నాగోబా జాత‌ర.. అత్యంత‌ ప్రాచీనం.. విశిష్టం..!

త్రిబుల్ ఆర్ (RRR) సినిమా ట్రైల‌ర్ ను ల‌క్ష‌లాది మంది వీక్షించే ఉంటారు. వారంద‌రూ ” స్కాట్ దొర వారు మా ఆదిలాబాద్ వ‌చ్చిన‌ప్పుడు ఓ చిన్న‌పిల్ల‌ను తీసుకొచ్చారు. మీరు తీసుకొచ్చింది ఓ గోండ్ల పిల్ల‌నండి.. అయితే వాళ్ల‌కేమైనా రెండు కొమ్ములాంటాయా.. ఒక కాప‌రి ఉంటాడు.” అన్న మాట‌లు వినే ఉంటారు. ఆ జాత‌ర‌కు, త్రిబుల్ ఆర్ ట్రైల‌ర్ కు సంబంధం ఏంట‌ని ఆలోచిస్తున్నారా… అందులో చెప్పిన కాప‌రి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు కొమురం భీమ్ ( ఆ సినిమాలో హీరో పాత్రకు ప్రేర‌ణ‌) గురించే. ఆయ‌న గోండు ఆదివాసుల కుటుంబంలో జన్మించారు. ఆ గోండుల ఆరాధ్య దైవం. మేస్రం వంశీయుల కుల దైవ‌మే ఈ నాగోబా.

ఏటా పుష్య‌మాసం.. అమావాస్య‌రోజున‌..

గోండుల దేవ‌త నాగోబాకు చాలా ప్రాచీన చ‌రిత్ర ఉంది. అంత‌కు మించిన విశిష్ట‌త ఉంది. ఈ నాగోబా దేవాలయం ఆదిలాబాద్‌కు న‌ల‌భై కిలోమీటర్ల దూరంలోని ఇంద్రవెల్లి మండలం ముత్నూర్‌ దగ్గర కెస్లాపూర్‌ గ్రామంలో ఉంది. ఏటా పుష్యమాసం అమావాస్య రోజున ఇక్క‌డ నాగోబా జాతర ప్రారంభ మవుతుంది. నాగోబాను పూజిస్తే పంటలు బాగా పండుతాయని, శాంతి విరాజిల్లుతుందని, రోగాలు మటు మాయం అవుతాయని గిరిజనుల నమ్మకం. సర్పజాతిని పూజించ‌డ‌మే ఈ పండగ ప్రత్యేకత. కెస్లాపూర్‌లో జరిగే ఈ జాతరను రాష్ట్ర పండుగగా ప్ర‌భుత్వం ప్రకటించింది. ఆ గ్రామ జ‌నాభా కేవ‌లం నాలుగు వంద‌ల లోపే అయితే.. జాత‌ర స‌మ‌యంలో ఆ అర‌ణ్యం జనారణ్యంగా మారుతుంది.

గోదావ‌రి జ‌లం కోసం కాలి న‌డ‌క‌న 80 కిలోమీట‌ర్లు

జాత‌ర ఆరంభం నుంచే ఆదివాసీలు చాలా నియ‌మ నిబంధ‌న‌లు పాటిస్తారు. పుష్యమాసంలో వచ్చే పౌర్ణమినాడు మేస్రం వంశీయులు 20 మంది గిరిజనులు వెంటరాగా కొత్త కుండలతో కడెం మండలంలోని గొడిసిర్యాల పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న గోదావరి జలాన్ని తీసుకువచ్చేందుకు బయలుదేరుతారు. దీంతో జాతర ప్రారంభమైనట్టే. ఆ జలాన్ని తీసుకురావడానికి కెస్లాపూర్‌ నుంచి గోదావరి దాకా కాలినడకన 80 కిలోమీటర్లు వెళ్తారు (ఈ ఏడాది జాత‌ర సంద‌ర్భంగా గోదావ‌రి జ‌లాల కోసం కాలినడకన బయలుదేరిన మెస్రం వంశీయుల వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది) కెస్లాపూర్‌ చేరుకొని జాతర ప్రాంగణంలోని గిరిజనులు చెప్పుకునే ప్రాశస్త్యం గల మర్రి చెట్టు కింద విడిదిచేసి అమావాస్యరోజు రాత్రి నాగోబాకు కొత్త కుండల్లో గోదావరి నుంచి తెచ్చిన నీళ్లతో అభిషేకం చేస్తారు. అనంత‌రం గిరిజన ఆచారాల మేరకు పూజలు నిర్వహిస్తారు. పవిత్ర గంగాజలంతో నాగోబా దేవ‌త‌కు అభిషేకం చేయ‌డంతో జాత‌ర మొద‌ల‌వుతుంది. అనంత‌రం మూడురోజులపాటు కోలాహలంగా జాతర కొనసాగుతుంది. వేడుకల అనంతరం ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. దీనికి స్థానిక ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు జిల్లా అధికారులందరూ హాజరవుతారు. ఈ దర్బార్‌లో గిరిజనులు తమ సమస్యలను అధికారుల దష్టికి తీసుకెళ్లి అక్కడికక్కడే పరిష్కరించుకునే వీలుంది.

ఇదీ పురాణ గాథ‌..

అమావాస్యరోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబా (శేషనారాయణమూర్తి) పురివిప్పి నాట్యమాడుతాడని గిరిజనుల నమ్మకం. అమావాస్య నాడు సరిగ్గా సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్య కాలంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడనీ, వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనులు విశ్వసిస్తారు. నాగోబా చరిత్రను గోండు గిరిజనులు రకరకాలుగా చెప్పుకుంటారు. పూర్వం మేస్రం కుటుంబానికి చెందిన నాగాయిమోతి రాణికి నాగేంద్రుడు కలలో కనిపించి సర్పం రూపంలో ఆమె గర్భాన జన్మిస్తానని చెప్పాడని, ఆ కల నిజమైందని గోండుల నమ్మకం. సర్పరూపంలోని నాగేంద్రునికి తల్లి అంటే రాణి తన తమ్ముడి కూతురు గౌరీతో వివాహం జరిపించింది. అత్త ఆజ్ఞ మేరకు గౌరీ భర్తను బుట్టలో పెట్టుకొని గోదావరికి ప్రయాణం కాగా, ఒకచోట పాము ఉడుం రూపంలో కనిపించగా ఆ ఊరు ఉడుంపూరైంది. ఆ తరువాత గౌరి ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లగా ఆమెను చూసి నాగేంద్రుడు మనిషి రూపంలోకి మారాడని, అయితే పేరు ప్రతిష్ఠలు కావాలో, సంప్రదాయం కావాలో తేల్చుకోమనగా గౌరి సంప్రదాయాలను లెక్కచేయక పోవడంతో తిరిగి పాముగా మారాడని కథ.

ఆ తరువాత ఉడుంపూర్‌ నుంచి గరిమెల వరకు అతనికోసం వెతికిన గౌరి గోదావరిలోనే సత్యవసి గుండంలో కలిసిపోయిందని, నాగేంద్రుడు ఆమె వెంట ఉంచిన ఎద్దు రాయిగా మారిందని భక్తుల విశ్వాసం. ఆ తరువాత పెళ్ళి అయిన ప్రతి జంటకు నాగేంద్రుడి సన్నిధిలో పరిచయం చేయాలని (పేథికొరి యాక్‌) చెప్పి నాగేంద్రుడు కెస్లాపూర్‌ గుట్టల్లోకి వెళ్లిపోయాడని చెప్తుంటారు. అదే కెస్లాపూర్‌ గ్రామంగా మారి పోయింది. నాగేంద్రుడు వెళ్లిన గుట్ట వద్ద నాగోబా దేవాలయాన్ని నిర్మించారు.

మేస్రం వంశీయులే కీల‌కం..

నాగోబా దేవతకు పూజలు మేస్రం వంశీయులే నిర్వహిస్తారు. మేస్రం వంశం కింద 22 తెగలు వస్తాయి. ఏడుగురు దేవతలను కొలిచే వారంతా మేస్రం వంశీయుల కిందికి వస్తారు. ఏడు ఇళ్ల పేర్లు గల గిరిజనులకు ఆరాధ్య దైవం ఆదిశేషుడు కావడం వల్ల అనాధిగా కేస్లాపూర్ గ్రామంలో వెలిసిన వారి కులదైవం నాగోబా పూజ ఇత్యాది కార్యక్రమాల నిర్వహణ బాధ్యత మోస్త్రానికి అప్పగించారు. కాగా పెద్దవాడన్న గౌరవంతో పుష్యమాస అమావాస్య రోజు జరిగే పూజను మడావికి అప్పగించారు. అయితే కాలానుగుణంగా పూజా కార్యక్రమాలు నిర్వహించే మోస్త్రం వంశం రెండుగా చీలిపోయింది. వాటిలో ఒకటి నాగ్‌భిడే మోస్త్రం, రెండవది భూయ్యాడే మోస్త్రం. ఈ రెండు శాఖల వారి వృత్తుల ఆధారంగా 17శాఖలుగా చీలిపోయినారు. అయినా పూజలు నిర్వహించేది మాత్రం అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం మేస్రం వంశస్థులకే దక్కింది.

వేలాది మందికి 22 పొయ్యిలే..

ఈ జాత‌రలో మ‌రో విశేషం ఉంది. జాతరకు వచ్చే మేస్రం వంశీయులు వేలాది మంది ఉన్న‌ప్ప‌టికీ.. వారు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల మీదే. ఈ పొయ్యిలు ఎక్కడపడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహరీ గోడ లోపల, గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు (దుగుడు) ఉన్నాయి. ఆ దీపాల కాంతుల వెలుగులో 22 పొయ్యిల్లో మేస్రం వంశీయుల వంతుల వారిగా వంటలు చేసుకుంటారు. మిగితా జాతుల వారు ఎక్కడైనా వంట చేసుకోవచ్చు. ఇచ్చోడ మండలం సిరికొండలోని గుగ్గిల్ల వంశీయులు మాత్రమే నాగోబా కోసం కుండలు తయారుచేయడం ఆచారంగా వస్తోంది. వంటల కోసం రెండు పెద్ద కుండలు, (కాగులు), వాటిపై కప్పిపెట్టేందుకు పాత్ర (చిప్పలు), దీపాంతలు, నీటికుండలు కలిపి సుమారు 130కి పైగా కుండల తయారీకి ఆర్డర్ ఇస్తారు. మేస్రం వంశీయులు ఈ కుండల్లోనే గంగా జలాన్ని తీసుకురావడమే కాకుండా, వంట చేసి జాతరలో భక్తులకు భోజనం పెడతారు.

అప్ప‌టి వ‌ర‌కూ నాగోబాను చూడ‌ర‌ట‌..

మేస్రం వంశస్థుల్లో వివాహమైన నూతన వధువులను నాగోబా దేవుడి వ‌ద్ద‌కు త‌ప్ప‌కుండా తీసుకువెళ్తారు. ఆమె చేత ఆ దేవునికి పూజ చేయించి వధువును పరిచయం చేస్తారు. దీన్నే ‘భేటింగ్ కీయ్‌వాల్’ అంటారు. ఎప్పటి వరకైతే మేస్రం తెగ వధువు ఈ పరిచయ వేదికలో పాల్గొన్నదో అప్పటి దాకా వారు నాగోబా దేవుణ్ని చూడడం, పూజించడం నిషిద్ధంగా కొన‌సాగుతోంది. వధువులు ఇంటి నుంచి ఎడ్లబండి వెనుక వెదురు బుట్టలో పూజసామాగ్రిని పట్టుకొని, కాలినడకన బయలుదేరతారు. కేస్లాపూర్‌లోని నాగోబా గుడిని చేరుకుంటారు. పరిచయం చేయాల్సిన వధువులను ‘భేటి కొరియాడ్’ అని పిలుస్తారు. వధువులు ఇద్దరు చొప్పున జతలుగా ఏర్పడి ముఖం నిండా తెల్లటి దుస్తులతో ముసుగు ధరిస్తారు. పూజా కార్యక్రమానికి ముందు నాగోబా దేవుని దగ్గరకు వారిని తీసుకెళ్లి పరిచయం చేస్తారు. అక్కడి నుంచి శ్యాంపూర్‌లోని (బోడుందేవ్) జాతర అయ్యాక ఎవరి గృహాలకు వాళ్లు వెళ్లిపోతారు.

దర్బార్..

జాతర సందర్భంగా ఏర్పాటయ్యే దర్బార్‌కు ఒక ప్రత్యేకత, చరిత్ర ఉన్నాయి. 63 ఏళ్ల క్రితం మారుమూల గ్రామాలకు ఎలాంటి సౌకర్యాలు లేవు. నాగరికులంటేనే ఆదివాసులు పరుగెత్తేవారు. గిరిజనుల వద్దకు అధికారులెవరు వెళ్లేవారు కాదు. అప్పుడే భూమి కోసం, విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి కొమురం భీం మరణించాడు. ఈ సంఘటనతో ఉలిక్కిపడ్డ నిజాం ప్రభువులు గిరిజన ప్రాంతాల పరిస్థితులు, గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హైమండాఫ్ను ఆదిలాబాద్ జిల్లాకు పంపార‌ట‌. ఆయన కొండలు, కోనలు దాటి వచ్చే గిరిజనుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు జాతరలో దర్బార్‌ ఏర్పాటు చేయాలని భావించి 1942లో మొదటిసారి నిర్వ‌హించారు. ఇప్ప‌టికీ ఆ ద‌ర్బార్ కొన‌సాగుతోంది. జాతర చివరి రోజున జరిగే ఈ దర్బార్‌కు గిరిజన పెద్దలు, తెగల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే నాగోబా జాత‌ర‌కు పెద్ద చ‌రిత్రే ఉంది.

Also Read : విశిష్టం.. శ్రీ రామానుజ స‌హ‌స్రాబ్ది స‌మారోహం..

Show comments