మహంత్‌ నరేంద్రగిరి ఆత్మహత్య.. అసలేం జరిగింది.. కారణాలు ఏంటంటే..?

అఖిల భారత అఖాడా పరిషత్‌ అధ్యక్షుడు మహంత్‌ నరేంద్రగిరి మృతి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సాధువుల సంస్థల్లో ప్రముఖంగా పేరున్న అఖాడాలో కీలక స్థానంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడంపై చర్చనీయాంశంగా మారింది. దీంతో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు పద్దెనిమిది మందిపై సిట్‌ను ఏర్పాటు చేశారు. కేసు విచారణలో నిర్ఘాంతపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

అందుకే తనువు చాలిస్తున్నా…

మహంత్‌ నరేంద్ర గిరి సాధు సమాజంలో మంచి పేరుంది. ఎంతో గౌరవంగా బతికారన్న కీర్తి ఉంది. అయితే.. అతిథి గృహంలో పోలీసులకు దొరికిన ఎనిమిది పేజీల సూసైడ్‌ నోట్‌లో ఆయన విస్తుపోయే విషయాలను పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆయన శిష్యుడు ఆనంద్‌ గిరి బ్లాక్‌ మెయిలింగ్‌తోనే మనస్తాపం చెందిన ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు వెల్లడిస్తున్నారు. ‘ఆనంద్‌ గిరి కారణంగా తీవ్ర మనోవేదనకు గురయ్యా. సెప్టెంబర్‌ 13వ తేదీనే తనువు చాలించాలి అనుకున్నా. కానీ ధైర్యం సరిపోలేదు. కంప్యూటర్‌ సాయంతో.. ఓ మహిళతో నేను కలిసి ఉన్నట్లుగా చూపే ఓ ఫొటో రూపొందించి ఆనంద్‌ గిరి నన్ను బ్లాక్‌ మెయిల్‌ చేయాలని భావిస్తున్నట్లు నాకు తెలిసింది. ఇది నన్ను కలవరపెడుతోంది. ఇప్పటి వరకు ఎంతో గౌరవంగా జీవించాను. ఇలాంటి అపఖ్యాతితో జీవించలేను. అందుకే తనువు చాలిస్తున్నా’ అని నరేంద్ర గిరి మృతదేహం వద్ద లభించిన సూసైడ్‌ నోట్‌లో ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు.

తెరపైకి కొత్త అనుమానాలు

నరేంద్ర గిరి మృతిపై పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు. ఆనంద్‌ గిరితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఆధ్య తివారి, అతడి కుమారుడు సందీప్‌ తివారి కూడా తన ఆత్మహత్యకు కారణమని ఆయన సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయినప్పటికీ విషయం పొలిటికల్‌ టర్న్‌ కూడా తీసుకుంది. మరోవైపు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సాధువులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రాథమికంగా నరేంద్రగిరిది ఆత్మహత్యే అని చెబుతున్నా.. అతడి శిష్యులు మాత్రం ముమ్మాటికి హత్యేనని ఆరోపిస్తున్నారు. దీంతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి.

విషయం పొలిటికల్‌ టర్న్‌

సూసైడ్‌ చేసుకునే ముందు ఎవరైనా అంత సుదీర్ఘలేఖ రాస్తారా అంటూ కొత్త పాయింట్లు లేవనెత్తారు ఆనందగిరి లాయర్‌. కాగా, మృతిపై కాంగ్రెస్‌ తీవ్ర ఆరోపణలు చేసింది.. బీజేపీని ప్రశ్నించిన సాధువులకు ఇలాగే జరుగుతోందని విమర్శించింది. యూపీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్‌ చేసింది.. అటు జ్యుడిషియల్‌ ఎంక్వైరీ చేయాలని అఖిలేష్‌ యాదవ్‌ కోరారు. ఇక మొత్తం కేసులో ఫోరెన్సిక్‌ రిపోర్టు చాలా కీలకం కానుంది. ఆ సమయంలో మఠంలో ఇంకా ఎవరైనా ఉన్నారా? నరేంద్రగిరి ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక చంపేశారా? అన్న డౌట్లపై ఫోరెన్సిక్‌ రిపోర్టు తర్వాతే క్లారిటీ రానుంది.

Show comments