YS Jagan Statement, Three Capitals – సమగ్రమైన, మెరుగైన బిల్లు మళ్లీ తెస్తాం.. మూడు రాజధానులపై సీఎం జగన్‌ ప్రకటన

రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసమే మూడు రాజధానుల ప్రతిపాదనను తెచ్చామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. సీఆర్‌డీఏ రద్దు బిల్లు, మూడురాజధానుల బిల్లులను వెనక్కి తీసుకునేందుకు నిర్ణయించిన కేబినెట్‌.. ఆ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. బుగ్గన రాజేంద్రనాథ్‌ ఈ రిపీల్‌ బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. ఈ అంశంపై సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడారు.

మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటామని కేబినెట్‌ నిర్ణయించడంతో.. ఈ అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ తరుణంలో సీఎం జగన్‌.. మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై వెనక్కి తగ్గలేదని తన ప్రకటన ద్వారా తేల్చి చెప్పారు. అందరి అనుమానాలు తీర్చేలా, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా చేస్తాం, మూడు రాజధానులను ఎందుకు ఏర్పాటు చేస్తామనే విషయం ప్రజలకు సమగ్రంగా తెలియజేసేలా, న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేలా.. సమగ్రమైన, మెరుగైన బిల్లును మళ్లీ తెస్తామని సీఎం వైఎస్ ‌జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు.

ఇదీ జగన్‌ ప్రకటన..

‘‘ 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టులు ఉన్నాయి. 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటైనప్పుడు హైదరాబాద్‌కు వీటిని తీసుకెళ్లాం. శ్రీభాగ్‌ ఒడంబడిక చేసుకుని రాయలసీమకు న్యాయం చేస్తామని చెప్పారు.

శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికకు భిన్నంగా, ఊహాతీతమైన ఆలోచనలతో గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక్కడ రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది గుంటూరు, విజయవాడలకు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఈ ప్రాంతమంటే నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. ఈ ప్రాంతంలోనే నా ఇళ్లు ఉంది. ఈ ప్రాంతమంటే ప్రేమ కూడా. ఇక్కడ రోడ్లు, కరెంట్‌ వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పనకు ఎకరాకు రెండు కోట్ల రూపాయలు, 50 వేల ఎకరాలకు లక్ష కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని చంద్రబాబు ప్రభుత్వమే లెక్కలు వేసింది. పదేళ్ల తర్వాత ఇదే లక్ష కోట్లు.. ఆరు లేదా ఏడు లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. కనీసం రోడ్డు వేసేందుకు, కరెంట్‌ ఇచ్చేందుకు కూడా మన వద్ద డబ్బులేదు. ఊహాతీతమైన ఆలోచనతో ఇదంతా చేశారు. ఇలా అయితే ఎప్పుడు నగరం కట్టాలి..? మన పిల్లలకు ఎప్పుడు ఉద్యోగాలు రావాలి..? ఇంకా ఇతర రాష్ట్రాలకు వెళ్లాలా..?

విశాఖ ఇప్పటికే పెద్ద నగరం. కొంత దృష్టి పెడితే.. మరో పదేళ్లకు హైదరాబాద్‌ వంటి నగరంతో విశాఖ పోటీ పడుతుంది. ఇది వాస్తవమైన పరిస్థితి. ఈ వాస్తవ పరిస్థితిని గుర్తెరిగే.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధిలో పరిగెత్తాలని మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని అనుకున్నాం. మూడు ప్రాంతాల ప్రజలకు.. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా మంచి జరగాలని ఈ ప్రతిపాదన చేశాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రతిపాదనపై రకరకాలుగా అపోహలు సృష్టిస్తూ, న్యాయపరమైన చిక్కులు తెస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రకటన చేయాల్సి వస్తోంది.

వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత.. అది అమలు జరిగి ఉంటే.. దాని ఫలితాలు ఇప్పటికే వచ్చేవి. నాటి శ్రీభాగ్‌ ఒడంబడిక స్ఫూర్తితో ఉత్తరాంధ్రతో సహా అన్ని ప్రాంతాల అభివృద్ధికి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టాం. గతంలో అభివృద్ధి కేంద్రీకరణ వల్ల ప్రజలు ఎలాంటి వ్యతిరేకత చూపించారో 2014 ఎన్నికల్లో చూశాం. మళ్లీ హైదరాబాద్‌ లాంటి సూపర్‌ క్యాపిటల్‌ వద్దు. మళ్లీ ఇలాంటి పరిస్థితి వద్దని ప్రజలు తీర్పు ఇచ్చారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు పరిగణలోకి తీసుకున్నాం కాబట్టే రెండున్నరేళ్లలో ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు.

అయితే వికేంద్రీకరణకు సంబంధించి అనేక అపోహలు, అనుమానాలు, కోర్టు కేసులు, వివాదాలు, దుష్ప్రచారాలు ఈ రెండేళ్లలో చేశారు. అందరికీ న్యాయం చేయాలన్న సదుద్దేశాన్ని పక్కనబెట్టి.. కొందరికి అన్యాయం జరుగుతుందనే వాదనను కొంత మంది ముందుకు తెచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో.. మూడు రాజధానుల బిల్లులోని సదుద్దేశాన్ని వివరించేందుకు, బిల్లులోనే అన్ని విషయాలు పెట్టేందుకు, అన్ని విషయాలు వివరించేందుకు, అన్ని విషయాలు ప్రజలకు అర్థమయ్యేలా తెలియజేసేందుకు, మరిన్ని విషయాలు బిల్లులో పెట్టేందుకు, ఇంతకు ముందు చెప్పిన అంశాలను బిల్లులో పెట్టేందుకు ఈ బిల్లును వెనక్కి తీసుకుంటున్నాం. మరింత సమగ్రమైన, మెరుగైన బిల్లు సభ ముందుకు వస్తుంది. విస్తృత, విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నాం’’ అని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వివరించారు.

Also Read : Three Capitals Bill – మూడు రాజధానులపై ఏపీ సర్కార్‌ సంచలన నిర్ణయం

Show comments