Idream media
Idream media
2014 ఎన్నికల సమయంలో కాపులను బీసీల్లో చేరుస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని అమలు చేయాలని.. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన ఉద్యమం సమయంలో నమోదైన కేసులను తాజాగా వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసినందుకు కాపు ఉద్యమ మాజీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన భావోద్వేగ లేఖ రాశారు.
కేబినెట్ నిర్ణయంతో కాపు ఉద్యమ సమయంలో నమోదైన అన్ని కేసులను ఎత్తివేసినట్లు మంత్రి కురసాల కన్నబాబు మెసేజ్ ద్వారా తెలియజేసినట్లు ముద్రగడ పద్మనాభం తెలిపారు. చెయ్యని నేరానికి, మమ్ములను ముద్దాయిలను చేస్తూ పెట్టిన కేసులు చాలా అన్యాయమని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ మా జాతి నన్ను ఉద్యమం నుంచి తప్పించినా, భగవంతుడు మీ ద్వారా ఆ కేసుల నుంచి మోక్షం కలిగించినందుకు చాలా సంతోషం, ధన్యవాదాలు..’’ అంటూ ముద్రగడ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
Also Read : కాపు ఉద్యమం.. జగన్, చంద్రబాబు ఎవరు ఎలా వ్యవహరించారు..?
‘‘అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీ–ఎఫ్ ఫైలును కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపినప్పుడూ, ఈ రోజు మీరు ఎత్తివేసిన కేసుల గురించి నేను స్వయంగా వచ్చి అప్పుడు, ఇప్పుడు ధన్యవాదాలు చెప్పుకోవాలి. నేను అందరిలాగా అపరకోటీశ్వరుడిని కాను. సమాజ పోకడ మాత్రం మీ ఇరువురిని నేను కలిస్తే జాతిని అమ్మకం పెట్టి కోట్లాది రూపాయలు, పదవులు తెచ్చుకోవడానికి వెళ్లాడు అనిపించుకోవడం ఇష్టం లేక రాలేపోయాను. ఈ రెండు విషయాలలో ఆనందం పొందలేని జీవితం నాది.
నాకు జరిగిన అవమానాలు, బాధలు, కష్టాలు, బూతుపురాణాలను ఎవరైనా దృష్టిలో పెట్టుకుంటే భవిష్యత్‌లో ఉద్యమాలు చేయడానికి రోడ్డు మీదకు రారు. రాకూడదు. చాలా మంది పెద్దవారు రకరకాల సమస్యల వంకతో మీ ఇరువురి వద్దకు వచ్చినా తప్పు పట్టరు. నేను మాత్రమే ఎవరిని కలవకూడదండి. ఇది నేను ఎప్పుడో చేసుకున్న పాపం అనుకుంటున్నాను. కేసులు ఉపసంహరించినందుకు నమస్కారాలు..’’ అంటూ ముద్రగడ ఆ లేఖలో సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
Also Read : కాపు ఉద్యమ కేసులు ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం