విలక్షణ నేత చిత్తూర్ మాజీ ఎంపీ శివప్రసాద్‌

నటుడు, దర్శకుడు, మాజీ ఎంపీ నారమల్లి శివప్రసాద్‌ రెండో వర్థంతి ఈ రోజు. 2019 సెప్టెంబర్‌ 21వ తేదీన ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. 1991లో చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పులిత్తివారి పల్లెలో జన్మించిన శివప్రసాద్‌ 68 ఏళ్ల వయస్సులో పరమపదించారు.

చంద్రబాబు, శివప్రసాద్‌లు క్లాస్‌మేట్స్‌. ఇద్దరూ ఆరో తరగతి నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకు కలసి చదువుకున్నారు. శివప్రసాద్‌ వైద్య వృత్తిని అభ్యసించారు. వైద్యునిగా పని చేస్తూనే నటనపై ఉన్న ఆసక్తితో సినిమాల వైపు వెళ్లారు. పాఠశాల స్థాయి నుంచే శివప్రసాద్‌ నాటకాలు వేసేవారు. ఆ ఆసక్తే ఆయన్ను సినిమాల వైపు తీసుకెళ్లింది. చిన్న చిన్న వేషాలతో ప్రారంభమైన ఆయన సినీ జీవితం.. ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారింది. విలన్‌ పాత్రలు కూడా పోషించారు. పలు సినిమాలకు దర్శకుడుగా పని చేశారు.

చంద్రబాబు ఆహ్వానం మేరకు శివప్రసాద్‌ 1998లో టీడీపీలో చేరారు. సత్యవేడు నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. చంద్రబాబు కేబినెట్‌లో సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రిగా పని చేశారు. మధ్యలోనే మంత్రిపదవి పోయింది. 

2004 ఎన్నికల్లో రెండోసారి సత్యవేడు నుంచి పోటీ చేసిన శివప్రసాద్‌ ఓడిపోయారు. 2009లో లోక్‌సభకు పోటీ చేశారు. చిత్తూరు లోక్‌సభ నుంచి గెలిచారు. 2014లోనూ రెండోసారి విజయం సాధించారు. 2019లో వైసీపీ నుంచి ఆహ్వానం ఉన్నా.. ఆయన టీడీపీలోనే కొనసాగారు. చిత్తూరు నుంచి మూడోసారి పోటీ చేసి ఓడిపోయారు. శివప్రసాద్‌ సోదరి పద్మజారెడ్డి 2017లో కాంగ్రెస్‌ పార్టీని వీడి వైసీపీలో చేరారు. ఆ పార్టీ గెలుపు కోసం పని చేశారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ.. పద్మాజా రెడ్డికి తగిన గుర్తింపునిచ్చింది. ఆమెను తిరుపతి స్మార్ట్‌ సిటీ చైర్‌పర్సన్‌గా నియమించింది.

ఉమ్మడి రాష్ట్రంలో 60 మంది పార్లమెంట్‌ సభ్యులు ఉన్నా.. శివ ప్రసాద్‌ది ప్రత్యేక శైలి. తన వ్యవహారశైలితో శివప్రసాద్‌ గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయంలో సినిమాను మిళితం చేశారు. నిరసన కార్యక్రమాల్లో చిత్రవిచిత్రమైన వేషాలు వేసిన శివప్రసాద్‌ను తెలుగు ప్రజలు బాగా గుర్తుపెట్టుకున్నారు.

Also Read : తొలి స్వదేశీ కలం రత్నం పెన్స్ అధినేత మృతి .

1994 ఎన్నికల వరకు టీడీపీ ఆధ్వర్యంలో చిన్న చిన్న బృందాలు గ్రామాలలో ప్రదర్శనలు ఇస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేవారు. మురళి మోహన్, రాజేంద్ర ప్రసాద్ లాంటి వారు కొంతమంది నటులతో బస్సు యాత్ర చేసేవారు.

1998 లోక్ సభ ఎన్నికల నుంచి ప్రచారం కొత్త రూపం తీసుకుంది. ఛానెల్స్ ప్రభావం పెరిగింది. ప్రచారం కోసం పార్టీలు టీవీ నటులతో ప్రకటనలు నిర్మించటం మొదలైంది. దర్శకుడు, నటుడైన శివ ప్రసాద్ టీడీపీ ఎన్నికల ప్రచారానికి కావలసిన ప్రకటనలను నిర్మించటంలో, నటులతో ఊర్లు తిరిగి కమ్యూనిస్ట్ పార్టీల తరహాలో ప్రచారం నిర్వహించే కార్యక్రమాలు రూపొందించారు. ఎన్నికల ప్రచారానికి కొత్త రూపాన్ని ఇచ్చిన దర్శకులు నారమల్లి శివప్రసాద్.

రాజీవ్ కనకాల మైక్ పట్టుకొని ఒక పూరి గుడిసె ముందు నిలబడి “రండి ,పేదల కష్టాలు తెలుసుకుందాం” అంటూ గుడిసెలోకి తొంగి చూసి లోపల గ్యాస్ స్టవ్, టీవీ లను చూసి నోరు వెళ్ళబెట్టటం, ఆ గృహిణి ముఖ్యమంత్రి చంద్రబాబు మా పేదరికాని పారదోలారు అనటం లాంటి ప్రకటనలు చాలానే తయారు చేశారు. వాటి ప్రభావం కూడా ఆ ఎన్నికల్లో టీడీపీ గెలవటానికి ఉపయోగపడింది.

మంత్రిగా ఉన్నా కూడా శివ ప్రసాద్ కి స్చేచ్ఛ లేకుండా కొందరు అనధికార నాయకులు పాలనలో జోక్యం చేసుకునేవారు. ఒక గ్రామ పర్యటనలో శివప్రసాద్ మీద కొందరు టీడీపీ నాయకులు నోరుపారేసుకున్నారు. శివప్రసాద్ మీరే పాలించుకొండి అంటూ ఎదురు గోడ మీద ఉన్న నరసింహనాయుడు సినిమా పోస్టర్ ను చించేశారు. ఈ విషయాన్ని టీడీపీ నాయకులు చిలువలు వలువలు చేసి చంద్రబాబుకి ఫిర్యాదు చేశారు. కట్ చేస్తే 2001 నవంబర్ 26న జరిగిన మంత్రివర్గ విస్తరణలో శివప్రసాద్ మంత్రి పదవి పోయింది. స్నేహమైన, బంధుత్వమైన చంద్రబాబు రాజకీయ కోణంలోనే చూస్తారనేందుకు ఇదో ఉదాహరణ.

Also Read : టార్గెట్ కుప్పం అసెంబ్లీ.. టీడీపీలో టెన్షన్ టెన్షన్…!

Show comments