Idream media
Idream media
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ పంజాబ్ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ తాజాగా సంచలన ప్రకటన చేశారు.కాంగ్రెస్ పార్టీని వీడి, ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం సాగగా.. అందుకు భిన్నంగా కెప్టెన్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన తాను కాంగ్రెస్‌పార్టీలో ఉండలేనని,అలాగే బీజేపీలోనూ చేరలేనని చెప్పారు. కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు అమరీందర్ సింగ్ ప్రకటించారు.
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటి నుంచీ కాంగ్రెస్ పార్టీపై అమరీందర్ సింగ్ అసంతృప్తితో ఉన్నారు. పార్టీ నేతలు బుజ్జగించినా ఆయనలోని అసంతృప్తి చల్లారలేదు.పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిసేందుకు ఇష్టపడలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడుతారనే ప్రచారం మొదలైంది. రెండు రోజుల క్రితం ఢిల్లీ రావడంతో.. బీజేపీ పెద్దలను కలుస్తారని, ఆ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం ముమ్మరంగా సాగింది. ఈ క్రమంలోనే కెప్టెన్, బుధవారం బీజేపీ అగ్రనేత, హోం మంత్రి అమిత్‌షాను కలిశారు. ఇక అమరీందర్ సింగ్ బీజేపీలో చేరడం, కేంద్ర మంత్రివర్గంలో చేరడం లాంఛనమేనని అంతా అనుకున్నారు.అయితే ఈ రోజు అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ.. కొత్త పార్టీ పెడుతున్నట్లు అమరీందర్ సింగ్ ట్విస్ట్ ఇచ్చారు.
Also Read : మమత కాంగ్రెస్‌నే టార్గెట్ చేస్తున్నారా? తృతీయ కూటమికి అది విఘాతమేనా
బీజేపీ ఎత్తుగడేనా..?
అమరీందర్ సింగ్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు. కెప్టెన్ కొత్త పార్టీ ఆలోచన ఆయనది కాకపోవచ్చు. బీజేపీ డైరెక్షన్‌లోనే కెప్టెన్ నూతన పార్టీ ఏర్పాటు చేస్తున్నారనే సందేహాలు లేకపోలేదు. కాంగ్రెస్‌లో ఉండలేను, బీజేపీలో చేరలేనని అమరీందర్ సింగ్ అన్నప్పుడు.. బీజేపీ అగ్రనేత అమిత్‌షాను కలవాల్సిన పనేముందనే సందేహాలు రాకమానవు. అమిత్‌షాను కలసిన మరుసటి రోజునే కెప్టెన్ పార్టీ ఏర్పాటు నిర్ణయం ప్రకటించడం వెనుక.. బీజేపీ పెద్దల ప్లాన్ లేదని చెప్పినా నమ్మశక్యం కాదు.
పంజాబ్‌లో కష్టమనేనా..?
నూతన వ్యవసాయ చట్టాలు పంజాబ్‌లో బీజేపీ పరిస్థితిని పూర్తిగా మార్చివేశాయి. ఈ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేస్తున్న డిమాండ్‌కు మద్ధతుగా పంజాబ్‌లోని శిరోమణి అకాళిదల్ పార్టీ బీజేపీతో మితృత్వాన్ని వదులుకుంది. ఎన్డీఏ ప్రభుత్వం నుంచి వైదొలిగింది. గత ఏడాది జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పాలైంది. మాజీ కార్పొరేటర్లు, కౌన్సిర్లకు సింగిల్ డిజిట్ ఓట్లు పడ్డాయంటే.. ఆ పార్టీపై పంజాబ్ ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. రాబోయే ఫిబ్రవరిలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటిరిగా బరిలోకి దిగితే.. ఎలాంటి ఫలితాలు వస్తాయే బీజేపీకి స్పష్టంగా తెలుసు. స్థానికంగా ఉన్న పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా లేవు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు తమ ఆందోళనలను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఉద్యమం మొదలు పెట్టి ఏడాదైన సందర్భంగా రెండు రోజుల క్రితం మరోసారి భారత్ బంద్‌ను నిర్వహించారు. అది విజయవంతమైంది.
Also Read : భవానీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక.. ఎమ్మెల్యే కోసం కాదు.. అంతకుమించి…
పంజాబ్‌లో బీజేపీ పరిస్థితి ఇలా ఉన్న నేపథ్యంలో.. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ బీజేపీలో చేరినా.. ఏ మాత్రం ఉపయోగం ఉండదు. ఈ లెక్కలు వేసుకునే బీజేపీ పెద్దలు అమరీందర్ సింగ్ ద్వారా కొత్త పార్టీ పెట్టిస్తున్నారని చెప్పవచ్చు. పంజాబ్ ఎన్నికల్లో అమరీందర్ సింగ్ పార్టీ ఎంత మేరకు ప్రభావం చూపుతుంది..? ఎన్ని సీట్లు గెలుస్తుంది..? అనే విషయాలతో సంబంధం లేకుండా.. ఎన్నికల ముగిసిన తర్వాత కెప్టెన్ తన పార్టీని బీజేపీలో విలీనం చేయడం లేదా ఎన్టీఏ మిత్రపక్షంగా మారి కేంద్ర మంత్రివర్గంలో చేరడం యాధృచ్ఛికమే.
ఈ సారి గట్టి పోరు..
117 సీట్లు ఉన్న పంజాబ్‌లో 2017 ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ 79 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ 19 సీట్లతో రెండో స్థానంలోనూ, శిరోమణి అకాళిదల్ 14 సీట్లు, దాని మిత్రపక్షమైన బీజేపీ 2 సీట్లు గెలుచుకున్నాయి. మిగిలిన చోట్ల స్వతంత్రులు, చిన్న పార్టీలు గెలిచాయి.
ఈ సారి పంజాబ్‌లో బలమైన త్రిముఖ పోరు జరిగే అవకాశం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా కనిపిస్తోంది. ఈ దఫా పంజాబ్‌లో తాము అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు అధికారాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ, తిరిగి పూర్వవైభవం సాధించాలని శిరోమణి అకాళిదల్ ఎన్నికల వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఈ మూడు పార్టీల మధ్య అమరీందర్ సింగ్ పెట్టబోయే పార్టీ ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో వేచి చూడాలి.
Also Read : అమిత్‌షాతో అమరిందర్ భేటీ.. బీజేపీలో చేరిక, కేంద్రమంత్రి కావటం లాంఛనమే?