Idream media
Idream media
ఎన్నికలంటే బారీ ర్యాలీలు, మోటారు సైకిళ్ల ర్యాలీలు, మైకులు, గుంపులు గుంపులుగా ప్రచారాలు, సందు గొందుల్లో కార్యకర్తలతో కలసి భారీ ప్రచారాలు, నామినేషన్ దాఖలు రోజు విజయానికి చిహ్నంగా భారీ ఊరేగింపులు.. ఇవన్నీ గతం. కరోనా వైరస్ అన్ని అంశాలతోపాటు ఎన్నికల నిర్వహణ తీరును కూడా పూర్తిగా మార్చివేసింది.
జనసమూహాలు ఎంత పెద్దవిగా ఉంటే.. వైరస్ వ్యాప్తి అంత అధికమయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ కఠిన ఆంక్షలు విధించింది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో స్వల్పంగా అంక్షలు అమలు చేయగా.. తాజాగా షెడ్యూల్ విడుదలైన ఉప ఎన్నికల్లో మాత్రం కోవిడ్ ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.
ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్, తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 8వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 11వ తేదీన ఉపసంహరణ, 13వ తేదీన పరిశీలన, తుది జాబితాను ప్రకటిస్తారు. 30వ తేదీన పోలింగ్, వచ్చే నెల 2వ తేదీన కౌటింగ్, ఫలితాలు వెల్లడించనున్నారు.
Also Read: హుజూరాబాద్ కాంగ్రెస్ రేసులో కొత్త ముఖం.. అసలు లెక్కలివే!
ఎన్నికల కమిషన్ విధించిన ఆంక్షల నేపథ్యంలో ఈ ఉప ఎన్నికలు మునుపటికి భిన్నంగా సాగనున్నాయి. జనసమూహంతో ర్యాలీలు, బైక్, కార్ల ర్యాలీలపై నిషేధం విధించారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో అభ్యర్థితోపాటు కేవలం ఒక్కరినే అనుమతించనున్నారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల సమీపంలోకి మూడు వాహనాలకే అనుమతి ఇచ్చారు. బహిరంగ సభలపై కూడా ఆంక్షలు విధించారు. కేవలం వేయి మందితో మాత్రమే బహిరంగ సభ జరుపుకోవాల్సి ఉంటుంది. ఇక వివిధ వర్గాల ప్రజలతో నిర్వహించే సమావేశానికి కేవలం 200 మందినే అనుమతిస్తారు. గ్రామాలు, పట్టణాలల్లోని కాలనీలలో 50 మందితోనే సమావేశాలు నిర్వహించుకోవాలని ఎన్నికల కమిషన్ నిబంధనలు పెట్టింది.
కేవలం మార్గదర్శకాలు జారీ చేయడమే కాదు.. వాటిని ఖచ్చితంగా అమలు చేసేందకు కేంద్ర ఎన్నికల సంఘం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంది. సభలు, సమావేశాల నిర్వహణలపై పోలీసుల పర్యవేక్షణ ఉంటుంది. సభలు, సమావేశాల నిర్వహణకు ముందుగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలి. సమావేశాలకు 200 మంది, సభలకు వేయి మందికి అనుగుణంగా పోలీసులు బారీ కేడ్లు ఏర్పాటు చేయనున్నారు. అందుకు అయిన ఖర్చు ఆయా పార్టీ అభ్యర్థులు భరించాలి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు.
Also Read: బద్వేల్ చరిత్రలో మూడో ఉప ఎన్నిక