సచివాలయ ఉద్యోగిని జైల్లో పెట్టించిన వైసీపీ ఎమ్మెల్యే

ప్రజా ప్రతినిధులు గ్రామాలకు/సచివాలయాలకు వెళితే ప్రజలకు ఎలాంటి ప్రయోజనం జరుగుతుందో తెలియజేసే ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గం కోళ్లబైలు పంచాయతీలో జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైసీపీ ఎమ్మెల్యే నవాజ్‌బాష కోళ్లబైలు గ్రామ సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని విభాగాల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

ప్రజలు నుంచి వినతులు స్వీకరించడం అక్కడికక్కడే వాటిని పరిష్కరించే ప్రయత్నం ఎమ్మెల్యే చేస్తున్నారు. ఇంతలో చేనేత కార్మికులు కొందరు ఎమ్మెల్యే వద్దకు వచ్చారు. వైఎస్సార్‌ నేతన్న హస్తం పథకం కోసం వెళితే.. తమ పేర్లు అర్హుల జాబితాలో చేర్చేందుకు వేల్ఫేర్‌ అసిస్టెంట్‌ 12 వేల రూపాయల లంచం అడుగుతున్నారని ఫిర్యాదు చేశారు. ఇలాంటి పరిస్థితి ఉందని ఎమ్మెల్యే కూడా ఊహించలేదు. ఫిర్యాదుపై విచారించిన ఎమ్మెల్యే వేల్ఫేర్‌ అసిస్టెంట్‌ రాజేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేష్‌పై పోలీసు కేసు నమోదు చేయాలని, వెంటనే అతన్ని స్టేషన్‌కు తరలించాలని అక్కడే ఉన్న ఎంపీడీవోకు ఆదేశాలు జారీ చేశారు. నీటి కులాయి కనెక్షన్‌కుS2,950 రూపాయల రసీదు ఇచ్చి 5,500 రూపాయలు వసూలు చేస్తున్నారనే మరో ఫిర్యాదు కూడా ఎమ్మెల్యేకు అందింది.

ఎమ్మెల్యే సచివాలయానికి రావడం వల్ల మాత్రమే సిబ్బంది లీలలు వెలుగులోకి వచ్చాయి. సమస్యలు పరిష్కారం అయ్యాయి. అప్పటి వరకు తమ ఇబ్బందులు, బాధలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎమ్మెల్యేను కలిసేందుకు ఆయన నివాసం వద్దకు వెళ్లే అవకాశం లేని గ్రామస్తులకు ఎమ్మెల్యే పర్యటన కలసి వచ్చింది. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందుతున్నాయా..? లేదా..? మధ్యలో ఏమైనా అటంకాలు వస్తున్నాయా..? అనే అంశాలను పరిశీలించి, సమస్యలపై వినతులు స్వీకరించి పరిష్కరించే ఉద్దేశంతోనే ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయాలకు వారంలో మూడు రోజులు వెళ్లాలనే నిర్ణయాన్ని జగన్‌ సర్కార్‌ తీసుకుంది.

ప్రతి ఎమ్మెల్యే వారంలో మూడు రోజులు, నెలకు 12 రోజులు వేర్వేరు సచివాలయాలకు వెళ్లాలని ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేశారు. ఈ నిర్ణయం వల్ల ప్రతి ఎమ్మెల్యే నెలకు 12 సచివాలయాలు, ఏడాదికి 144 సచివాలయాలను సందర్శిస్తారు. ఫలితంగా ఏడాదికి ఒకసారి ప్రతి గ్రామ, వార్డు సచివాలయానికి ఎమ్మెల్యే వెళతారు. ఫలితంగా మదనపల్లె నియోజకవర్గంలోని కోళ్లబైలులో మాదిరిగా అన్ని ప్రాంతాలలోనూ వివిధ రకాల సమస్యలు, ప్రజల బాధలు వెలుగులోకి వస్తాయి. మన సమస్య ఎదుటివారికి చిన్నదిగా కనిపిస్తుందంటారు. అలాంటి సమస్యను సావధానంగా విని, పరిగణలోకి తీసుకుని పరిష్కరిస్తే.. ఎమ్మెల్యేలకు వచ్చే పేరు వెలకట్టలేనది. ప్రజల హృదయాల్లో ఆయా ఎమ్మెల్యేలు పదిలంగా ఉంటారు.

Also Read : రుషికొండలో ఫైవ్‌స్టార్‌ హోటల్‌ నిర్మాణాన్ని టీడీపీ ఎందుకు అడ్డుకుంటోంది..?

Show comments