Idream media
Idream media
ఈ సంవత్సరం అద్భుతమైన ఫామ్ లో ఉండి ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ట్రోఫీలు సాధించిన ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు నోవాక్ జోకోవిచ్ టోక్యోలో జరగబోయే ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనడం మీద సందేహం వెలిబుచ్చినప్పుడు కేలండర్ గోల్డెన్ గ్రాండ్ స్లామ్ సాధించే అవకాశం వదులుకొంటున్నందుకు క్రీడాభిమానులు నిరాశ చెందారు. అయితే ఆ తర్వాత అతను మనసు మార్చుకుని సెర్బియా దేశ ఆటగాళ్లతో కలిసి టోక్యోకి బయలుదేరినప్పుడు టెన్నిస్ క్రీడలో కొత్త రికార్డు సాధించబోతున్నాడని అందరూ ఆనందపడితే జోకోవిచ్ అనూహ్యంగా ఒలింపిక్స్ లో సెమీ ఫైనల్స్ కూడా చేరలేకపోయాడు.
అయితే ఇప్పుడు జరుగుతున్న యూఎస్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ లో తన ఫామ్ కొనసాగించి ఫైనల్ చేరుకుని టెన్నిస్ చరిత్రలో కేలండర్ గ్రాండ్ స్లామ్ సాధించిన మూడవ పురుష ఆటగాడిగా రికార్డు సాధించడానికి ఒక్క విజయం దూరంలో ఉన్నాడు.
గ్రాండ్ స్లామ్ అంటే ఏమిటి?
టెన్నిస్ క్రీడలో మేజర్ ఛాంపియన్ షిప్స్ గా పిలవబడే నాలుగు టోర్నమెంట్స్ ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ లను ఒకే సంవత్సరంలో గెలిస్తే దాన్ని గ్రాండ్ స్లామ్ అని పిలుస్తారు. అయితే వందేళ్ళ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన ఆటగాళ్లు కేవలం అయిదు మంది మాత్రమే ఉన్నారు. ఇందులో ముగ్గురు స్త్రీలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. పురుషులలో డాన్ బడ్జ్ 1938లో, రాడ్ లేవర్ 1962లో ఒకసారి, 1969లో మరోసారి ఈ ఘనత సాధిస్తే, మహిళలలో మౌరీన్ కానోలీ 1953లో,మార్గరెట్ కోర్ట్ 1970లో, స్టెఫీ గ్రాఫ్ 1988లో సాధించారు.
Also Read:పింఛన్ వద్దు,భూమి వద్దన్న ఈ మాజీ ఎమ్మెల్యే గురించి తెలుసా?
ఒకే సంవత్సరంలో ఈ నాలుగు టైటిల్స్ గెలవడం చాలా అరుదు కావడంతో నాలుగు టైటిల్స్ ఒకే సంవత్సరంలో గెలిస్తే దాన్ని కేలండర్ గ్రాండ్ స్లామ్ అనీ, కెరీర్లో ఎప్పుడో ఒకసారి నాలుగూ గెలిస్తే కెరీర్ గ్రాండ్ స్లామ్ అని పిలవడం మొదలుపెట్టారు క్రీడారచయితలు. అలా తీసుకుంటే కెరీర్ గ్రాండ్ స్లామ్ సాధించిన వారు 18 మంది ఉన్నారు. వీరిలో పదిమంది మహిళలు కాగా ఎనిమిది మంది పురుషులు. గ్రాండ్ స్లామ్ సాధించిన ఆటగాళ్లు ఒలింపిక్స్ స్వర్ణపతకం కూడా గెలిస్తే దాన్ని గోల్డెన్ స్లామ్ అని పిలుస్తారు.
1988లో స్టైఫీ గ్రాఫ్ నాలుగు మేజర్ ఛాంపియన్ షిప్స్ తో బాటు సియోల్ నగరంలో జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించడంతో కేలండర్ గోల్డెన్ స్లామ్ సాధించిన ఏకైక ప్లేయర్ గా రికార్డు సాధించింది. అమెరికా ఆటగాడు ఆండ్రీ అగస్సీ 1996లో అట్లాంటా నగరంలో జరిగిన ఒలింపిక్స్ లో స్వర్ణపతకం సాధించడంతో కెరీర్ గోల్డెన్ స్లామ్ సాధించిన ఆటగాడిగా రికార్డు స్థాపించాడు.
గ్రాండ్ స్లామ్ సాధించడం ఎందుకంత కష్టం
టెన్నిస్ టోర్నమెంట్ లలో 1968 వరకూ అమెచ్యూర్ ఆటగాళ్ళకే ప్రవేశం ఉండేది. ఆ సంవత్సరం నుంచి ప్రొఫెషనల్ ఆటగాళ్లకు ప్రవేశం కల్పించారు. దీన్ని టెన్నిస్ రంగంలో ఓపెన్ ఎరాగా వ్యవహరిస్తారు. ఓపెన్ ఎరా మొదలైన అర్ధ శతాబ్దంలో కేవలం రెండు కేలండర్ గ్రాండ్ స్లామ్స్ మాత్రమే నమోదు అయ్యాయి. ఓపెన్ ఎరాకి ముందు 1962లో నాలుగు మేజర్ ఛాంపియన్ షిప్స్ గెలిచిన ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రాడ్ లేవర్ 1969లో మరోసారి నాలుగు ట్రోఫీలు కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత చాలా కాలానికి 1988లో స్టైఫీ గ్రాఫ్ నాలుగు పోటీల్లో నెగ్గింది.
ఒక సంవత్సరంలో నాలుగు ఛాంపియన్ షిప్స్ గెలవడం కష్టతరం కావడానికి ప్రధాన కారణం అవి జరిగే కోర్టుల ఉపరితలం.1977 వరకూ రెండు రకాల కోర్ఠులే ఉండేవి. ఫ్రెంచ్ ఓపెన్ బంకమట్టి మీద జరిగితే, మిగిలిన మూడూ పచ్చిగడ్డి మీద జరిగేవి. 1978లో యూఎస్ ఓపెన్ పోటీలు హార్డ్ కోర్టు మీదకు మారితే, 1988లో ఆస్ట్రేలియా ఓపెన్ మరోరకం హార్డ్ కోర్టు మీదకు మారింది. ఆటతీరు కానీ, ఆటవేగం కానీ ఉపరితలం బట్టి మారుతాయి. వింబుల్డన్ గ్రాస్ కోర్టు మీద ఆట చాలా వేగంగా ఉంటుంది. సర్వ్ చేసిన ఆటగాడు బంతి తిరిగి వచ్చేలోపు నెట్ దగ్గరకు దూసుకెళ్ళి బంతిని అక్కడే అడ్డుకుని ప్రత్యర్థికి అందకుండా అతని కోర్టులోకి కొట్టే సర్వ్ అండ్ వాలీ శైలిలో ఉంటుంది. బంకమట్టి కోర్టుల మీద ఆడే ఫ్రెంచ్ ఓపెన్ లో బేస్ లైన్ గేమ్ ఆడుతారు. ఇద్దరు ఆటగాళ్లు కోర్టులో వెనకాల నించుని బంతిని అటూఇటూ కొడుతూ ఉంటారు. ఎవరు ముందు తప్పు చేస్తే అవతలి ఆటగాడికి పాయింట్ వస్తుంది. సుదీర్ఘమైన ర్యాలీలతో నడిచే ఈ తరహా ఆటలో ఓపిక చాలా ముఖ్యం.
అందుకే ఒక వేదిక మీద అనేకసార్లు విజేతగా నిలిచిన ఆటగాడు మరొక చోట అంత గొప్పగా ఆడలేకపోవచ్చు. అనేకవారాలు నంబర్ వన్ ర్యాంకు సాధించి, ఎనిమిది మేజర్ ట్రోఫీలు గెలిచిన ఇవాన్ లెండిల్ రెండు సార్లు వింబుల్డన్ ఫైనల్ చేరుకుని ఒక్క ట్రోఫీ కూడా గెలవలేక, “పచ్చిగడ్డి ఆవులు తినడానికి కానీ టెన్నిస్ ఆడడానికి కాదు “అని తన ఉక్రోషం వెళ్ళగక్కాడు. ఆల్ టైమ్ గ్రేట్స్ లో ఒకడిగా ఏడు వింబుల్డన్ టైటిల్స్ తో పాటు పద్నాలుగు గ్రాండ్ స్లామ్ ట్రోఫీలు గెలిచిన అమెరికా ఆటగాడు పీట్ సంప్రాస్ ఒకేసారి ఫ్రెంచ్ ఓపెన్ సెమీ ఫైనల్స్ మాత్రం చేరగలిగాడు.
Also Read:బుడ్డా వెంగళ రెడ్డి – పేరు గుర్తుందా?
ఒక సంవత్సరంలో మూడు గ్రాండ్ స్లామ్ ట్రోఫీలు గెలిచిన వారి లెక్క తీసినా ఇప్పటివరకూ అయిదు మంది మాత్రమే ఆ ఫీట్ సాధించగలిగారు. మార్టినా నవ్రతిలోవా 1984లో,స్టెఫీ గ్రాఫ్ 1983,1995,1996లో మూడుసార్లు, సెరీనా విలియమ్స్ 2002లో,రాఫేల్ నాడాల్ 2010లో,నోవాక్ జోకోవిచ్ ఈ సంవత్సరం ఈ రికార్డు సాధించారు.
ఈరోజు జరగబోయే ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు డానిల్ మెద్వెదేవ్ మీద విజయం సాధించగలిగితే ఒక సంవత్సరంలో నాలుగు మేజర్ ఛాంపియన్ షిప్స్ గెలిచిన మూడవ పురుష ఆటగాడిగా రికార్డు పుస్తకల్లోకి ఎక్కుతాడు.
మరొక రికార్డు కూడా జొకోవిచ్ ఖాతాలోకి
ఈ సంవత్సరం యూఎస్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకుంటే 21 మేజర్ ట్రోఫీలు నెగ్గిన ఏకైక ఆటగాడిగా జోకోవిచ్ రికార్డు స్థాపించగలుగుతాడు. ఈ సంవత్సరం వింబుల్డన్ ఛాంపియన్ షిప్ గెలిచాక ఇరవై గ్రాండ్ స్లామ్ ట్రోఫీలతో రోజర్ ఫెదరర్, రాఫేల్ నాడాల్ ల సరసన నిలిచిన జోకోవిచ్ యూఎస్ ఓపెన్ గెలవగలిగితే 21 టైటిల్స్ తో వారిని అధిగమించగలుగుతాడు.
ఇప్పటికే రెండు సార్లు మోకాలు ఆపరేషన్ చేయించుకుని కొత్త తరం ఆటగాళ్లతో పోటీ పడటంలో ఇబ్బంది పడుతున్న ఫెదరర్ మరో టైటిల్ గెలుచుకోవడం సందేహాస్పదంగా ఉంది. అయితే రానున్న సంవత్సరాల్లో అత్యధిక గ్రాండ్ స్లామ్ ట్రోఫీలు నెగ్గిన రికార్డు అందుకనే ప్రయత్నంలో నాడాల్, జొకోవిచ్ మధ్య పోటీ రసవత్తరంగా క్రీడాభిమానులను అలరించబోతోంది.