Idream media
Idream media
రాయలసీమ గురించి కడప గురించి కడప ప్రాంతం గురించి ఇక్కడ ప్రజల గురించి సోము వీర్రాజు గారు ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు దుర్మార్గమైనవి. దానిని ఏ ప్రాంత ప్రజలు కూడా హర్షించరు. రాయలసీమ మరియు కడప ప్రాంత ప్రజల గురించి అవమానంగా మాట్లాడడం తగదు.
ఇది వరకు సినిమావాళ్ళు రాయలసీమ ప్రాంతాన్ని రాయలసీమ యాసను, రాయలసీమ జీవితాన్ని వక్రీకరించి ఇతర ప్రాంత ప్రజలకు రాయలసీమ అంటే కేవలం కక్షలు, కార్పణ్యాలు, బాంబులు వంటి విషసంస్కృతిని పరిచయం చేశారు.అసలు రాయలసీమలో ప్యాక్షన్ ఎప్పుడో అంతమయ్యింది. గ్రామాలలో ఉన్న చిన్న చిన్న గ్రామ తగాదాలను ఇతర ప్రాంత ప్రజలు ఫ్యాక్షన్ గా పిలవడం పరిపాటి అయిపోయింది.
నాలుగు తెలుగు ప్రాంతాలలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర తెలంగాణ ప్రాంతాలలో విభిన్నమైన భౌగోళిక పరిస్థితులను , విభిన్నమైన మానవ సంబంధాలను, విభిన్నమైన పంటలను విభిన్నమైన సంస్కృతి, సంప్రదాయాలను కలిగి ఉన్న ఏకైక ప్రాంతం రాయలసీమ.
తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు వీర్రాజు.
కర్నూలు జిల్లాకు రోడ్లు కూడా లేవు అన్నాడు ఇది మరీ విడ్డూరం. బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారి కర్నూలు మీదుగానే వెళుతుంది. కడప హైదరాబాదు జాతీయ రహదారి కర్నూలు మీదుగానే వెళుతుంది.ఆంధ్ర రాష్ట్రానికి 1953లో తొలి రాజధాని కర్నూలు అనే విషయం కూడా మర్చిపోయాడు.
సోము వీర్రాజు నిన్న మాట్లాడిన మాటలు యథాతథంగా ఇలా ఉన్నాయి.
“రాయలసీమలో ఎయిర్ పోర్ట్,
కడపలో ఎయిర్ పోర్ట్
ప్రాణాలు తీసే వారి జిల్లాలో కూడా ఎయిర్ పోర్ట్
వాళ్ళకు ప్రాణాలు తీయటమే వచ్చు”
అనడం చాలా దురదృష్టకరం.
రాయలసీమ ప్రజలకు ప్రాణం తీయడం తప్ప మరేమీ తెలియదన్న ఆ దుర్మార్గపు మాటలకు సమాధానంగా
రాయలసీమ అంటే ఏమిటో రాయలసీమ ఎలా ఉంటుందో ఒక్కసారి మీ ముందుకు.
తరతరాలుగా కరువుతో అల్లాడినా కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోని మనిషిలా ఉంటుంది ఈ నేల. రాయలసీమ ప్రజల మాట కఠినతనానికి కరుకు తనానికి చిహ్నం. కానీ అంతకుమించిన మంచితనానికి మానవత్వానికి పుట్టినిల్లు. రాయలసీమ గొప్పతనం అంతా ఇంతా కాదు ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే…..
* తెలుగు నేలలో మొట్ట మొదటి పత్రిక నడిచింది రాయలసీమ నుండే (1834- సత్యదూత ).
* రాయలసీమ నుండి స్వాతంత్ర్యానికి పూర్వం ఇతర ఏ ప్రాంతంలో లేని సుమారు 40 పైగా వార మాసపత్రికలు నడిచాయి.
* పారిశ్రామికీకరణ లో భాగంగా ఇతర ప్రాంతంలో లేని ఎన్నో పరిశ్రమలు రాయలసీమలో నెలకొల్పబడ్డాయి.
* అసలు తెలుగు నేలలో మొట్టమొదట రైలు నడిచింది రాయలసీమ నుండి( రేణిగుంట నుండి పుత్తూరు 1862)
* ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదట 1805లో ఆంగ్ల మాధ్యమం మిషనరీ స్కూల్ మొదలయింది జమ్మలమడుగులో.
* ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదట అనిబిసెంట్ దివ్యజ్ఞాన సమాజం మదనపల్లి 2016 లో ప్రారంభించారు. ఇది విస్తృతమైన విద్యావ్యాప్తికి అస్పృశ్యత నివారణకు కృషి చేసింది.
* సాంఘిక సంస్కరణ లో భాగంగా కందుకూరి వీరేశలింగం పంతులు 1879 లో జరిపిన వితంతు వివాహానికి ముందే రాయలసీమ లోని ధర్మవరంలో 1842 లోనే వితంతు పునర్వివాహం జరిగింది.
ఇక సాహిత్యం విషయానికి వస్తే
* శ్రీ కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఎక్కువమంది రాయలసీమ వారు.
* నాటక పితామహుడు ధర్మవరపు కృష్ణమాచార్యులు రాయలసీమ వాడు.
* సాహిత్య విమర్శ మేరువు కట్టమంచి రామలింగారెడ్డి సీమ వాడు.
*ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సురభి నాటకం సీమది.
* తెలుగు నుండి ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి రాయలసీమ వాసి.
* తెలుగునేల నుండి ఎన్నికైన ఏకైక ప్రధాని పి.వి ని ఎందుకున్నది మా నంద్యాల గడ్డ.
* తెలుగు జాతి పౌరుష తిలకం నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా గెలిపించిన నేల హిందూపురం ఈ సీమ తల్లిది.
ఇంకా చెప్పాలా రాయలసీమ గురించి
కలియుగ వైకుంఠం తిరుపతి
భూలోక కైలాసం శ్రీశైలం
శిష్టరక్షణ దుష్టశిక్షణ చేసిన అహోబిలం నరసింహుడు
శిల్పకళా వైభవానికి నిదర్శనం లేపాక్షి.
ఇలా ఎన్ని ఎన్నని చెప్పాలి.
ఇక కడప గురించి పలికిన మాటలకు సమాధానం ఇదిగో
తెలుగు భాషా చరిత్ర కు ఆనవాళ్ళు ఇచ్చిన నేల కడప.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వాగ్గేయకారుడు
అన్నమయ్య జన్మస్థలం కడప
ప్రతి తెలుగువాడి నాలుకపై కదలాడే
వేమన పుట్టింది కడప.
తెలుగు సినీ చరిత్రను అంకురార్పణ గావించిన బి. యన్. రెడ్డి సోదరులకు జన్మనిచ్చినది కడప.
కాలజ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేసిన పోతులూరి వీరబ్రహ్మం గారు పురిటిగడ్ఠ కడప.
సాక్షాత్తు వైకుంఠవాసుని తొలి గడప కడప.
తొలి తెలుగు కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క మా అక్క.
తెలుగు లో రామాయణం రాసిన ఏకైక కవయిత్రి మొల్ల కడప బిడ్డ.
ఇక్కడి మానవ సంబంధాలు ఏ ప్రాంతంలో కనిపించవు.
కులాల మతాల సమైక్యత మా కడపలో అన్నిచోట్ల సాక్షాత్కరిస్తుంది.
“ఈయాల పొద్దున ఏ మనిషి కనిపించినా పల్లెటూర్లో ఇంత బువ్వ తిని పోదురాబ్బా”
అని పిలిచే ప్రాంతం రాయలసీమ .
కుల కుమ్ములాటలు మత ఘర్షణలు ఈ ప్రాంతంలో ఎక్కడా కనిపించవు.
ఇప్పటికీ మా ప్రాంత పల్లెలు ప్రశాంత నిలయాలు.
మానవతి ఆలయాలు.
ఇక్కడ నుండి ఎంతో మంది కలెక్టర్లు, ఇంజనీర్లు ,డాక్టర్లు ఎస్పీలు ఇలా మహోన్నతమైన స్థాయికి చేరి ఎంతో మంది ఈ గడ్డపైన జన్మించారు.
దేశ రక్షణ దళంలో ఈ జిల్లా ప్రాతినిథ్యం తక్కువేమీ కాదు.
ఇతర దేశాలలో వివిధ రంగాల్లో రాణిస్తూ ఈ జిల్లా ఖ్యాతిని ప్రపంచం నలుమూలల వ్యాపింజేస్తున్నారు.
మాట అంటే పడిపోవడం అసలు తెలియదు.
* మాట కోసం ప్రాణాలు ఇచ్చే అంత గుణం మాకే సొంతం.
ఈ ప్రాంతంలో కులాలు మతాలు వేరైనా అయ్యా, అన్నా, మామ, అమ్మా, అని పిలుసుకోవడం మాత్రమే తెలుసు.
మా ప్రాంత ప్రజల గురించి
వాళ్లకు ప్రాణాలు తీయడం మాత్రమే తెలుసు అన్న వీర్రాజు
ఈ ప్రాంతం గురించి తెలుసుకో
ఈ ప్రాంత ప్రజల గుణం
ఈ ప్రాంత ప్రజల మంచితనం
ఈ ప్రాంత ప్రజల సంస్కారం
ఈ ప్రాంత ప్రజల గొప్పతనం
ఈ ప్రాంత చరిత్ర
ఈ ప్రాంత సంస్కృతి తెలుసుకుంటే మంచిది.
రాయలసీమ ప్రాంతం గురించి చెప్పినది కేవలం గోరంత మాత్రమే చెబితే కొండంత ఉంది. వీర్రాజు అనవసరమైన మాటలు మాట్లాడద్దు.
– డా.తవ్వా వెంకటయ్య , కడప
Also Read : కడుపులో కత్తులు , కళ్ళలో ప్రేమలు -కడపపై ఆ నాయకుల తీరు