Idream media
Idream media
రాజకీయాల్లో పార్టీల మధ్య పొత్తులు సహజం. ఒక పార్టీ ఒక్కొక్క ఎలక్షన్‌కు ఒక్కొక్క పార్టీతో పొత్తులు పెట్టుకున్న చరిత్ర తెలుగు రాజకీయాల్లో ఉంది. పొత్తులు పెట్టుకోవడం, ఆ తర్వాత విడిపోవడం సర్వసాధారణంగా జరిగేదే. పొత్తులు పెట్టుకునే సమయంలో తాము పొత్తు రాజకీయాలు చేస్తున్నామని ఇరు పార్టీల నేతలు బహిరంగంగా ప్రకటనలు చేస్తారు.అంతకు ముందు ఇరు పార్టీల నేతల మధ్య చర్చోప చర్చలు సహజం. పొత్తును తెంచుకునే క్రమంలో కొన్ని పార్టీలు.. బహిరంగంగా ప్రకటనలు చేస్తాయి. మరికొన్ని పార్టీలు తన సహచర మిత్రుడికి పరోక్ష సంకేతాలు ఇస్తాయి. ప్రస్తుతం ఇలాంటి పరోక్ష సంకేతాలనే జనసేన పార్టీ.. తన మిత్రుడైన బీజేపీకి ఇస్తోంది. ఈ సంకేతాలు బీజేపీకి అర్థమయ్యాయా..? లేదా..? అనేదే తెలియాల్సిన అంశం.
పొత్తు.. ప్రయాణం భిన్నం..
సాధారణంగా ఎన్నికల సమయంలో పార్టీల మధ్య పొత్తులు పొడుస్తాయి. సీట్లు పంచుకుని పోటీ చేస్తాయి. అయితే జనసేన, బీజేపీ పొత్తు ఇందుకు భిన్నంగా సాగింది. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్ధతు తెలిపిన జనసేన.. 2019 ఎన్నికల నాటికి వచ్చేసరికి వారితో పొత్తు తెంచుకుని కమ్యూనిస్టులు, బీఎస్పీలతో జత కట్టింది. ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ప్రతిపక్ష పార్టీలుగా ఉమ్మడి కార్యాచరణతో రాజకీయాలు చేస్తామని, 2024 ఎన్నికలే లక్ష్యం పని చేస్తామని బీజేపీ నేతలు ప్రకటించారు. కానీ జనసేన నేతలు ఎక్కడా బీజేపీతో కలసి అధికారంలోకి వస్తామని చెప్పలేదు.
కారణాలు ఏమైనా రెండేళ్లకే బీజేపీతో పొత్తును తెంచుకునేందుకు జనసేన ఆసక్తి చూపిస్తోంది. బీజేపీ నుంచి దూరంగా ఉండాలని భావిస్తోంది. అదే సమయంలో టీడీపీకి దగ్గరవ్వాలని జనసేన. జనసేన పార్టీని దగ్గరకు చేర్చుకోవాలని టీడీపీలు పరస్పరం ఆసక్తితో ఉన్నట్లు ఇటీవల జరిగిన పరిణామాలను బట్టీ స్పష్టంగా తెలుస్తోంది.
Also Read : బద్వేల్ ఉప ఎన్నిక మీద పవన్ కళ్యాణ్ కొత్త ప్రతివాదన
బద్వేల్ ఉప ఎన్నికను ఉపయోగించుకుని..
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న కారణంగా.. పొత్తు తెంచుకుంటున్నామని జనసేన బహిరంగంగా ప్రకటించలేకపోతోంది. అయితే పొత్తు తెంచుకుందామనే సంకేతాలను మాత్రం బలంగా ఇస్తోంది. బీజేపీకి దూరంగా జరగాలనే లక్ష్యంతో ఉన్న జనసేన.. అందుకు తాజాగా వచ్చిన బద్వేలు ఉప ఎన్నికలను ఓ అస్త్రంగా వాడుకుంది. బద్వేలు ఉప ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ అభ్యర్థులను ప్రకటించినా.. జనసేన, బీజేపీల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు వస్తున్న తరుణంలో.. పోటీపై పవన్‌కల్యాణ్, సోము వీర్రాజులు సమావేశమై చర్చించారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసింది కాబట్టి.. బద్వేలు ఉప ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని జనసేన అడిగినట్లు, కేంద్ర నాయకత్వాన్ని సంప్రదించి చెబుతామని బీజేపీ స్థానిక నేతలు చెప్పినట్లు.. వార్తలొచ్చాయి.
పరిణామాలు ఇలా జరుగుతుండగానే.. జనసేన పార్టీ బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేయడంలేదంటూ ప్రకటించింది. దివంగత ఎమ్మెల్యే సతీమణే పోటీ చేస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. అయితే బీజేపీ మాత్రం పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. పొత్తులో ఉన్న పార్టీలు పరస్పర విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుని ప్రకటించడంతోనే.. బీజేపీ, జనసేనల మధ్య పొత్తు వికటించినట్లుగా భావించొచ్చు. బద్వేలులో పోటీ చేసే అవకాశం తమకు ఇవ్వాలని జనసేన పార్టీ చేసిన ప్రతిపాదనపై బీజేపీ అగ్ర నాయకత్వం నిర్ణయం వెలువరించక ముందే.. తాము పోటీ చేయడంలేదంటూ జనసేన ప్రకటించడం బీజేపీతో పొత్తుపై ఆ పార్టీ స్టాండ్‌ను తెలియజేస్తోంది.
వేర్వేరు నిర్ణయాలు తీసుకున్న జనసేన, బీజేపీలు.. బద్వేలు ఉప ఎన్నికల సాక్షిగా అనధికారికంగా పొత్తును తెంచుకున్నాయనే భావించాలి. జనసేన తీరు.. బీజేపీకి అర్థం అయిందా..?లేదా..? అనేది ఇరు పార్టీలు పొత్తుపై బహిరంగంగా ప్రకటన చేస్తే తప్పా తెలియదు. ఇరు పార్టీల నుంచి అధికారికంగా పొత్తు విచ్ఛిన్నం ప్రకటన త్వరలో వచ్చే అవకాశాలు లేకపోలేదు. అయితే రెండు పార్టీలు ఒకేసారి ప్రకటన చేస్తాయా..? లేదా..? అనేదే ఇకపై ఆసక్తికరమైన అంశం.
Also Read : బద్వేల్ ఉప ఎన్నిక టీడీపీ, జనసేన ఔట్ : నిజంగా సానుభూతేనా? లేక ఈ కారణాలున్నాయా?