Idream media
Idream media
శ్రీ రామానుజుల వారి అతి భారీ విగ్రహం.. కూర్చున్న భంగిమలో 216 అడుగుల ఎత్తులో సమతామూర్తి. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి నిదర్శనంగా దర్శనమిస్తున్న ఆ మహా విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు జాతికి అంకితం చేయనున్నారు. సహస్రాబ్ధి సమారోహ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు ముచ్చింతల్ రానున్నారు. సమతా మూర్తి మహా విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం, దాదాపు మూడు గంటలపాటు దివ్యక్షేత్రంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. యాగశాలకు వెళ్లి రుత్వికుల ఆశీస్సులు తీసుకుంటారు. చివరిగా, వాటర్ ఫౌంటెయిన్, మ్యూజిక్, త్రీ డీ షోలతోపాటు రాత్రివేళ పంచవర్ణాల్లో మెరిసే సమతామూర్తి వెలుగులను తిలకిస్తారు.
మోడీ పర్యటన సందర్భంగా ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని ఎస్పీజీ తమ ఆధీనంలోకి తీసుకుంది. దివ్యక్షేత్రంతో పాటు యాగశాలల చుట్టుపక్కల ప్రాంతాల్లో వేలాదిమంది పోలీసులు మోహరించారు. భద్రతా ఏర్పాట్ల పరిశీలనకు ఇక్కడ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక, ప్రధాని పర్యటన ఏర్పాట్లు చూసేందుకు సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, అడిషనల్ డీజీ జితేందర్, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ అనిల్‌కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు శుక్రవారం ముచ్చింతల్‌కు వచ్చారు. ఏర్పాట్లను సమీక్షించారు. కమాండ్ కంట్రోల్ రూంను,ముచ్చింతల్‌కు వచ్చే మార్గాల్లోని సీసీ టీవీలను పరిశీలించారు.
ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన ముచ్చింతల్ దివ్యక్షేత్రం తెలంగాణ ఆధ్యాత్మిక సిగలో మరో మణిహారం కానుంది. ప్రపంచఖ్యాతితో అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారనుంది. రూ.1000 కోట్ల వ్యయంతో 2016లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు దేశ నలుమూలలకు చెందిన సుమారు 2,700 మంది శిల్పులు అహోరాత్రులు శ్రమించారు. 18,000 టన్నుల మహా విగ్రహం నిర్మాణంలో విదేశీయులు కూడా పాల్పంచుకున్నారు. సమతామూర్తి విగ్రహం 200 ఏళ్ల వరకు చెక్కుచెదరకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమతా మూర్తి విగ్రహంతోపాటు రామానుజ జీవిత విశేషాలు తెలియచేసే అత్యాధునిక మ్యూజియం, మహా విగ్రహం చుట్టూ 108 ఆలయాలు, ఫల, పుష్పజాతులతో అందమైన ఉద్యానవనాలు, సుమారు 4,600 మంది ఏకకాలంలో చూసేందుకు వీలుగా త్రీడీ షో, విగ్రహం ముందు మ్యూజికల్, లైటింగ్ వాటర్ ఫౌంటెయిన్ తదితరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
Also Read : మోడీకి ఆహ్వానం పలికేందుకు కేసీఆర్ బదులు తలసాని.. కారణం ఇదేనా..!