భారీ విజయాన్ని అందుకున్న మమతా బెనర్టీ

భవానీ పూర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజయబావుటా ఎగురవేశారు. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ప్రియాంకా టేబ్రివాల్‌పై 58,832 ఓట్ల మెజారిటీతో దీదీ విజయం సాధించారు. మూడు రోజుల కిందట జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపును ఈ రోజు ఉదయం చేపట్టారు. మొదటి రౌండ్‌ నుంచి మమతా తన ఆధిక్యాన్ని ప్రదర్శించి భారీ విజయం నమోదు చేశారు.

ఐడు నెలల కిందట జరిగిన పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని మూడో సారి అధికారంలోకి తీసుకువచ్చిన మమతా బెనర్జీ.. బీజేపీ విసిరిన సవాల్‌ను స్వీకరించి నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన మమతా.. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఆరు నెలలలోపు చట్టసభలకు ఎన్నిక కావాల్సి ఉన్న నేపథ్యంలో.. మమతా పాత స్థానం భవానీ పూర్‌ నుంచి గెలిచిన శోభన్‌దేవ్‌ ఛటోపాధ్యాయ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి దీదీకి లైన్‌ క్లియర్‌ చేశారు. అయితే కరోనా నేపథ్యంలో సకాలంలో ఎన్నికలు జరుగుతాయా..? లేదా..? అన్న సందేహాలు ఏర్పడ్డాయి. వైరస్‌ వ్యాప్తి తగ్గడంతో జరిగిన ఉప ఎన్నికల్లో మమతా పోటీ చేసి గెలవడంతో టీఎంసీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి.

Also Read : మేఘాలయకు పాకిన కాంగ్రెస్ సంక్షోభం -మాజీ సీఎం సహా 12 మంది టీఎంసీలోకి?

ఇది రెండోసారి..

ముఖ్యమంత్రిగా బాధ్యలు చేపట్టిన తర్వాత మమతా బెనర్జీ.. ఉప ఎన్నికల్లో గెలిచి శాసన సభకు ఎన్నికవడం ఇది రెండోసారి. తొలిసారి 2011లో మమతా బెనర్జీ.. భవానీపూర్‌ శాసన సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 2011లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో 37 ఏళ్ల కమ్యూనిస్టుల పాలనకు తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీ తెర దించిన సమయంలో మమతా బెనర్జీ లోక్‌సభ సభ్యురాలుగా ఉన్నారు. నాటి యూపీఏ ప్రభుత్వంలో రైల్వే శాఖ మంత్రిగా పని చేస్తున్నారు.

పశ్చిమ బెంగాల్‌లో పార్టీని తొలిసారి విజయతీరాలకు చేర్చిన మమతా.. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆరు నెలలలోపు శాసన సభకు ఎన్నిక కావాల్సి ఉండడంతో.. భవానీపూర్‌ నుంచి గెలిచిన తృణముల్‌ నేత సుభ్రత భక్షి మమత కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసిన మమత సీపీఎం అభ్యర్థి నందినీ ముఖర్జీపై 54,213 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

2016లోనూ రెండోసారి దీదీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ సారి కూడా మమత బెనర్జీ భవానీ పూర్‌ నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి దీపపై 25,301 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ముచ్చటగా మూడోసారి పార్టీని విజయతీరాలకు చేర్చి.. ముఖ్యమంత్రి అయిన మమతా.. తాను మాత్రం ఓడిపోవడంతో.. మరోసారి భవానీపూర్‌ నుంచి ఉప ఎన్నికల బరిలో నిలుచున్నారు. 2011 ఉప ఎన్నికల్లో 54,213 మోజారిటీతో గెలవగా.. ఈ సారి 58,832 ఓట్ల మెజారీటీతో విజయం సాధించడం విశేషం.

Also Read : ఉప ఎన్నికల్లో కమలాన్ని సోదిలో కూడా లేకుండా చేసిన సిఎంలు…!

Show comments