Covid ,new treatment – కరోనా కట్టడికి ఈ మూడు మాత్రలు చాలు

కాలం విసిరే గడ్డు సమస్యలకు ధీటైన కొత్త జవాబులు – కోవిడ్ చికిత్సలో కొత్త ప్రోటోకాల్ తో మెరుగైన ఫలితాలు

2019 డిసెంబర్ నుండి ప్రపంచాన్ని కుదిపేస్తున్న కోవిడ్ జబ్బుకి వివిధ అనేక చికిత్సలను వైద్యులు ప్రయత్నిస్తున్నారు. కొరోనావైరస్ ఇప్పటికే 25 కోట్ల మందికి సోకి 50 లక్షల మంది ప్రాణాలను తీసింది. అయితే కోవిడ్ జబ్బుకు కారణమైన కొరోనావైరస్ ఎక్కువమందిలో ఏమాత్రం ఇబ్బంది పెట్టని (ఎసింటమేటిక్) లేదా కొద్దిపాటి నలత (మైల్డ్)ను మాత్రమే కలుగజేస్తుంది. తీవ్రమైన జబ్బు, ప్రాణాంతకం కావడం అరుదు. అయినప్పటికీ వేలు, లక్షల మందిలో కొరోనావైరస్ సోకుతూ ఆరోగ్య రంగానికి మోయలేని భారం గా తయారైంది.

తేలికపాటి కోవిడ్ జబ్బుకు హోమ్ కేర్ కిట్ తో ఇంటివద్దనే వైద్యం, ఐసోలేషన్ అనేవి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. మొదట్లో హైడ్రాక్సీ క్లోరోక్విన్, డాక్సి సైక్లిన్, ఐవర్ మెక్టిన్ తో సహా అనేక మందులను ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఎక్కువగా వినియోగంలో ఉన్న హోమ్ కేర్ కిట్స్ లోని మందులు కోవిడ్ వ్యాధిలో పెద్దగా ప్రభావవంతం కాదని అనేక అధ్యయనాలు నిరూపించాయి.

కాగా కోవిడ్ జబ్బుతో శరీరంలో జరిగే విపరిణామాలను దృష్టిలో ఉంచుకుని వైద్యం అందించే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. కోవిడ్ జబ్బులో ప్రధానంగా ఊపిరితిత్తుల కణజాల వాపు (ఇన్ఫ్లమేషన్), రక్తం గడ్డకట్టే ప్రక్రియ ప్రారంభమై ఊపిరితిత్తులలో రక్త గడ్డ ( పల్మనరీ త్రాంబస్) ఏర్పడటం, దెబ్బతిన్న కణజాలం బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కు తొందరగా లొంగిపోవడం జరుగుతుంది. ఇప్పటివరకూ హోమ్ కేర్ కిట్స్ లోని మందులలో ఈ విపరిణామాలను అదుపు చేసేవి లేవు. తేలికపాటి కోవిడ్ జబ్బు బారిన పడిన వాళ్ళు ఎక్కువగా తమ శరీరంలోని అంతర్గత పోరాటంతోనే ఈ జబ్బు జయిస్తున్నారు.

కాకినాడకు చెందిన ప్రముఖ సాంక్రమిక వ్యాధుల నిపుణుడు డాక్టర్ యనమదల మురళీకృష్ణ హెచ్ఐవి ఎయిడ్స్ పై మంచి పరిశోధనలు చేశారు. ఇప్పుడు తేలికపాటి కోవిడ్ జబ్బుకు కొత్త చికిత్సను ప్రతిపాదించారు. 60 మంది తేలికపాటి కోవిడ్ వ్యాధిగ్రస్తులకు ఏస్పిరిన్ 150 మిల్లీగ్రాములు రోజుకు 1, ప్రెడ్నిసొలోన్ 10 మిల్లీగ్రాములు ఉదయం రాత్రి, అజిత్రోమైసిన్ 250 మిల్లీగ్రాములు ఉదయం రాత్రి వారం రోజుల పాటు ఇచ్చి ఏడు రోజుల తర్వాత, రెండు వారాల తర్వాత గమనించారు. వీరిలో 59 మందికి జ్వరం తగ్గి, గొంతు ఇబ్బంది తగ్గి, ఆక్సిజన్ సంతృప్త స్థాయి 93 శాతం పైన నిలబడింది. ఒక్క పేషెంట్ కి మాత్రం పరిస్థితి దిగజారడంతో హాస్పిటల్ లో చేరాడు. కాగా హైడ్రాక్సీ క్లోరోక్విన్, డాక్సి సైక్లిన్, పారాసిటమాల్ తీసుకున్నవారిలో 60 మందికి గాను 52 మంది పరిస్థితి మెరుగుపడింది. ఎనిమిది మంది పరిస్థితి దిగజారడంతో హాస్పిటల్లో చేరారు.

14 రోజుల తర్వాత ఏస్పిరిన్, ప్రెడ్నిసొలోన్, అజిత్రోమైసిన్ వాడిన 60 మందిలో, ఎనిమిది మందికి దగ్గు, నిస్సత్తువ, అలసట, ఆయాసం ఉన్నాయి. కంట్రోల్ గ్రూపులో 60 మందికి గాను 38 మందిలో దగ్గు, ఆయాసం, నిస్సత్తువ, అలసట ఉన్నాయి. ఏస్పిరిన్, ప్రెడ్నిసొలోన్, అజిత్రోమైసిన్ వారం రోజుల పాటు వాడితే తేలికపాటి కోవిడ్ జబ్బునుంచి పేషెంట్లు తొందరగా కోల్పోవడమే కాక, తదుపరి కాలంలో నిస్సత్తువ, ఆయాసం, దగ్గు, అలసట తక్కువ మందిలో ఉంటున్నాయి అని డాక్టర్ మురళీ కృష్ణ అధ్యయనంలో తేలింది.

ఈ అధ్యయన పత్రాన్ని 2021 నవంబర్ 17, 18 తేదీలలో జరిగిన అమెరికాకు చెందిన ప్రతిష్ఠాత్మక కోయాలిస్ (Coalesce) గ్రూప్ వారి ‘గ్లోబల్ సమ్మిట్ ఆన్ ఇన్ఫెక్షనస్ డిసీజెస్’ వర్చువల్ సదస్సులో డాక్టర్ మురళీ కృష్ణ సమర్పించారు. ప్రపంచవ్యాప్తంగా 29 పరిశోధన సారాంశాలను ఈ సదస్సుకు నివేదించారు. కోయాలిస్ గ్రూపు సదస్సులను ప్రామాణిక ‘స్కోపస్’ ఇండెక్సడ్ డేటాబేస్ లో ప్రచురిస్తారు.

కాగా డాక్టర్ యనమదల మురళీకృష్ణ ఫేస్బుక్, సామాజిక మాధ్యమాల ద్వారా తెలుగు ప్రజలను ఎప్పటికప్పుడు జాగృత పరుస్తున్నారు. వేలాదిమంది ఈయన ప్రతిపాదించిన చికిత్సను అనుసరించి ఆరోగ్యం సంతరించుకున్నారు. అదేవిధంగా ఇంట్లోనే ఆక్సిజన్ సాచురేషన్ పెంచుకోవడానికి సులువైన విధానాలను కూడా తెలియజెప్పారు. లక్షలాది మందికి కొరోనా నుండి భరోసానిచ్చారు.

ఎయిడ్స్ వ్యాధి చికిత్సలో తొలినుండి ప్రపంచ వ్యాప్తంగా 3 మందుల కాంబినేషన్ వాడుతున్నప్పటికీ, డాక్టర్ మురళీకృష్ణ రెండు మందుల కాంబినేషన్తో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని 2004 లోనే టులోన్, ఫ్రాన్స్ లో జరిగిన అంతర్జాతీయ హెచ్ఐవి, తలెత్తుతున్న సాంక్రమిక వ్యాధుల సదస్సు (ISHIED) కి నివేదించారు. వైద్య ప్రపంచం గత నాలుగేళ్లగా రెండు ఔషధాల ప్రామాణికత ఎక్కువ చర్చిస్తున్నది.

2000 సంవత్సరంలో సౌతాఫ్రికా, డర్బన్ లో జరిగిన 13 వ అంతర్జాతీయ ఎయిడ్స్ సదస్సుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తొలి, ఏకైక పరిశోధన పత్రం సమర్పించారు. హెచ్ఐవి – క్షయ జబ్బులో మాంటూ పరీక్ష స్పందనను సిడి4 లింఫోసైట్ పరీక్షకు బదులుగా జబ్బు తీవ్రతను అంచనా వేయడానికి వాడవచ్చునని ప్రతిపాదించారు. 7000 పరిశోధన పత్రాల్లో మెడ్ స్కేప్ ఎంపిక చేసిన 25 అత్యుత్తమ పరిశోధన పత్రాల్లో డాక్టర్ మురళీకృష్ణ పరిశోధన ఒకటిగా నిలిచింది.

Show comments