కులానికి పిలుపునిచ్చిన పవన్‌ కల్యాణ్‌.. అసలు లక్ష్యం ఏమిటి..?

నిలకడలేని రాజకీయాలు చేస్తుంటారని జనసేన మాజీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ తన మాటలతో నిరూపిస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో తనకు ఏ కులంతో సంబంధంలేదన్న ఆయన.. తాజాగా కులాల పేరిట రాజకీయాలు చేస్తున్నారు. శ్రమదానం పేరుతో ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలోని బాలాజీపేటలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు ఆయనలోని నిలకడలేమిని తెలియజేస్తున్నాయి.

సమసమాజం కోసం కాపు, తెలగ, ఒంటరి, బలిజలు ముందుకు రావాలని పవన్‌ పిలుపునిచ్చారు. 70 ఏళ్లుగా పోరాడుతున్న ఈ ఐక్యకులాల నేతలు ఇకపై పెద్దన్న పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. మీరు వస్తే గానీ ఇతర కులాల వారు బయటకు రారని పలు కులాల పేర్లను పవన్‌ తన ప్రసంగంలో ప్రస్తావించారు. రాష్ట్రంలో కుల రాజకీయాలు చేస్తున్నారంటూనే.. కులాల పేర్లను ప్రస్తావిస్తున్న పవన్‌ కల్యాన్‌ తన పరిజ్ఞానాన్ని చాటుకున్నారు.

Also Read : అనువుగాని చోట పవన్ సభ …..

నేను తగ్గాను.. మీరు తగ్గండి..

ఇటీవల కొంత కాలంగా జనసేన పార్టీ బీజేపీతో పొత్తును తెంచుకుని టీడీపీతో మళ్లీ జతకట్టబోతోందని జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చేలా పవన్‌ మాట్లాడుతున్నారు. ఇటీవల మంగళగిరి పార్టీ కార్యాలయంలో చేసిన వ్యాఖ్యలకు మరింత కొనసాగింపుగా తాజాగా మరికొన్ని వ్యాఖ్యలు చేయడం పవన్‌.. టీడీపీతో పొత్తుకు ఫ్లాట్‌ఫాం సిద్ధం చేస్తున్నారని స్పష్టమవుతోంది. ఏ కులం వర్గ శత్రువు కాదన్న ఆయన.. కమ్మలకు జనసేన వ్యతిరేకం కాదని తెలియజేసేందుకే 2014 ఎన్నికల్లో మద్ధతు తెలిపానని చెప్పారు. ఏదైనా సాధించాలంటే తగ్గి ఉండాలని.. తాను తగ్గి ఉంటున్నానన్న పవన్‌ కల్యాణ్‌.. కాపు, ఒంటరి, తెలగ, బలిజ కుల పెద్దలు కూడా తగ్గి ఉండాలంటూ తన మనుసలోని మాటను బయటపెట్టారు.

కలుపుకుని వెళదాం అంటూ..

దశాబ్ధాల తరబడి అధికారంలోకి ఉన్న శక్తులను పడదోసి కొత్త వారు వస్తారని నిరూపించే బాధ్యత తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలపై ఉందని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పెద్దన్న పాత్ర పోషిస్తూ అందరినీ కలుపుకుని వెళ్లాలంటూ.. జనసేన భవిష్యత్‌ పొత్తు రాజకీయానికి అంతా సిద్ధం చేసుకుంటున్నారు. కాపులు తనకు ఓట్లు వేయకపోవడం వల్లే రెండు చోట్లా ఓడిపోయానని పలుమార్లు చెప్పుకున్న పవన్‌ కల్యాణ్‌.. ఈ సారి తన సామాజికవర్గం వారు తన వెంట నడిచేలా ఈ తరహాలో ప్రసంగాలు ఇస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. తాను ఎవరితో పొత్తు పెట్టుకున్నా.. వారికి మద్ధతుగా ఉండాలనేలా పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలున్నాయి. అన్ని కులాల సాధికారిత కోసం జనసేన పార్టీ పని చేస్తుందని, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని పవన్‌ కల్యాణ్‌ చెప్పుకొచ్చారు.

Also Read : ప‌వ‌న్ ఇక నుంచే రాజ‌కీయ నాయకుడ‌ట‌.!

Show comments