జ‌గ‌న్ మౌనం.. విప‌క్షాలకు అంతుప‌ట్ట‌ని వైనం

నోరు పారేసుకోవ‌డం రాజ‌కీయాల్లో ఇప్పుడు సాధార‌ణ‌మైపోయింది. చాలెంజ్ లు విస‌ర‌డం ఫ్యాష‌న్ గా మారింది. ముఖ్య‌మంత్రి నుంచి మండ‌ల నాయ‌కుడి వ‌ర‌కు ప్ర‌తీ ఒక్క‌రూ ఏదో సంద‌ర్భంలో ఎదుటి పార్టీ నేత‌ల‌ను దూషించ‌డం, గ‌ట్టిగా మాట్లాడ‌డం చాలా రాష్ట్రాల‌లో వింటూనే ఉన్నాం. చూస్తూనే ఉన్నాం. కానీ ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాత్రం భిన్నంగా ముందుకు వెళ్తున్నారు. విమ‌ర్శ‌లు, దూష‌ణ‌ల‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వ‌కుండా, హంగు, ఆర్భాటాలు చేయ‌కుండా ముఖ్య‌మంత్రిగా ప్ర‌జ‌ల కోసం తాను చేయాల్సిన ప‌నిని చేసుకుంటూ పోతున్నారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎపిసోడ్ నే తీసుకుంటే.. ఆయ‌న ప్ర‌భుత్వంపైన‌, వైసీపీపైనే కాకుండా జ‌గ‌న్ ను కూడా విమ‌ర్శించారు. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల అనంత‌రం ఏపీలో జ‌రుగుతున్న రాజ‌కీయ ర‌చ్చ అంద‌రికీ తెలిసిందే. కానీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాత్రం భిన్న‌త్వం ప‌ని చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత హంగామా లేదు. తాను చేయదలచుకున్న పని చేసుకుపోతున్నారు. ప్రచార ఆర్భాటాలు లేవు. కానీ, రాజకీయంగా మాత్రం తన లక్ష్యం ఏంటో స్పష్టంగా నిర్దేశించికున్న సీఎం జగన్ ఆ దిశగా అడుగులు మాత్రం జాగ్రత్తగా వేస్తున్నారు.

Also Read : వైఎస్సార్‌ సెట్‌ చేసిన ట్రెండ్‌ కొనసాగుతూనే ఉంది..!

ఇర‌వై ఎనిమిది నెల‌ల కాలంలోనే ఎన్నో అవార్డులు, ప్ర‌శంస‌లు జ‌గ‌న్ సొంతం చేసుకున్నారు. అందుకు కార‌ణం ఆయ‌న సంక్షేమ పాల‌న‌. తీసుకున్న సాహ‌సోపేత నిర్ణ‌యాలు. పాల‌న‌లోనూ సంస్క‌ర‌ణ‌ల‌ను తీసుకొచ్చారు. నగరపాలక సంస్థలకు ఇద్దరు డిప్యూటీ మేయర్లను, మున్సిపాలిటీల్లో ఇద్దరు వైస్ చైర్మన్ల నియామ‌కాన్ని తెర‌పైకి తెచ్చారు. కులాల వారీగా కార్పొరేష‌న్ల‌కు శ్రీ‌కారం చుట్టారు. పాల‌న‌లోనే కాదు.. ఎన్నిక‌ల తీరులోనూ మార్పు తెచ్చారు. తిరుప‌తి ఉప బ‌రిలో ఓట‌ర్ల‌కు ఒక్క రూపాయి కూడా పంచ‌కూడ‌ద‌ని ఎమ్మెల్యేల‌కు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు చెప్పి సంచ‌ల‌నం సృష్టించారు. ఇలా సంక్షేమం, పాల‌న‌లో సంస్క‌ర‌ణ‌ల‌పైనే ఎక్కువ‌గా దృష్టి పెడుతున్న జ‌గ‌న్ విప‌క్షాల విమ‌ర్శ‌ల‌పై అడ‌పాద‌డ‌పా త‌ప్పా అతిగా స్పందించ‌డం అరుద‌నే చెప్పాలి.

కొద్ది రోజులుగా ప‌వ‌న్ క‌ల్యాణ్, టీడీపీ చేస్తున్న ఆరోప‌ణ‌లు శృతి మించుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ వాటిపై వైసీపీ నేత‌లు, మంత్రులు స్పందిస్తున్నారు త‌ప్ప‌.. జ‌గ‌న్ మాత్రం ముఖ్య‌మంత్రిగా త‌న విధుల‌పైనే దృష్టి కేంద్రీక‌రిస్తున్నారు. దీంతో జ‌గ‌న్ మౌనం ప్ర‌తిప‌క్షాల‌కు అంతు చిక్క‌కుండా ఉంది. ప్ర‌జ‌ల నుంచి మాత్రం గుర్తింపు ల‌భిస్తోంది. ఇటీవ‌ల కాలంలో కూడా జ‌గ‌న్ ఎన్నో కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో రాష్ట్ర అభివృద్ధి అంశాల‌పై మిన‌హా.. రాజ‌కీయ అంశాల‌కు పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వ‌లేదు. త‌న చేత‌ల ద్వారా తానేంటో చూపుతున్న జ‌గ‌న్ తీరు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం అందుకుంటోంది.

Also Read : రెండున్నరేళ్ల జగన్ పాలన – సమాజం కేంద్రంగా జరుగుతోన్న అభివృద్ధి ఇదే

Show comments