ఎన్నికల సంఘం కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ అంశంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఎన్నికల కమిషన్ ను అసదుద్దీన్ కోరారు.
Also Read : అసద్‌పై కాల్పులు.. కేంద్రం కీలక నిర్ణయం